సాక్షి, కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ ప్రస్తుతం ఆధునిక హంగులు సంతరించుకోబోతోంది. త్వరలో జిల్లాలో ‘ఈ-మార్కెట్’ వ్యవస్థ రైతులకు కొంతమేర అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో ‘ఈ-మార్కెటింగ్’ వ్యవస్థ విజయవంతమైన తర్వాత ప్రభుత్వం ఏపీలో కూడా ఈ విధానం అమలు చేయాలని భావించింది.
రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రంలోని గుంటూరు, ఖమ్మం, వరంగల్ నిజామాబాద్, కేసముద్రం, మిర్యాలగూడెం వ్యవసాయ మార్కెట్లలో నవంబరు 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.ఈ నేపథ్యంలో రెండో విడతలో భాగంగా కర్నూలులో ‘ఈ-మార్కెట్’ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలో దిగ్విజయంగా ఈ వ్యవస్థను అమలు చేసిన సంస్థ ప్రతినిధులతో జిల్లా అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో జిల్లావ్యాప్తంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
రైతులకెన్నో ప్రయోజనాలు..
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే అధికారులు ఆన్‌లైన్‌కు అనుసంధిస్తారు. సరుకు లోపలికి తెచ్చేడానికి బయటకు పంపేదానికి ఎలాంటి తేడాల్లేకుండా ఉండటానికి ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేస్తారు.
సంబంధిత రైతు సరుకును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. సీసీ కెమోరాలను కూడా ఉంచుతారు. ప్రతి రైతు పేరు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌లో నమోదవుతుంది. సరుకు ఎంట్రీగేటు దగ్గర కంప్యూటర్‌లో నమోదు కాగానే లాట్ నంబరు కేటాయిస్తారు. అదే నంబరును సరుకు దగ్గర ఉంచుతారు.
కమీషన్ ఏజెంట్లకు, కొనుగోలుదారులకు ఐటీ నంబరు ఇస్తారు. ప్రతిరోజు వీలైనంత త్వరగా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు. బహిరంగ వేలం కాకుండా కొనుగోలుదారులు చెల్లించే ధరను సరుకు దగ్గర నమోదు చేస్తారు. ఈ ధర మరో కొనుగోలుదారుడికి తెలియదు.
సరుకు ఎంత ధర పలికింది. సంక్షిప్త సమాచారం ద్వారా రైతుకు తెలియజేస్తారు. గిట్టుబాటు అయితే విక్రయించుకోవచ్చు. లేదా మరుసటి రోజు అమ్ముకోవచ్చు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి రైతుకు గిట్టుబాట ధర లభించే అవకాశం ఉంది.
దేశంలోని ఏ మార్కెట్‌లో అయినా సరే ఏ పంటకు ఎంత ఉందనే విషయం గురించి కూడా ఇక్కడ రైతులు తెలుసుకోవచ్చు. మార్కెట్లోకి వచ్చి ధర విషయంలో దగాపడకుండా ఇంటి దగ్గర సంక్షిప్త సమాచారం ద్వారా ధర తెలుసుకున్న తర్వాతనే గిట్టుబాటు అవుతుందనుకుంటేనే మార్కెట్‌కు విక్రయానికి తెచ్చుకోవచ్చు. మార్కెట్‌లో గతంలో అక్రమాలకు ఇలాంటి విధానం ద్వారా తావుండదని అధికారులు భావిస్తున్నారు.
రైతులు వెంటనే తక్‌పట్టీలు తీసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలుంటాయి ఇక్కడ. ప్రతిరోజు ఎంత సరుకు వచ్చింది, ఎంత బయటకు పోయింది కశ్చితంగా నమోదవుతుంది. మార్కెట్‌కు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది.