గాడిలో పడిన ఎంసెట్ కౌన్సెలింగ్
Published Thu, Aug 22 2013 2:49 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిచిన సంఘటనతో దిగివచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. కౌన్సెలింగ్ ప్రారంభమైన మూడు రోజుల వ్యవధిలో జిల్లాలోని రెండు పాలిటెక్నిక్ కళాశాల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరగక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి జరిగే సర్టిఫికెట్ల పరిశీలనలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మార్పులు చేసింది. ర్యాంకుల వారీగా పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరుకావాల్సిన విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపారు.
గుంటూరు నగరపరిధిలో నల్లపాడు పాలిటెక్నిక్‌లో హాజరుకావాల్సిన విద్యార్థులు సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోనూ, గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హాజరుకావాల్సిన వారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లాలని ప్రభుత్వ మహిళా కళాశాల కౌన్సెలింగ్ కేంద్రం కోఆర్డినేటర్ సీహెచ్ పుల్లారెడ్డి న్యూస్‌లైన్‌కు తెలిపారు. ఎస్టీ విభాగానికి చెందిన విద్యార్థులు తమ సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఏఎన్‌యూలో హాజరుకావాలి. బుధవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 355 మంది విద్యార్థుల హాజరయ్యారు.
నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన..
ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు 45,001 నుంచి 60,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 45,001 నుంచి 49,000 వరకు, 57,001 నుంచి 60వేల ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 49,001 నుంచి 57,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి.
నేటి నుంచి వెబ్ కౌన్సెలింగ్
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులకు కళాశాలల ఎంపిక కోసం గురువారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. ఒకటి నుంచి 40 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు గురు, శుక్రవారాల్లో జరిగే వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొని ఆప్షన్లు ఎంచుకోవాలి. విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పొందిన స్క్రాచ్‌కార్డుతో హెల్ప్‌లైన్ కేంద్రాలతో పాటు ఇంటర్నెట్ కేంద్రాల నుంచి ఏపీ ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకునే వీలుంది.
Advertisement
Advertisement