గర్భాం ఉన్నత పాఠశాలలో పంపిణీ చేసిన సైకిళ్లతో విద్యార్థులు, తల్లిదండ్రులు
విజయనగరం , చీపురుపల్లి(మెరకముడిదాం): సాధారణంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో అధికార పార్టీ నేతలు ముందుంటారు. సమయం మించిపోతోంది కాబట్టి చివరిలోనైనా ఏవో ప్రారంభోత్సవాలు చేసేద్దామా.. శంఖుస్థాపనలు చేసేద్దామా.. అంటూ ప్రజాప్రతినిధులు అత్యుత్సాహం చూపిస్తుంటారు. కాని ఎన్నికల కోడ్‌ను గౌరవించి అమలు చేయాల్సిన అధికారులే తెలుగుదేశం పార్టీ నాయకుల మెప్పు కోసం కోడ్ ఉల్లంఘిస్తే ఏమనుకోవాలి. సరిగ్గా చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో గల గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదే జరిగింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ విద్యాశాఖ ఆధ్వర్యంలో అక్కడి విద్యార్థులకు సీఎం, మంత్రి ఫొటోలతో ఉన్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో విద్యాశాఖ అధికారులకు ఎన్నికల అధికారుల నుంచి హెచ్చరికలు రావడంతో పంపిణీ నిలిపివేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న సీఎం ఫొటోలనే తొలగించాలి. అంత స్ట్రిక్ట్‌గా కోడ్ అమల్లో ఉంటే గర్భాం పాఠశాలలో ఏకంగా సీఎం, మంత్రి ఫొటోలతో ఉన్న సైకిళ్లను పంపిణీ చేయడం వెనుక అక్కడి విద్యాశాఖ అధికారులకు తెలుగుదేశం పార్టీపై ఎంత ప్రేముందో అర్థం చేసుకోవచ్చు. అయితే కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుంచి కలెక్టర్ వరకు చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ కోడ్ ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాల్సిందే.
ఆదరణ సైకిళ్ల పంపిణీ..
గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ రామారావు, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎస్.రమణల నేతృత్వంలో ఆదరణ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోతో ఉన్న సైకిళ్లను శుక్రవారం పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక విలేకరులు కొంతమంది అక్కడకు వెళ్లేసరికి ఎంఈఓ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం నుంచి ఉపాధ్యాయుల వరకూ అందరూ ముఖం చాటేశారు. ఈలోగా చాలా హడావుడిగా కొంతమంది తెల్లకాగితాలు తీసుకొచ్చి సైకిల్‌పై ఉన్న చంద్రబాబునాయుడు ఫొటో కనిపించకుండా అతికించేందుకు ప్రయత్నించారు. అప్పటికే స్థానికంగా ఉన్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని జిల్లా నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జిల్లా నాయకులు ఎన్నికల అధికారుల ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కోడ్ లేక్కలేదా....
ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే అధికారులు అంతా సాధారణ పనులు పక్కన పెట్టి ఎన్నికల విధుల్లో చాలా బిజీ అయ్యారు. అయినప్పటికీ కోడ్ నిబంధనలు ఉల్లంఘించి గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సైకిళ్లు పంపిణీ చేయడం చర్చాంశనీయమయ్యింది.
కఠిన చర్యలు....
ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేశాం. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. గర్భాం ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఇంతవరకు నా దృష్టికి రాలేదు.
– కె.సాల్మన్‌రాజ్,ఎన్నికల రిటర్నింగ్ అధికారి, చీపురుపల్లి
పంపిణీకి వెళ్లలేదు...
గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లలేదు. డీఈఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు సైకిల్ ముందు భాగంలో ఫొటోలు కనిపించకుండా తెల్లకాగితాలు అతికించి పంపిణీ చేయమని ఉపాధ్యాయులను ఆదేశించా.– రామారావు, ఎంఈఓ, మెరకముడిదాం
సెలవులో ఉన్నాను....
వ్యక్తిగత కా>రణాలు దృష్ట్యా సెలవులో ఉన్నాను. సెలవులో ఉన్నప్పటికీ సైకిళ్ల పంపిణీపై సమాచారం ఇచ్చారు. అయితే సైకిల్ ముందు భాగంలో ఉన్న ఫొటోలపై కాగితాలు అతికించి పంపిణీ చేయాలని ఇన్‌చార్జి హెచ్‌ఎం రమణకు సూచించాను.– గ్రంధి ఈశ్వరరావు, హెచ్‌ఎం,గర్భాం ఉన్నత పాఠశాల
Comments
Please login to add a commentAdd a comment