మీటర్ మేటర్ తేల్చుకోండిలా
Published Tue, Oct 22 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
సాక్షి, రాజమండ్రి : కరెంటు బిల్లు జేబుకు చిల్లు పెడుతోంది. నెలకు రూ. వందలు దాటి రూ. వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఏమిటిది? కొంపతీసి మీటర్ స్పీడ్‌గా తిరిగేస్తోందా ? అయితే పరీక్షించడం ఎలా? అని మధనపడే వినియోగదారులకు శుభవార్త! నిజంగా మీ మీటరు వినియోగం కన్నా ఎక్కువ రీడింగు చూపుతుందని మీరు నమ్ముతుంటే అనుమానం నివృత్తి చేసుకునేందుకు మీకు విద్యుత్తుశాఖ అవకాశం కలిగిస్తోంది. మీ మీటరును ప్రభుత్వం గుర్తించిన ప్రమాణాల సంస్థ వద్ద పరీక్ష చేయించుకోవచ్చు. మీ అనుమానాలను ప్రత్యక్షంగా రుజువు చేసి నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఈ మేరకు వీలు కల్పిస్తూ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అవకాశం ఇలా...
మీటర్లో తేడాలున్నట్టు అనుమానం వస్తే వాటిని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కేలిబరేషన్ లేబోరేటరీస్(ఎన్‌ఏబీఎల్) అనే ప్రమాణాల సంస్థ ధ్రువీకరించిన లేబోరేటరీలకు విద్యుత్తు అధికారుల సహాయంతో తీసుకువెళ్లి పరీక్షించుకోవచ్చు. ఇందుకు వీలు కల్పిస్తూ విద్యుత్తు రెగ్యులేటరీ కమిటీ రెండురోజుల క్రితం ఉత్తర్వులిచ్చింది. రూ.50 నుంచి రూ.300 వరకూ కనెక్షన్ స్థాయి, ఫిర్యాదు స్థాయి పరిగణలోకి తీసుకుని రుసుము కట్టించుకుని పరీక్షలకు అనుమతిస్తారు. మన జిల్లాలో బొమ్మూరు వద్ద గుర్తింపు కలిగిన విద్యుత్తు సంస్థకు చెందిన ఎంఆర్‌టీ ల్యాబ్ ఉంది.
అందులో ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. ఒకవేళ విద్యుత్తు సంస్థ అధీనంలో పనిచేసే ఎంఆర్‌టీ సెంట ర్‌లో మీటర్ పరీక్షించుకోవడానికి కూడా అనుమానం ఉంటే సమీపంలోని ఎన్‌ఏబీఎల్ సెంటర్‌కు విద్యుత్తు అధికారుల సహకారంతో పంపి వాటిని పరీక్షించుకోవచ్చు. ల్యాబ్‌లో గుర్తించిన లోపాలకు వినియోగదారులు, విద్యుత్తు పంపిణీ సంస్థలు కట్టుబడి ఉండాలి. గృహోపకరణాల నుంచి పారిశ్రామిక యంత్ర పరికరాల వరకూ నాణ్యతను పరిశీలించి ధ్రువీకరించేందుకు నిర్దేశించిన సంస్థ ఎన్‌ఏ బీఎల్. ఈ సంస్థ గుర్తించిన ల్యాబ్‌లు హైదరాబాద్, గుంటూరు, అనంతపురం, భీమవరంతో పాటు మన జిల్లాలోని అనపర్తిలో ఐటీసీ ఆధ్వర్యంలో ఒకటి ఉన్నాయి.
పరీక్ష ఇలా..
మీటర్ ఎక్కువ వినియోగాన్ని చూపిస్తోందని భావిస్తే సంబంధిత విద్యుత్తు శాఖ ఏఈకి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం అధికారులు మీటర్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తారు. విద్యుత్తు సంస్థ ప్రమాణాల ప్రకారం గంటకు నిర్దేశించిన ప్రమాణంలో అవుతున్న వినియోగాన్ని గణాంకాల రూపంలో కచ్చితంగా చూపిస్తున్నదీ లేనిదీ పరిశీలిస్తారు. మార్పులుంటే అక్కడే సర్దుబాటు చేసి సమస్య పరిష్కరిస్తారు. లేదంటే ఆ సమస్యకు, అనుమానాలకు నివృత్తి లభించినట్టవుతుంది.
అనుమానముంటే దరఖాస్తు చేసుకోవచ్చు
ఇలా మీటరు పరీక్ష చేయించుకోవడానికి చెల్లించే మొత్తాన్ని చాలెంజింగ్ ఫీజు అంటాం. అనుమానం ఉన్న వినియోగదారులు తమ పరిధిలోని డివిజినల్ ఇంజనీరును గాని, సహాయక ఇంజనీరును గాని కలిసి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. సరఫరాకు తాత్కాలిక ప్రత్యామ్నాయం చూపి మీటరును ఎంఆర్‌టీకి తరలించి పరీక్షిస్తాం.
- యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీరు
Advertisement
Advertisement