పెడన : ఆదివారం తెల్లవారుజాము సుమారు 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల బూట్ల చప్పుడుతో పెడన పట్టణం శివారులోని ఇందిరాకాలనీ, దక్షిణ తెలుగుపాలెం కాలనీ ఉలిక్కిపడింది. అప్పుడే నిద్రలేస్తున్న కాలనీ వాసులకు ఎదురుగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్‌స్థాయి వరకు ప్రత్యక్షమవడంతో అసలేం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటికే కాలనీలను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. ఏ ఇంటిని వదలకుండా ఇళ్లల్లోకి వెళ్లి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంటింటికి తిరిగి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు పరిశీలించారు. రహదారిలో వెళ్లే వాహనాలను ఆపి తనిఖీలు చేశారు.
కాలనీలలో అరాచకశక్తులు, టైస్టులు, సంఘవిద్రోహ శక్తులు నక్కి ఉన్నారా? కాలనీల నుంచి బయటకు వెళ్తుంటే ఎందుకు తనిఖీలు చేస్తున్నారు? తదితర ప్రశ్నలు కాలనీ వాసుల మెదళ్లను తొలచివేశాయి. పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా తనిఖీ చేస్తున్నారని కొంతసేపటి తరువాత ప్రజలకు అర్ధమైంది. దీంతో రెండు కాలనీల ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు. బందరు డీఎస్పీ డి. శ్రావణ్ సూర్యకుమార్, బందరు రూరల్ సీఐ ఎ. నవీన్ నరసింహమూర్తి నేతృత్వంలో పెడన పట్టణ శివారు ఇందిరాకాలనీ, దక్షిణ తెలుగుపాలెం కాలనీలలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. బందరు రూరల్ పరిధిలోని డీఎస్పీ, సీఐ, ఏడుగురు సబ్‌ఇన్స్‌పెక్టర్లు, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది 80 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరూ ఆరు బృందాలుగా విడిపోయి రెండు కాలనీలను దిగ్బంధించారు. ఇంటింటికి వెళ్లి విస్తృతస్థాయిలో తనిఖీ చేశారు.
పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
ఈ సందర్భంగా ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రికార్డులు సక్రమంగా లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకుని పెడన పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయా కాలనీలలో నివసించే రౌడీషీటర్లు, పాత నేరస్తులను పిలిచి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి కదలికలపై స్థానిక పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నారు. బందరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని విస్తృతస్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు.
వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో చోరీలు జరిగే అవకాశం అధికంగా ఉంటుందని చెప్పారు. ఒక ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధించి తనిఖీలు చేయడం వలన అరాచకశక్తులు, సంఘవిద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు, నేర ప్రవృత్తి కలిగిన వారు తారసపడే అవకాశం ఉందని చెప్పారు. అట్టి వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పెడన ఎస్సై వి. మణికుమార్, బందరు రూరల్ పరిధిలోని చిరంజీవి, పి. జగదీష్, సత్యనారాయణ, విల్సన్‌బాబు, కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెల్లవారుజామున తనిఖీలు
Published Mon, Mar 16 2015 4:22 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement