ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ నేటికీ నెరవేర్చకుండానే
శ్రీకాకుళం అర్బన్:ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ నేటికీ నెరవేర్చకుండానే నవనిర్మాణ దీక్ష పేరుతో పర్యటించడం దేనికని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఈ పర్యటనలో సీఎంను నిలదీయాలని రైతులకు, డ్వాక్రా మహిళలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్మాన ప్రసాదరావు జన్మదిన వేడుకలు ఇక్కడి టౌన్‌హాల్‌లో గురువారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం అంతా కలసికట్టుగా పోరాడుదామన్నారు. జిల్లాప్రజలు టీడీపీనాయకులకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో 1994-2004 వరకూ ఉండే పరిస్థితులే మరలా వస్తున్నాయన్నారు.
రాజధాని నిర్మాణంపేరుతో అక్రమంగా భూములు లాక్కుంటున్నారన్నారు. కన్నెధార కొండ లీజు విషయంలో తానెప్పుడూ నిబంధనలను అతిక్రమించలేదనీ స్పష్టంచేశారు. 35సంవత్సరాల ప్రజాజీవితంలో ప్రజల జీవన విధానం, ఆర్థిక స్థితిగతుల మెరుగుకు కృషిచేశానని చెప్పారు. తన తరువాత తరం నాయకులు ఆ దిశగా కృషిచేయాలన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషిచేసిన ఘనత దివంగత వైఎస్‌ది అయితే టీడీపీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు వేసి అర్హులైన పేదలకు పథకాలు అందకుండా చేస్తున్న ఘనత చంద్రబాబుదన్నారు. ఆదర్శరైతులను, మధ్యాహ్నభోజన వర్కర్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని, ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కండక్టర్‌లుగా చేరి అందినకాడికి దోచుకున్నారని, ఇదేనా బాబుపాలన అని ధ్వజమెత్తారు. మంత్రి అచ్చెన్న సంస్కారం లేని వ్యక్తన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్న మొదటివ్యక్తి ఆయనేనని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఏ అధికారి అవమానం చేసినా ప్రజల తరపున భరిద్దామని, ప్రజలతో నిలదీద్దామన్నారు. వైఎస్ రాజ్యాన్ని జగన్‌మోహనరెడ్డి ద్వారా తిరిగి సాధిద్దామన్నారు. ఈ సందర్భంగా రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతితోపాటు పలువురు నాయకులు మాట్లాడుతూ ధర్మాన చేసిన అభివృద్ధిని కొనియాడారు. అనంతరం ధర్మాన జన్మదిన కేక్‌ను కట్ చేసి కుటుంబసభ్యులు, పార్టీ నాయకులతో ఆనందం పంచుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, మీసాల నీలకంఠంనాయుడుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ధర్మాన అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.