శిల్పారామం..ఎల్లిపోతాంది!
నిధులున్నా ప్రారంభంకాని పనులు
=స్థలం ఆక్రమణ వల్లే అంటున్న పర్యాటక శాఖ..
=ఆ బూచితో తరలించాలని చూస్తున్నదంటున్న రెవెన్యూ శాఖ
=కలెక్టర్ ఆదేశంతో తిరిగి సర్వే..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కనుమరుగవుతున్న పల్లె సంస్కృతిని ప్రస్తుత తరాలకు చాటిచెప్పే శిల్పారామం నిర్మాణంపై సందిగ్ధం నెలకొంది. హస్తకళలకు పునరుజ్జీవం కల్పించే శిల్పారామం జిల్లాలో నిర్మాణమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఐదేళ్ల క్రితం మంజూరైన ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేకున్నా అధికారుల చిత్తశుద్ధిలేమి సమస్యగా మారింది. శిల్పారామం ప్రాజెక్టుకు కేటాయించిన స్థలం ఆక్రమణలకు గురవడం వల్లే నిర్మాణ పనులు మొదలు పెట్టడం లేదని పర్యాటక శాఖ... కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆక్రమణలు లేవని రెవెన్యూ శాఖ అధికారులు చెప్పుకుంటూపోతున్నారు.
రెండు శాఖల మధ్య సమన్వయలేమితో శిల్పారామం నిర్మాణం ముందుకు సాగడం లేదు. కేటాయించిన స్థలంలో ఆక్రమణలను సాకుగా చూపి శిల్పారామం ప్రాజెక్టును జిల్లా నుంచి తరలిం చేందుకు పర్యాటక శాఖ ప్రయత్నిస్తోందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నా యి. ప్రాజెక్టు పనుల తీరు చూసినా ఇదే పరిస్థి తి కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్మించే శిల్పారామం కోసం నాలుగు నెలల క్రితమే రూ.5 కో ట్ల గ్రాంటు విడుదలైంది. కాకతీయ ఉత్సవాల ప్రారంభం సమయంలోనే శిల్పారామంను ప్రారంభిస్తామని చెప్పిన పర్యాటక శాఖ... ఉత్సవాలు మగిసినా ఇప్పటికీ స్థలం చదును చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రెండు నెలల క్రితం జిల్లాకు వచ్చిన శిల్పారామం విభాగం అధికారులు సైతం వెంటనే నిర్మాణ పనులు చేపడతామని చెప్పినా పనులకు మోక్షం లభించడం లేదు. మంచినీటి రిజర్వాయర్లకు సంబంధించి కార్పొరేషన్ అధికారులతో మంగళవారం కలెక్టర్ జి.కిషన్ వద్ద జరిగిన సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలకు భూమి కేటాయింపు పై చర్చ జరిగింది. శిల్పారామం ప్రారంభం కాకపోవడానికి ఆక్రమణలే కారణమని ప్రస్తావన వచ్చింది. దీంతో కలెక్టర్ జి.కిషన్ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలి సింది.
శిల్పారామం నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆక్రమణలూ లేకుండా చూ డాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సెలవు రోజైన బుధవారం శిల్పారామం స్థలానికి వెళ్లి సర్వే చేశారు. నివేదికను తయారు చేసి కలెక్టరుకు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సర్వే తర్వాత కూడా పనులు మొదలుకాకుంటే... శిల్పారామం ఇతర జిల్లాలకు వెళ్లిపోవడం ఖాయమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
2008లోనే నిర్ణయం
వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలోని గోపాలపురంలో రూ.5 కోట్లతో శిల్పారామం ఏర్పా టు చేయాలని చేయాలని 2008లో వైఎస్ రాజ శేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 89 సర్వే నంబరులోని చెరువు శిఖం భూమిలో 17.5 ఎకరాలను రెవెన్యూ శాఖ ఈ ప్రాజెక్టు కోసం ఇ చ్చింది. హస్తకళలను, కళాకృతులను ప్రదర్శిం చేందుకు 25 స్టాళ్లు, ఆడిటోరియం, ఓపెన్‌ఎయి ర్ థియేటర్‌తో శిల్పారామం నిర్మించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన హస్తకళాకారులు జి ల్లాలో ఉన్నప్పటికీ వారి కళలను ప్రదర్శించేం దుకు వేదిక కరువైంది. శిల్పారామం పూర్తయితే పెంబర్తి, చేర్యాల కళాకారులకు మంచి ఊతం లభించేంది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక అందుబాటులోకి వచ్చేంది. జిల్లా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల చిత్తశుద్ధితో ఇప్పుడు శిల్పారామం ఏర్పాటు డోలాయమానంలో పడింది.