సాక్షి, అమరావతి: ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణాల కోసం ఓటాన్ అకౌంట్ నాలుగు నెలల బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.10.36 కోట్లు విడుదల చేసింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా లేదా రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా చంద్రబాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌లోనే వెళ్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా సింగపూర్ పర్యటనకు వెళ్లారు. సింగపూర్‌కు కూడా ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఇతర దేశాలకు ఎప్పుడు వెళ్లినా ప్రత్యేక విమానాలే వాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి రెగ్యులర్ విమానాలున్నప్పటికీ గత ఐదేళ్లుగా ప్రత్యేక విమానంలోనే ప్రయాణాలు చేశారు. అధికార పర్యటనలైనా, పార్టీ పర్యటనలైనా ప్రత్యేక విమానాల్లోనే చంద్రబాబు వెళ్తూ వచ్చారు.
విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం
రెవెన్యూ లోటు భారీగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రెగ్యులర్ విమానాలున్న నగరాలకు కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్లడాన్ని అధికారులు తప్పుపట్టారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికల ముందు ధర్మపోరాట దీక్షల పేరుతో పలు జిల్లాలకు వెళ్లారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల మధ్య ఉండాల్సిన గీతను చెరిపేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. చంద్రబాబు ఉపయోగించే ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌కు గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకంగా పార్కింగ్ కేటాయించారు.
ఈ పార్కింగ్ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. అలాగే పైలెట్, ఇతర సిబ్బందికి స్టార్ హోటళ్లలో బసకు అయ్యే చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంది. గత ఐదేళ్లగా చంద్రబాబు ప్రత్యేక విమానాల కోసం ఖజానా నుంచి ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టారు. బాబు గారి ప్రత్యేక విమాన చార్జీలను చెల్లించేందుకు నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మరో రూ.10.36 కోట్లు విడుదల చేస్తూ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment