నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ‘తమ కుటుంబాన్ని ఆదరించిన ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.120 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మించాం. స్వచ్ఛమైన నీటిని సింహపురి ప్రజలకు రెండుపూటలా అందిస్తున్నాం. ఓటేసిన వారి రుణం తీర్చుకుంటున్నాం.’ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తరచూ చెప్పే మాటలివి. ‘మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి..కాళ్లు చూస్తే గడప దాటడం లేదు’ అనే సామెత చందాన తయారైంది అసలు పరిస్థితి. మసిపూసి మారేడు కాయ చేసినట్లు కోట్లాది రూపాయల నిధులను ఖర్చుచేసి ఇప్పుడు ప్రజలకు కలుషిత నీరు సరఫరా చేస్తున్నారు.
ఈ నీటిని తాగిన ప్రజలు వ్యాధుల బారిన పడి లబోదిబోమంటున్నారు. నెల్లూరు వాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.120 కోట్ల రూపాయల నిధులతో ఇందిర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పేరుతో నెల్లూరు చెరువులో 500 ఎకరాల విస్తీర్ణంలో ట్యాంకు నిర్మించారు. క్రమేణా స్టోరేజీ ట్యాంక్ నిర్వహణను గాలికొదిలేశారు. ట్యాంకులో జమ్ము, తుంగతో పాటు పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. పశువుల సంచారం కూడా ఎక్కువైంది. మరోవైపు సమీప ప్రాంత ప్రజలు బహిర్భూమిగా వినియోగించుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కొందరు ఈ నీటిలోనే దుస్తులు సైతం ఉతుకుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పైగా ట్యాంకు నిర్మించిన నేల చవుడు తత్వా న్ని కలిగివుంది. ఇలాంటి ట్యాంకులో నిల్వచేసిన నీటిని పొదలకూరురోడ్డు, గాంధీనగర్, వీఎంఆర్‌నగర్, బీవీనగర్, సుందరయ్యకాలనీ, పడారుపల్లి, విక్రమ్‌నగర్ తదితర ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఈ నీరు కలుషితమై పచ్చగా వస్తున్నాయని ప్రజలు లబోదిబోమంటున్నా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకూ పట్టడం లేదు. వీటిని తాగిన జనం జ్వరాల బారిన పడి విలవిలలాడుతున్నా స్పందించే వారు కరువయ్యారు. ఇక చేసేదేమీ లేక పలువురు మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. గతంలో బుజ్జమ్మ రేవు ద్వారా పెన్నానది నుంచి సరఫరా అయ్యే నీటిని వద్దన్న వారే ఇప్పుడు తమకు ఆ నీరే కావాలని కోరుతున్నారంటే సమ్మర్ స్టోరేజీ ట్యాంకు దుస్థితికి అద్దం పడుతోంది.