రామగుండం, న్యూస్‌లైన్ : యైటింక్లయిన్‌కాలనీలోని అల్లూరు ప్రాంతానికి చెందిన ఏగోలపు స్వామిగౌడ్ ప్రైవేట్ బస్సు డ్రైవర్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. అతడి భార్య కావ్య(24) ఉరఫ్ సుమతి గర్భం దాల్చడంతో ప్రతీనెలా పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోంల్‌లో చికిత్స చేయిస్తున్నారు. కావ్యకు తొమ్మిది నెలలు నిండడంతో ఈ నెల 28న డెలివరీ అవుతుందని వైద్యులు చెప్పారు. గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి లో ప్రసవాలు మంచిగా చేస్తున్నారని అల్లూరులోని ఏఎన్‌ఎం, ఆశావర్కర్ సూచించారు.
దీంతో కుటుంబసభ్యులు కావ్యను శనివారం ఉదయం 7గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యు లు కావ్యకు ప్రసవం చేయడం హైరిస్క్ అని చెబుతూనే వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని సూచించారు. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి, లేబర్ రూంలో రాత్రి 10.30 గంటలకు డాక్టర్లకు బదులు నర్సులే ప్రసవం(చిన్నాపరేషన్) చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో కావ్య, భర్త స్వామి, కావ్య తల్లి రాజేశ్వరి ఆనందపడ్డారు. పిల్లలను చూసిన కావ్య నవ్వుతూ సంతోషంతో వారిని ముద్దాడింది. అర్ధరాత్రి దాటాక ఇద్దరు పిల్లలను పిల్లల వైద్యనిపుణుడి పర్యవేక్షణ కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అదే సమయంలో కావ్యకు రక్తస్రావం ఎక్కువైంది. ఆస్పత్రిలో అత్యసవర మందులు లేవని చెప్పిన వైద్య సిబ్బంది ప్రైవేట్ మెడికల్ షాపులో ఒక ఇంజక్షన్, ఆరు టాబ్లెట్లు తీసుకురావాలని చిట్టి రాసి పంపించారు. అర్ధరాత్రి తర్వాత ఒక్క మెడికల్ షాపు కూడా తెరిసి ఉండకపోడంతో నగరం మొత్తం మందుల కోసం పరుగులు తీశారు. చివరికి ఓ మెడికల్ షాపు నుంచి కొనుగోలు చేసి ఆస్పత్రికి రాగా అప్పటికే కావ్య చనిపోయిందని సిబ్బంది చెప్పారు. దీంతో ఒక్కసారిగా స్వామి, కావ్య తల్లి కుప్పకూలారు.. మృతురాలి బంధువులు ఆగ్రహంతో ఆస్పత్రిలోని అద్దాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు వేకువజామున ఆస్పత్రికి వచ్చి భద్రత చర్యలు తీసుకున్నారు.
విషాదం
స్వామికి కావ్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న పెళ్లయింది. స్వామి తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా కావ్య తండ్రి చిన్నప్పుడే చని పోయాడు. కవల పిల్లలకు జన్మనిచ్చి కావ్యకూడా దూరం కావడంతో స్వామితోపాటు ఆమె తల్లి గుండెలవిసేలా రోదిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యమే...
డెలివరీ అయ్యాక అందరితో మంచిగా మాట్లాడిన కావ్య రక్తస్రావంతో చనిపోవడానికి వైద్యులే కారణమని భర్త స్వామి, మృతురాలి తల్లి రాజేశ్వరి ఆరోపించారు. ప్రసవం కోసం వస్తే నరకం చూపించి కావ్య ప్రాణం తీశారని విలపించారు. ఉదయం 7 గంటలకు ఆస్పత్రికి తీసుకొస్తే, రాత్రి 10.30 గంటలవరకు పురిటినొప్పులతో తల్లడిల్లిందన్నారు. ప్రసవం చేయడానికి ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరని రోదించారు. ఎలా చనిపోయిందని నిలదీస్తే, ఎక్కడెక్కడ వైద్యం చేయించుకున్నారో వివరాలెందుకు చెప్పలేదని పొంతలేని ప్రశ్నలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావ్య ప్రసవించిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది రూ.1,800 వసూలు చేశారని బంధువులు ఆరోపించారు.
ఎవరిని వదలం
ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత చనిపోయిందని తెలియడంతో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించి వివరా లు తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమని తేలితే ఎవరిని వదిలిపెట్టేది లేదని, న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
వైద్యులు, నర్సులపై కేసు
వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. స్వామి ఫిర్యాదు మేరకు... ప్రసవం చేసిన నర్సులు నాన్సీ, పుష్ప, స్వాతితోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వచ్చిన ఆరోపణలపై సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, డ్యూటీ డాక్టర్ సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వలీబాబా తెలిపారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మృతదేహానికి పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
ధర్మాస్పత్రిలో.. దారుణం
Published Mon, Nov 4 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement