తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఒక మినీ మానిఫెస్టోని ప్రకటించారు. అందులో కొన్ని చిత్రమైన సంగతులు ఉన్నాయి. పరస్పర వైరుధ్య విషయాలు ఉన్నాయి. ఇతర పార్టీలను కాపీ కొట్టిన వైనం ఇట్టే తెలిసిపోతుంది. అందులోనూ వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అమలు చేస్తున్న స్కీములను, అలాగే, ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కొన్ని స్కీములను కాపీకొట్టిన విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
సీఎం జగన్‌ను ద్వేషిస్తూనే ఆయన స్కీములను తాము కూడా అమలు చేస్తామని చంద్రబాబు పరోక్షంగా చెప్పడంలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభుత్వం మళ్లీ గెలుస్తుందని ఒప్పుకున్నట్టు అయ్యింది. ఎన్నికల ప్రణాళిక ఏడాది ముందుగా ప్రకటించడం తప్పుకాదు. ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రయత్నాలు తాను చేసుకుంటుంది. కానీ, ఆ ప్రణాళికకు ఒక పవిత్రత ఉందని, దానిని భగద్గీత మాదిరి అమలు చేస్తామని చెప్పే ధైర్యం ఉండాలి. గతంలో తమ పార్టీ ఇచ్చిన మానిఫెస్టోల గురించి చెప్పి, వాటిలో ఎన్ని అమలు చేశాం, ఎన్ని చేయలేదు? దానికి కారణాలు ఏమిటి? అన్నవాటి గురించి చెప్పగలగాలి. ఏదో ప్రజల చెవిలో పూలు పెట్టవచ్చులే అన్నట్లుగా ఎన్నికల ప్రణాళికలను ప్రకటించి, అధికారంలోకి వచ్చాక వాటిని చెత్తబుట్టలో గిరాటేసినట్లు వెబ్ సైట్ నుంచి తొలగించవచ్చనుకుంటే ఆ రోజులు పోయాయని చెప్పాలి.
ఇప్పుడు ప్రతిదీ రికార్డు అవుతోంది. క్షణాలలో అసలు నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా ప్రకటించిన ప్రణాళికలోని అంశాల గురించి చూద్దాం. అందులో ఒక కీలకమైన విషయం ఏమిటంటే పేదలందరిని ధనికులుగా చేస్తామని.. దానికేదో ఫోర్ పీ అని పేరు పెట్టారు. అది వారి ఇష్టం. ఇక్కడ వచ్చే సందేహం ఏమిటంటే అందరిని ధనికులు చేసేస్తామని ప్రకటించిన తర్వాత సంబంధిత స్కీము ఏదో అమలు చేస్తే సరిపోయేదానికి మళ్లీ పలు ఇతర హామీలను ఎందుకు ఇస్తున్నట్లు?. ఇక్కడే ఒకదానికి మరొకదానికి పొంతన కనిపించడం లేదు. ఒకవైపు మహిళలు, యువకులు, రైతులకు పలు తాయిలాలను ఇస్తామని చంద్రబాబు చెప్పారు. మరో వైపు అసలు పేదలే లేకుండా అందరిని ధనికులను చేసే మంత్రం ఏదో తమ వద్ద ఉందని అంటున్నారు. వీటిలో ఏది నమ్మాలి?.
గత కొద్ది రోజులుగా పేదలను కోటీశ్వరులను చేస్తానని అనేవారు.. దానిని మార్చి ధనికులు అన్న పదం వాడినట్లు ఉన్నారు. అది ఎలా సాధ్యమో చెప్పలేకపోయారు. కానీ, ఒక బలహీన వాదన పెట్టారు. ధనికులుగా ఉన్నవారు పేదలను దత్తత తీసుకోవాలట. దాంతో పేదలు ధనికులైపోతారట. గతంలో కనుక మీరంతా ఇటుకలు ఇవ్వండి.. రాజధాని కడతా అన్నట్లుగా ఉంది. ఎన్నికల తర్వాత నిజంగానే అధికారం వస్తే అప్పుడు ఏమి చెప్పవచ్చు. ఎవరూ పేదలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దానికి తానేం చేయను అంటూ ప్రజలను బురిడి కొట్టించవచ్చన్నమాట.
ఇతర వాగ్దానాలను పరిశీలిద్దాం. బడికి వెళ్లే పిల్లలకు ఏడాదికి పదిహేనువేల చొప్పున ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అంటే సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అమలు చేస్తున్న అమ్మ ఒడి స్కీమ్‌ను కాపీ కొట్టడం అన్నమాట. ఇంతకాలం అమ్మ ఒడి, నాన్న బుడ్డి అంటూ అవహేళన చేసిన చంద్రబాబు ఏ ముఖంతో దానిని ప్రకటిస్తారని అడిగితే సమాధానం దొరుకుతుందా?. అయితే, సీఎం జగన్ ప్రతి కుటుంబంలో చదువకునే ఒక్కరికే దీనిని ఇస్తున్నారని, తాను అధికారంలోకి వస్తే కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నా, ఎంతమంది ఉన్నా అమలు చేస్తానని తెలియచేశారు. అది నిజంగా సాధ్యం అవుతుందా?. సీఎం జగన్ ఈ స్కీమ్‌కు ఏడాదికి సుమారు 6500 కోట్లు ఖర్చు చేస్తుంటే, చంద్రబాబు డబుల్, త్రిబుల్ ఖర్చు చేయాలన్నమాట.
అసలు ఏ స్కీమ్‌కు ఎంత వ్యయం అవుతుందో చంద్రబాబు వంటి సీనియర్ చెప్పాలి కదా!. ఊరికే ఏదో ఒకటి చెప్పేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా!. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లనుంచి 59 ఏళ్లవరకు ఉన్న మహిళలందరికి నెలకు 1500 రూపాయలు ఇస్తారట. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాగ్దానమే చేసింది. అక్కడ వాళ్లు రెండువేల రూపాయలు ఇస్తామని అన్నారు. దానిని చంద్రబాబు కాపీ కొట్టారు. ఏడాదికి 18 వేల రూపాయలు ఇస్తామని ఆయన తెలియచేశారు. ఈ స్కీమ్ అమలు చేయాలంటే 36 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని బీజేపీ నేత ఒకరు లెక్కగట్టారు. నిజానికి సీఎం జగన్ బలహీనవర్గాలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల మహిళలు స్వయం ఉపాధి నిమిత్తం ఏడాదికి 10వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు. అది వారికి కొంత ఉపయుక్తంగా ఉంటోంది.
వివిధ కార్పొరేట్ సంస్థలతో టై అప్ చేసి వారి వ్యాపారాలకు, తయారుచేసే ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సహకరిస్తున్నారు. చంద్రబాబు అలాకాకుండా నెలనెలా 1500 ఇస్తామంటున్నారు.అది ఎటూ కాకుండా పోతుందన్నమాట. పైగా అందరికి ఇస్తామన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. అలా ఇవ్వాలంటే ఎన్నివేల కోట్లు అవసరమో చెప్పరు. అధికారం వస్తే అర్హులు అన్న పదం వాడి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారన్నమాట. ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీని ఆయన వెల్లడించారు. దీన్ని కర్నాటకలో బీజేపీ మేనిఫెస్టో నుంచి తీసుకున్నారు. ఆయన గతంలో దీపం పథకం పెట్టారట. దానిని జగన్ ఆర్పేశారట. ఇంతకన్నా నీచపు ఆరోపణ ఉంటుందా? ఆ స్కీమ్ వచ్చినప్పుడు సీఎం జగన్ రాజకీయాలలోనే లేరు. సిలిండర్ల ధర 1200కి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వ సంస్థలైతే, ప్రధాని మోదీని అనే దమ్ము లేక, ఇలా సందర్భం లేకుండా సీఎం జగన్‌పై మాట్లాడటం ఆయనకే చెల్లింది.
నిజానికి దీపం పథకం అన్నది వాజ్ పేయ్ ప్రభుత్వం నుంచి వచ్చింది. దేనినైనా తన ఖాతాలో వేసుకోగల నేర్పరి కనుక తనదే ఆ స్కీమ్ అంటున్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఫ్రీ అట. ఢిల్లీలో ఆప్ ఈ స్కీమ్‌ను పెట్టింది. దానిని కర్నాటక కాంగ్రెస్ కాపీ కొడితే, దీనిని చంద్రబాబు కాపీ కొట్టారన్నమాట. ఢిల్లీ అంటే ఒకే నగరం కనుక కొంత సాధ్యపడవచ్చు. కానీ, కర్నాటక, ఏపీలో అలా ఫ్రీ ట్రావెల్ ఇస్తామని అంటే ఆర్టీసీ పరిస్థితి ఏమవుతుంది. ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? ఎంత అని ఇస్తుంది. ఇది ఒక ఫాల్స్‌గా మారే అవకాశమే కనిపిస్తుంది. కర్నాటకలో ఈ స్కీమ్ అమలులో అనేక షరతులు పెట్టేశారు. దానిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
కుటుంబ నియంత్రణ కూడా చంద్రబాబే కనిపెట్టారట. ఎప్పుడో 1960, 1970 దశకాల్లో కేంద్రం ఆరంభిస్తే, అది తానే ప్రోత్సహించానని, అది తప్పు అయిందని చంద్రబాబు అంటున్నారు. ఊళ్లో వాళ్లందరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతున్న ఆయన తన కుమారుడికి కూడా చెప్పారో? లేదో?. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించేస్తారట. ఈలోగా ప్రతి యువకుడికి మూడువేల రూపాయల భృతి ఇస్తారట. 2014 మేనిఫెస్టోలో కూడా ఈ వాగ్దానం చేసి ఎందుకు అమలు చేయలేదు?. ఇప్పుడు చేస్తామంటే ఎవరైనా విశ్వసిస్తారా?. రైతులకు ఏడాదికి 20వేల రూపాయలు ఇస్తామని మరో హామీ ఇస్తున్నారు. గతంలో 89 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి 15 వేల కోట్లు కూడా చేయలేని పరిస్థితిపై ఎందుకు వివరణ ఇవ్వరు?. పైగా రుణమాఫీ చేసేశామని అసత్య ప్రచారం చేసుకుంటుంటారు.
ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తామని అంటున్నారు. అంటే దాని అర్ధం తాను అధికారంలో ఉన్న పద్నాలుగేళ్లలో ఆ పని చేయలేకపోయానని, వైఫల్యం అని ఒప్పుకున్నట్లే కదా!. బీసీలకు రక్షణ చట్టం అని మరొకటి చెప్పారు. చిత్రం ఏమిటంటే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని వాదించిన తెలుగుదేశం అధినేత ఇప్పుడు కులాల గురించి, మతాల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చెప్పుతో కొట్టాలని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను,కొందరు పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి ఎన్నిసార్లు మత ప్రస్తావన చేశారో చంద్రబాబుకు గుర్తు లేదేమో!.
తొలి మేనిఫెస్టో ఈ విధంగా పరస్పర విరుద్దంగా, ప్రజలను మోసం చేయడం ఎలా అన్న దిశగా సాగినట్లు ఉంది తప్ప చిత్తశుద్దితో లేదు. ఇంతకాలం జగన్ సంక్షేమ స్కీములతో రాష్ట్రం నాశనం అయిపోయిందని, శ్రీలంక అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టవీ5 వంటి మీడియాకు ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలోని సంక్షేమ హామీలు వేయి స్వరాల వీణల్లా వినిపిస్తున్నాయేమో. జగన్ బటన్ నొక్కడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించిన చంద్రబాబు తాను అంతకంటే ఎక్కువ నొక్కుతానని అంటున్నారు. ఎల్లో మీడియా ఇంతకాలం అబద్దాలు ప్రచారం చేసిందని చంద్రబాబు ఇచ్చిన హామీలు స్పష్టం చేస్తున్నాయి. సీఎం జగన్‌ను రాష్ట్ర మహిళలు ఆదరిస్తున్నారని, మరోసారి పట్టంకట్టబోతున్నారని అర్ధం చేసుకున్న తెలుగుదేశం ఇప్పుడు అదే రాగం అలపించడానికి యత్నిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే అమలు చేస్తున్నవాటి కోసం మళ్లీ చంద్రబాబును నమ్మి మోసపోవడం ఎందుకు అని జనం అనుకోరా!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment