తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొదలుకొని.. గోడలపై రాతల పూతల వరకు ఒకటే ప్రచారం..
►పొదుపు మొత్తంలాగే వాడుకోవాలని ఆదేశాలు
►మండిపడుతున్న డ్వాక్రా మహిళలు
►మాఫీ ఎవరు ప్రకటించమన్నారు..?
►అధికారులను నిలదీసిన మహిళలు
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొదలుకొని.. గోడలపై రాతల పూతల వరకు ఒకటే ప్రచారం.. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే.. డ్వాక్రా మహిళల రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తారంటూ ఊదరగొట్టిన తెలుగు తమ్ముళ్లు నేడు జనంలోకి రావాలంటేనే జంకుతున్నారు. మొన్న రైతులకు రుణమాఫీ పేరుతో కేవలం వడ్డీకి కూడా సరిపోనంత సొమ్మును అందించి చేతులు దులుపుకున్న బాబు.. ప్రస్తుతం డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధి పేరుతో ఇస్తున్న సొమ్మును కూడా పొదుపు మొత్తం లాగే వాడుకోవాలని ఆదేశాలు ఇవ్వడం డ్వాక్రా మహిళల్లో ఆగ్రహావేశానికి గురిచేసింది.
ప్రస్తుతానికి మాఫీ చేయలేనని.. ఒకేసారి రూ.10వేలు ఇస్తానంటూ బహిరంగ సభల్లో ప్రకటించిన చంద్రబాబు.. లోటు బడ్జెట్ పేరుతో ఈసారికి రూ.3వేలు మాత్రమే ఇచ్చి.. తర్వాత కంతుల ప్రకారం మిగతా సొమ్మును చెల్లిస్తామని పేర్కొనడం కూడా మహిళలను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం జమచేసే రూ.3వేలు కూడా వాడుకోకుండా గ్రూపు మొత్తం మీద వచ్చే సొమ్మునంతా పొదుపులాగే అకౌంట్లల్లో ఉంచుకొని వడ్డీని మాత్రమే తీసుకోవాలని మెలిక పెట్టడంపై తీవ్రస్థాయిలో మహిళలు మండిపడుతున్నారు. రుణమాఫీ ప్రకటించడమెందుకు.. ఇప్పుడు జారుకోవడమెందుకంటూ మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు.
చంద్రబాబు రుణమాఫీ చేయాల్సిందే... :
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రుణమాఫీ చేసి తీరాల్సిందేనంటూ డ్వాక్రా మహిళలు నినదిస్తున్నారు. బుధవారం మండలస్థాయిల్లో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశాలన్నింటిలోనూ తీవ్రస్థాయిలో మండిపడిన మహిళలు గురువారం నియోజకవర్గస్థాయిలో జరిగిన డ్వాక్రా మహిళల సదస్సుల్లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజుపాలెంలో సదస్సు సందర్భంగా చంద్రబాబు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని డ్వాక్రా మహిళలంతా నినాదాలు చేశారు.
పేరుకు మాఫీ చేస్తున్నారని మహిళలను మోసం చేయడం అన్యాయమంటూ వారు దుమ్మెత్తిపోశారు. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, వేంపల్లె, వేముల, రాజంపేట, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, రాజంపేట, మైదుకూరు, బద్వేలు, కడప ఇలా అన్నిచోట్ల మహిళలు అధికారులను నిలదీస్తున్నారు.
అకౌంటులోనే పెట్టుకోవాలని నిబంధన పెట్టడం ఏమిటి.. :
ఎన్నికలలో డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కేవలం మూడు వేలు చేసినారు. అది కూడా సంఘం అకౌంట్‌లో వేసుకోవాలని తీసుకోకూడదని నిబంధన పెట్టడం దారుణం. ఇంత మాత్రానికి రుణ మాఫీ అని చెప్పడం ఎందుకు.
అంతా మాఫీ చేస్తామని చెప్పి కేవలం మూడు వేలేనా...
ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి నమ్మించారు. ఇప్పడు ఏడాది తర్వాత కేవలం మూడు వేలు రుణమాఫీ చేసినట్లు సంఘాల అకౌంటులో గ్రూపునకు రూ.30వేలు వేశారు. ఈ డబ్బును సంఘం నిధిలో జమా చేయాలని నిబంధన పెట్టారు. ఇదేనా చంద్రబాబు రుణమాఫీ.
- వి.లక్ష్మిదేవి(శ్రీ తేజ గ్రూపు లీడర్) ఎర్రగుంట్ల
మాఫీ చేయాలి.. :
డ్వాక్రా మహిళలకు ఇచ్చే మొత్తం పూర్తిగా మాఫీ చేయాలి. రూ.10 వేలు మూడు విడతలుగా కాకుండా ఒక్కసారే ఇవ్వాలి.
- కొండమ్మ(డ్వాక్రా సంఘ సభ్యురాలు) రాజుపాళెం
డ్వాక్రా మహిళలను మభ్యపెడుతున్నాడు :
డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు రుణం మాఫీ చేస్తామని చెప్పి మభ్యపెడుతున్నారు. రూ.10 వేలు ఇచ్చి తిరిగి మళ్లీ కట్టమని చెప్పడం ఏమిటి.
- ప్రభావతమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు , రాజుపాళెం