కర్నూలు(రాజ్‌విహార్) : దేశాభివృద్ధికి గ్రామాలు పట్టుగొమ్మలు. అయితే ప్రస్తుతం పల్లెల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. విద్యుత్ బిల్లులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ షాక్ ఇస్తోంది. బకాయి అధికంగా ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా విదల్చడంలేదు. పైగా పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించుకోవాలని సూచించడం కొత్త సమస్యకు దారితీస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులకు ఉపయోగించబోమని, బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని గ్రామ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, సర్పంచుల మధ్య నలుగుతున్న ఈ సమస్య కారణంగా బకాయిలు రూ. 92.49 కోట్లకు చేరాయి. ఇందులో రూ.6.70 కోట్లు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు చెందినవి కాగా మిగిలినవి మేజర్, మైనర్ పంచాయతీలవి ఉన్నాయి.
జిల్లాలోని 918 గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. వీటిలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు (స్ట్రీల్ లైట్స్), వాటర్ వర్క్ (మంచినీటి సరఫరా)కు ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను పంచాయతీలే చెల్లించాలి. అయితే వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. కాని కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం విడుదల చేసే 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లులు కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో సర్పంచులు ఎదురుతిరిగారు.
ఆ నిధులు గ్రామాల అభివృద్ధికే ఉపయోగించుకుంటామని, కరెంటు బిల్లులకు సంబంధించి నిధులను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తోంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో పేరుకుపోతున్నాయి. బకాయిలపై విద్యుత్ శాఖ ఎనర్జీ సెక్రటరీ అజయ్‌జైన్ ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో గ్రామ పంచాయతీల బకాయిలను తీవ్రంగా పరిగణించారు. బిల్లులు చెల్లించకపోతే సరఫరా నిలిపివేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అత్యధిక బకాయిలు ఉన్న పంచాయతీలపై దృష్టి సారించారు. ఇప్పటికే కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీతోపాటు శ్రీశైలం, సున్నిపెంట, ఆదోని, నంద్యాల, డోన్ డివిజన్లలోని మరిన్ని గ్రామాల్లో వీధి దీపాలకు సరఫరా నిలిపివేశారు.
బకాయిల పంచాయతీ!
Published Wed, Dec 31 2014 2:27 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement