దుర్గమ్మా.. దర్శనం భారమేనమ్మా..
రాష్ర్టంలోనే అతిపెద్ద ఉత్సవాలు..
రూ.4కోట్ల అంచనా వ్యయం..
లక్షల్లో వచ్చే భక్తులు..
అయినా, కానరాని సౌకర్యాలు..
మందకొడిగా పనులు..
ఇదీ ప్రస్తుతం దుర్గగుడిపై జరుగుతున్న దసరా ఉత్సవ ఏర్పాట్ల పరిస్థితి. ఉత్సవాలకు ఇంకా ఐదు రోజులే సమయం ఉన్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కొన్ని పనులు అసంపూర్ణంగానే ఉన్నాయి. కెనాల్‌రోడ్డు నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల నుంచి సాంస్కతిక వేదిక వరకు ఏదీ పూర్తికాలేదు. స్నానఘాట్లలో నదీ ప్రవాహం భయపెడుతున్నా.. పటిష్టమైన రక్షణ చర్యలు శూన్యమనే చెప్పాలి. ఏటా ఇందే తంతు జరుగుతున్న ఆలయ అధికారుల్లో కనీస మార్పు రావట్లేదు. ఏర్పాట్లపై మూడు నెలల ముందుగానే రెవెన్యూ, పోలీసు, దేవాదాయ అధికారులు సమాలోచన చేసి ఉంటే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు అమ్మవారి మూలధనం వృథా కాకుండా అరికట్టగలిగే వారని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అడుగడుగునా వెక్కిరిస్తున్న దసరా ఉత్సవ ఏర్పాట్లను ఒకసారి పరిశీలిస్తే..
- విజయవాడ
మహామండపం వద్ద పనులు పూర్తయ్యేదెన్నడో..
మహామండపం కింది అంతస్తులో ప్రసాదాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండగా.. ఇంతవరకు ఆ పనులు పూర్తికాలేదు. మరోవైపు మహామండపం ప్రాంగణమంతా చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కొండ దిగేందుకు మహామండపంవైపు క్యూలైన్‌తో పాటు మల్లేశ్వరాలయం పాతమెట్లను వినియోగిస్తున్నారు. దీంతో మహామండపం నుంచి కిందకు దిగే భక్తులకు కష్టాలు తప్పేలా లేదు.
ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే..
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈసారి కూడా కెనాల్‌రోడ్డు నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్‌లోనే రావాలి. అమ్మవారి సన్నిధిలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మహామండపం ఈ ఏడాది పూర్తికానుందని ముందు నుంచే ఆలయ అధికారులు చెబుతున్నా.. పనులు ఇంకా పూర్తికాకపోవడంతో క్యూలైన్లు సిద్ధంచేశారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా దర్శనానికి సుమారు ఐదు కిలోమీటర్లు నడవాలి.
ఇంకా హడావుడి పనులేనా..
ఉత్సవాలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగా, అధికారులు ఇప్పటికిప్పుడు హడావుడి పనులు చేపట్టారు. ఉత్సవాలు ముంచుకొస్తున్న తరుణంలో పనులు వేగవంతం చేస్తున్నారని, ముందుగా ప్రారంభిస్తే ఈపాటికి పూర్తయ్యేవని భక్తులు చెబుతున్నారు.
స్నానఘాట్లలో చర్యలు శూన్యం
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తొలుత కృష్ణానదిలో పుణ్య స్నానమాచరిస్తారు. ఈసారి కృష్ణానదికి వరద పోటు కారణంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. సీతమ్మ వారి పాదాలు, కనకదుర్గాఘాట్, భవానీపురం పున్నమీ ఘాట్లలో జల్లు స్నానాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలోకి ఎవరూ దిగకుండా పటిష్టమైన బారికేటింగ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా జరుగుతున్న పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి.
సాంస్కృతిక వేదిక ఎక్కడ?
ఉత్సవాల్లో అమ్మవారికి నీరాజనాలు అర్పించేందుకు కళాకారులు పరితపిస్తుంటారు. ఇందుకోసం సాంస్కృతిక ప్రదర్శనలకు మహామండపం పక్కనే, పాత మెట్లమార్గం వద్ద వేదిక ఏర్పాటుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇంతవరకు పనులు ప్రారంభంకాలేదు. ఇక్కడ కళావేదిక ఏర్పాటుచేయడం ద్వారా ప్రదర్శనలను తిలకించే అవకాశం లేదని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. మహామండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
మల్లేశ్వరాలయం మాటేమిటీ?
దుర్గగుడిలో రూ.4 కోట్ల అంచనాతో ఉత్సవాలు నిర్వహిస్తుండగా, ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వరాలయం కనీసం రంగులు వేసే భాగ్యానికి కూడా నోచుకోలేదు. ఐదేళ్లుగా ఈ ఆలయానికి రంగులు వేయకపోవడంతో గోపురం వెలిసిపోరుు కనిపిస్తోంది.