
వారం రోజులుగా కరెంట్ లేదు.. తాగునీరు లేదు
బద్వేలు: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని 24వ వార్డులో వారం రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మునిసిపాలిటీ చైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత పార్థసారధి 24వ వార్డు నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినా తమ ఇబ్బందులను కనీసం పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఉంటేనే మోటార్లు పనిచేసి వార్డులోని ప్రజలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతుంది.
విద్యుత్ లేకపోవడంతో వార్డులో ఉన్న ఒకటి, రెండు బోర్ల దగ్గర మహిళలు బిందెడు నీటి కోసం ఘర్షణ పడాల్సిన పరిస్థితి నెలకొంది. 11కేవీ లైనుపై నుంచి 33కేవీ విద్యుత్ లైను వెళ్లడంతో షార్ట్ అయ్యి విద్యుత్ సరఫరా నిలవడం లేదని అంటున్న ఆ శాఖ అధికారులు సమస్య నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి వార్డు వైపు చూడడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.