
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ- ఓటింగ్
కర్నూలు (ఆదోని) : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2019లో జరిగే ఎన్నికలు) ఈ-ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్న ఓటరు కార్డుకు ఆధార్ సీడింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఐలకు ఈ-ఓటింగ్ ద్వారా అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రవేశ పెట్టిన ఈ-ఓటింగ్ విధానాన్ని స్థానిక ఓటర్ల కోసం కూడా అమలు చేయవచ్చన్నారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈ-ఓటింగ్ విధానం అమలు చేయడం వల్ల ఖర్చు ఆదా అవుతోందని, పోలింగ్‌లో పారదర్శకత పెరుగుతుందన్నారు.
జనాభా కన్నా ఓటర్లు ఎక్కువగా ఉన్నారనే ప్రచారంలో నిజం లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయిందని, ఈ నెల చివరిలోగా వందశాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆగస్టు 1న తప్పులు లేని ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల రీత్యా స్థానాలను పెంచే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. పార్లమెంట్ మాత్రమే ఈ విషయమై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.