
సాక్షి, అమరావతి : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పని చేయడానికే ‘వలంటీర్ల’ వ్యవస్థ పుట్టుకొచ్చింది. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా ప్రజలకు చేరవేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి ప్రతిరూపమే ఈ వ్యవస్థ. దాన్ని వారు సమర్థంగా నెవరేరుస్తూ వస్తున్నారు కూడా!!. నెలవారీ పింఛన్ల నుంచి మొదలుపెడితే... వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నది వారే. పైపెచ్చు వారేమీ రెగ్యులర్ పేస్కేళ్లలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల్లాంటి వారు కారు. ఇది... గౌరవ వేతనంపై సేవలందిస్తున్న వ్యవస్థ.
అసలు వీరిని నియమించిందే ప్రభుత్వానికి– ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా అయినపుడు వారు ప్రజల వద్దకు వెళ్లటం తప్పెలా అవుతుంది? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? దీనిపై మీరెంత సంతృప్తిగా ఉన్నారు? వంటి అంశాలను తెలుసుకోవటానికి వారు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, గృహ సారథులతో పాటు ప్రజల వద్దకు వెళితే తప్పేమయినా ఉందా? అసలెందుకు చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారో తమకర్థం కావటం లేదని అటు ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్ల వ్యవస్థతో పాటు ఇటు బాబు తీరును నిశితంగా గమనిస్తున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
నిజానికి చంద్రబాబు నాయుడి హయాంలో జన్మభూమి కమిటీల పేరిట పార్టీ కార్యకర్తలను నియమించి మొత్తం గ్రామాల్లోని వాతావరణాన్ని రాజకీయ పూరితం చేసేశారు. ఈ కమిటీల్లో ఉన్నది తెలుగుదేశం నాయకులే కావటంతో... వారు ఏ పథకాలనైనా ఇతర అర్హతలన్నీ పక్కనబెట్టి టీడీపీ వారికే ఇచ్చేవారు. టీడీపీ సానుభూతిపరులు కాని వారికి అప్పటిదాకా ఉన్న పథకాలను కూడా నిలిపేసి దారుణమైన పరిస్థితులు సృష్టించారు.
ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని, అర్హులైన వారికి పార్టీలకతీతంగా పథకాలు అందాలనే ఉద్దేశంతో... వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్న వీరు... ఆ క్రమంలో సహజంగానే ఆయా పథకాల ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, గృహసారథులతో మమేకమై పాల్గొంటున్నారు. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేయటమెందుకో... అసలు వలంటీర్లంటే అంత వణుకెందుకో ఎవ్వరికీ అర్థం కాదు.
ప్రజలకు మరింత మేలు..
ప్రజలకు పథకాలు అందాయా లేదా అనే విషయంపై గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే చేయడాన్ని తప్పుపట్టా ల్సిన అవసరం లేదు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే ఆ వివరాలను వారు నమోదు చేస్తారు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే, అలాంటి వారికి ఏడాదిలో రెండుసార్లు.. జూన్, డిసెంబర్ నెలల్లో ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించడం, సర్వే చేయడం ఇది కొత్త కాదు.
రెండేళ్లుగా ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్ రీచ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో సర్వే చేస్తే ఎక్కడైనా తప్పులుంటే తెలుస్తాయి. ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ప్రజాప్రతినిధులతో పాటు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ సర్వేలో కూడా
పాల్గొంటున్నారు. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి