కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనల హైడ్రామాకు మంగళవారంతో తెరపడే వీలుంది.
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనల హైడ్రామాకు మంగళవారంతో తెరపడే వీలుంది. పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇదేరోజు విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్‌ఆర్)లు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీనికిముందు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమని ఉన్నతాధికారులు చెప్పనున్నట్టు సమాచారం. రూ.7 వేల కోట్లకుపైగా రెవెన్యూ లోటు ఉందని, ఇందులో ప్రభుత్వం ఏ మేర సబ్సిడీ ఇస్తుందో వేచి చూడాలని వారంటున్నారు.
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని బట్టి ఏయే శ్లాబులకు చార్జీలు పెంచాలో డిస్కమ్‌లు నిర్ణయం తీసుకునే వీలుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సబ్సిడీ మొత్తాన్ని వెల్లడించే అవకాశం లేదు. ఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపేందుకు మాత్రమే సీఎం అనుమతించవచ్చని చెబుతున్నారు.