గుడ్డు వార్నింగ్ | egg price Shortness | Sakshi
Sakshi News home page

గుడ్డు వార్నింగ్

Published Mon, Feb 10 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

egg price  Shortness

మండపేట (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్ :  చూడడానికి తెల్లగా ఉండి, తిన్నవారికి పుష్టినిచ్చే కోడిగుడ్లు.. పౌల్ట్రీల యజమానులు తెల్లముఖం వేసేలా, నష్టాలను రుచి చూసేలా చేస్తున్నాయి. గద్ద గోళ్లలో చిక్కుకుని గిలగిలలాడే కోడిపిల్లల్లా.. కోళ్ల ఫారాలు  ఇప్పుడు సంక్షోభంలో పడి విలవిలలాడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో సీజన్‌లోనూ గుడ్లకు గడ్డుకాలం తప్ప డం లేదు. ఏడాదిగా వెంటాడుతున్న తెగుళ్ల బెడదతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు అధిక సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుం డ టం పౌల్ట్రీ రైతులను కలవరపరుస్తోంది.  
 
 కోస్తాలో ప్రధానంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని పౌల్ట్రీల్లో ఏడాది క్రితం వరకు సుమారు 4.5 కోట్ల కోళ్లు ఉండగా రోజుకు సుమారు 3.82 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. స్థానిక అవసరాలు పోను 60 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఏడాదిగా  తెగుళ్ల బెడదతో కోళ్ల మరణాలు పెరిగిపోయా యి. ప్రస్తుతం ఈ జిల్లాల్లో కోళ్ల సంఖ్య సుమారు 2.7 కోట్లకు తగ్గిపోగా,గుడ్ల ఉత్పత్తి 2.29 కోట్లకు పడిపోయిందని పౌల్ట్రీవర్గాల అంచనా. తూర్పుగోదావరిలో కోళ్ల సంఖ్య 1.30 కోట్ల నుంచి 87 లక్షలకు తగ్గిపోయింది. 
 
 ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీ రంగానికి సీజన్‌గా పరిగణిస్తారు. చలిగాలులు ప్రారంభమయ్యే కొద్దీ ఉత్తరాది రాష్ట్రాల కు ఎగుమతులు పుంజుకుంటాయి. ఆ మేరకు  రైతుకు చెల్లించే ధర కూడా పెరుగుతుంది. కాగా కొద్దికాలంగా కోస్తాలోని పౌల్ట్రీలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని పౌల్ట్రీల పోటీతో గట్టి దెబ్బ తగులుతోంది. ఆ రాష్ట్రాల వారు తక్కువ ధరకే అమ్మడం ఇక్కడి ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. నవంబరు, డిసెంబరు నెలల్లో మూడు జిల్లాల నుంచి సగటున రోజుకు సుమారు 115 లారీల గుడ్లు ఎగుమతి కాగా, జనవరిలో ఆ సంఖ్య 102కు తగ్గిపోయింది. జిల్లాలో డిసెంబరు 8న గుడ్డు రైతు ధర రూ.3.91పైసలు కాగా, ఎగుమతులకు డిమాండ్ లేకపోవడంతో గురువారం నాటికి రూ.3.20 పైసలకు పతనమైంది.  
 
 ఖాళీ అవుతున్న పౌల్ట్రీ షెడ్లు 
 లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో తెగుళ్ల నివారణ చర్యల కు నెలకు రూ.రెండున్నర లక్షలు ఖర్చవుతుంద ని అంచనా.  కోళ్లమేతకు వాడే సోయాబీన్, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్ ధరలకు రెక్కలొచ్చా యి. రవాణా, కూలి రేట్లు, మందుల ధరలు పెరిగి గుడ్డు ఉత్పత్తి వ్యయం మరింత అధికమవుతోంది. గుడ్డు రైతు ధర రూ.3.50పైసలు ఉంటేనే గాని గిట్టుబాటు కాదంటున్నారు. వేసవిలో కోళ్ల మరణాలు మరింత పెరగనుండటం, నష్టాలతో పౌల్ట్రీలను నడపలేని పరిస్థితుల్లో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు రైతులు భయపడుతున్నారు. జిల్లాలో అనపర్తి, ద్వారపూడి, మండపేట, బలభద్రపురం, పీరా రామచంద్రపురం తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీల్లో షెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 
 
 సర్కారే చేయూతనివ్వాలి
 కోళ్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రభుత్వం ఆదుకోకుంటే పరిశ్రమ మూతపడే ప్రమాదముంది. కోళ్ల రైతులకు ఇచ్చే రుణాలను రీ షెడ్యూల్ చేయాలి. మేత ధరలను అదుపు చేయాలి. ఎఫ్‌సీఐ గోదాముల్లోని పనికిరాని మొక్కజొన్న, బియ్యం తదితరాలను కోళ్ల మేతల కోసం పౌల్ట్రీలకు సబ్సిడీపై అందజేయాలి. 
 - పడాల సుబ్బారెడ్డి, 
 పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, అర్తమూరు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement