ఎకో బొకేకి జిందాబాద్‌! | Eco Flower Bouquet Is The Right Choice | Sakshi
Sakshi News home page

ఎకో బొకేకి జిందాబాద్‌!

Published Fri, Oct 4 2019 10:17 AM | Last Updated on Fri, Oct 4 2019 10:17 AM

Eco Flower Bouquet Is The Right Choice - Sakshi

సాక్షి, ఒంగోలు సిటీ: పువ్వులను చూడగానే మనస్సు తెలియని అనభూతితో పులకించిపోతుంది. వాటి పరిమళాలు ప్రశాంతతను చేకూర్చుతాయి. ఆ పుష్పాలను అందంగా పుష్పగుచ్ఛాలుగా మార్చి సందర్భానుసారంగా నచ్చిన వారికి ఇస్తాం. అయితే అలాంటి పుష్ప గుచ్ఛానికి ప్లాస్టిక్‌ పేపర్‌ చుట్టడం వల్ల ఒక్క సారిగా పరిమళ అనుభూతి మారిపోతుంది. అలాగే పూల బొకేలకు ప్లాస్టిక్‌ తొడుగు వదిలేయమంటున్నారు పర్యావరణ ప్రేమికులు. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వరసగా ఉన్నాయి. వివిధ కొత్త దుకాణాలు, వ్యాపార సంస్థలు ప్రారంభోత్సవాలకు నోచుకుంటున్నాయి. ఇలాంటి అన్ని కార్యక్రమాలకు పూల బొకేలు విరివిగా ఉపయోగించే నేపథ్యంలోనే వాటికి ప్లాస్టిక్‌ తొడుగులను వదిలేస్తే పర్యావరణానికి మేలు చేసినవారు అవుతారు. పువ్వులను ప్లాస్టిక్‌ కవర్లతో బంధించి వాటి అందాన్ని పరిమళాలను అదిమి పట్టేకంటే రంగుల పేపర్లు జనపనార అల్లికల్లో మరింత అందంగా తీర్చిదిద్దువచ్చు. ఇలా చేయడం వల్ల పుష్పాలు త్వరగా వాడిపోకుండా ఉండడంతో పాటు మరింత తాజాగా ఉంటాయి.

అవగాహన..
నగరంలో క్రమేణా ప్లాస్టిక్‌ వినియోగం పట్ల అవగాహన వచ్చింది. వాడకం బాగా తగ్గింది. కొందరు కాగితపు సంచులు ఇస్తున్నారు. బ్రాండెడ్‌ వస్తువులను కొన్నప్పుడు వారు కాగితపు క్యారీ బ్యాగులను ఇస్తున్నారు. రెడీమేడ్‌ దుకాణాల్లో గుడ్డ సంచులను ఇస్తున్నారు. ఇలా కొన్ని వర్గాల్లో ప్లాస్టిక్‌ వాడకం పట్ల అవగాహన వచ్చింది. ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, కందుకూరు, చీరాల మున్సిపాలిటీలు, గిద్దలూరు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి నగర పంచాయతీల్లోనూ ప్లాస్టిక్‌ వాడకం పట్ల అవగాహన వస్తోంది. భవిష్యత్తులో పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు పడ్తున్నాయి. అయితే అధికారులు క్రమం తప్పకుండా ప్లాస్టిక్‌ వాడకం గురించి సరైన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండాలి. ప్లాస్టిక్‌ సంచులు వాడుతున్న వారికి జరిమానాలను విధించాలి. ఒక్క ఒంగోలులోనే రోజుకు 150 టన్నుల వ్యర్థాలు వస్తుండగా ఇందులో 30 శాతం వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉంటున్నాయి. బాటిళ్ల రూపంలో ఉన్నవి భూమిలో నిర్వీర్యం కానివి ఉంటున్నాయి.

రానున్న రోజుల్లో జరిమానాల వడ్డింపు
ప్లాస్టిక్‌ క్రమేణా నిషేధించకుంటే జరిమానాల వడ్డింపులతో పాటు దుకాణాల అనుమతులను రద్దు చేస్తారు. ఒంగోలు నగరంలో పూల మార్కెట్‌ పెద్దదే. నిత్యం టన్నుల కొద్దీ పూల లావాదేవీలు జరుగుతున్నాయి. పండగ వేళల్లో పూల వినియోగం అధికమే. ప్లాస్టిక్‌ వాడకూడదని నగర పాలక సంస్థ, ఇతర విభాగాల అధికారులు హెచ్చరించారు. అయినా ఇంకా ప్లాస్టిక్‌ కవర్లు, బొకేలకు ప్లాస్టిక్‌ తొడుగులు వాడుతూనే ఉన్నారు. అందుకే అధికారులు పుష్పగుచ్ఛాల తయారీ విక్రయదారులను చైతన్యపరిచే పనిలో పడ్డారు.

అందంగా చుట్టాలి
ఈ సీజన్‌లో పూల బొకేలకు బాగా గిరాకీ ఉంటుంది. ప్లాస్టిక్‌ తొడుగులు వాడకుండా జనపనార.. పేపర్లతో అందంగా చుడితే బొకే ఇంకా అందంగా ఉంటుంది. గతంలో మన ఇంట్లో ఉండే చేనేత జనపనార ఇతర సంప్రదాయ సంచిని తీసుకెళ్లి అవసరమైన సరుకులు తెచ్చుకొనే వాళ్లం. మాంసం దుకాణానికి వెళితే మనం ఎంత తెచ్చుకోవాలనుకుంటున్నామో అందుకు సరిపడా స్టీలు బాక్సులను తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ పద్ధతిని ఎందుకు వదులుకున్నాం. ఈ రోజుల్లో చేతిలో సంచి పట్టుకోవాలంటేనే నామోషీగా ఫీలవుతున్నాం. ఖాళీ చేతులతో వెళ్లి ఐదారు ప్లాస్టిక్‌ కవర్లతో కావాల్సిన వస్తువులను సామగ్రి తెచ్చుకుంటున్నాం. ఇది మన వినాశనాన్ని కోరుతుంది. పండుగల సీజన్‌లో ఇంకా ప్లాస్టిక్‌ వినియోగం రెట్టింపవుతుంది. దీని వల్ల పర్యావరణ ముప్పు అధికమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement