విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా బోధించేందుకు ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత విద్యను ప్రవేశ పెట్టింది. ఈ పథకం అమలుకు లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
గూడూరు, న్యూస్‌లైన్: విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా బోధించేందుకు ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత విద్యను ప్రవేశ పెట్టింది. ఈ పథకం అమలుకు లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్ల ప్యాకింగ్‌లను తీసిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పాఠశాలల్లో వాడిన కొంత కాలానికే కంప్యూటర్లు మరమ్మతులకు వచ్చాయి. వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో కంప్యూటర్ ఆధారిత విద్య మిథ్యగా మిగిలిపోతోంది. 2009లో జిల్లాలో 131 ప్రాథమికోన్నత పాఠశాలల్లో క్యాల్ ప్రోగ్రామ్ (కంప్యూటర్ ఆధారిత విద్య)ను ప్రవేశపెట్టారు. విద్యార్థులకు బోధించాల్సిన పాఠ్యాంశాలను కంప్యూటర్‌లో పొందుపరచి ఉంటారు.
ఆ తరగతి ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని కంప్యూటర్ ద్వారా మళ్లీ విశదీకరించడం, ఆ పాఠ్యాంశంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం తదితర విషయాలను కంప్యూటర్ ద్వారా నేర్పడమే ఈ కంప్యూటర్ ఆధారిత విద్య లక్ష్యం. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ 12 రోజులపాటు లక్షలు వెచ్చించి శిక్షణ ఇచ్చారు. గూడూరు రూరల్ మండలంలోని తిరువెంగలాయపల్లిలో కంప్యూటర్ల ప్యాకింగ్‌లను తెరిచిన పాపానపోలేదు. కొన్ని స్కూళ్లలో మరమ్మతులకు వచ్చిన కంప్యూటర్ల గురించి పట్టించుకునే వారు లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు.
మరమ్మతులకు వచ్చి ఏడాదైంది :
మా పాఠశాలకు ఇచ్చిన కంప్యూటర్లు మరమ్మతులకు గురై ఏడాది పైనే అయింది. వాటిని రిపేరు చేసే వారే లేరు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత విద్యను అందించలేకున్నాం.
- బాబు, ఉపాధ్యాయుడు, చవటపాళెం
సులభంగా అర్థమయ్యేవి :
చెప్పిన పాఠాలను కంప్యూటర్ ద్వారా తిరిగి తెలుసుకోవడం ద్వారా సులభంగా అర్థమయ్యేవి. ప్రస్తుతం అవి రిపేరు కావడంతో మాకు కంప్యూటర్ ద్వారా పాఠాలు వినలేకున్నాం.
- మహేశ్వరి, భార్గవి
వెంటనే మరమ్మతులు చేయించాలి :
మరమ్మతులకు గురైన కంప్యూటర్లను వెంటనే తయారు చేయించాలి. గతంలో కంప్యూటర్లు ద్వారా పాఠాలు సులభంగా అర్థమవుతుండేవి. ప్రస్తుతం కంప్యూటర్ ద్వారా పాఠాలు నేర్చుకోలేకున్నాం. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయించాలి.
- వినోద్, శ్రీను
2నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో గత ఎన్నికలలో జరుగకుండా ఆగిన సర్పంచ్ పదవులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగబోతున్నాయి. 7 పంచాయతీలకు, 63 వార్డులకు జిల్లాలో ఎన్నికలు జరగాల్సి ఉండగా శుక్రవారం నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం పెనుబల్లి, ఆర్వీటీ కిస్తీపురం, రామచంద్రాపురం, కొత్తపల్లి పంచాయతీలు ఏక గ్రీవం అయినట్టు పంచాయతీ అధికారులు ప్రకటించారు.
ఏఎస్‌పేట మండలంలోని పెద్దబ్బీపురం గ్రామంలో మాత్రం పోటీ నెలకొంది. మరో రెండుగ్రామాలైన రంగనాధపురం, ముంగలదొరువు పంచాయతీలలో రిజర్వు చేసిన ఓటర్లు లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇక్కడ ఉప సర్పంచ్ పంచాయతీ సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక 63 వార్డుసభ్యులకు గాను 48 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రెండు వార్డులకు నామినేషన్‌లు దాఖలు కాలేదు. మిగిలిన 13 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.