విద్య, వైద్య, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విద్య, వైద్య, మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వస్తున్న, ప్రస్తుత ఈ సేవా డెరైక్టర్ ముదావత్ ఎం.నాయక్ తెలిపారు. ఆయన ‘సాక్షి’తో బుధవా రం మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలయ్యేలా కృషి చేస్తానని, అట్టడుగు వర్గాల వారందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. నాలుగు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తానని, జిల్లాకు వచ్చాక పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రజలకు చేరువవుతానని చెప్పారు. తనకున్న అనుభవంతో మంచిపాలన అందిస్తానని తెలిపారు.
ప్రస్తుత కలెక్టర్ కాంతిలాల్ దండే కు అనతికాలంలోనే బదిలీ అయింది. గత ఏడాది జూన్ 12న బాధ్యతలు స్వీకరించిన ఆయన ఎన్నో ఒడిదుడుకుల మధ్య 13 నెలల పాటు పనిచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గరి నుంచి బదిలీ అవుతుందన్న సంకేతాలు ఆయనకొచ్చాయి. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా బదిలీ కావొచ్చని సమాచారం కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే, చివరి నిమిషంలో గుంటూరు బదిలీ అయింది. అనుకున్నదొకటి, అయ్యిందొకటని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తనకిదొక గుర్తింపుగా భావిస్తున్నారు.
అందరూ సహకరించారు: కాంతిలాల్ దండే
జిల్లా ప్రజలకు సేవ చేశానని భావిస్తున్నట్టు గుంటూరుకు బదిలీ అయిన కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. విజయనగరం మంచి జిల్లా అని, ప్రజలంతా పూర్తిగా సహకరించారని తెలిపారు. తాను పనిచేసిన కొద్దికాలంలో ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా చేపట్టానన్నారు. జిల్లాకు వచ్చిన దగ్గరి నుంచి బిజీగానే ఉన్నానని, అందరి సహకారంతోనే సక్సెస్ ఫుల్‌గా పనిచేయగలిగానని చెప్పారు.