summer storage
-
శివార్లలో తాగునీటికి కటకట
అమలాపురం : నియోజకవర్గ పరిధిలో శివార్లలో తాగునీటి కోసం ప్రజలు అలమటిస్తున్నారు. పట్టణ పరిధిలో మున్సిపల్ కుళాయిలకు విద్యుత్ మోటార్లు పెట్టి తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. పట్టణ ప్రజలకు 45 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తుంటే అందులో 13 లక్షల లీటర్ల నీరు పక్కదారి పడుతోంది. మిగిలిన 32 లక్షల లీటర్ల నీరు పట్టణంలోని 11 వేలఇళ్లకు చెందిన 53 వేల మంది ప్రజలకు సరిపోవడం లేదు. 15 శివారు ప్రాంతాల్లో ఉదయం పూట మాత్రమే నీరు సక్రమంగా సరఫరా అవుతోంది. సాయంత్ర వేళల్లో ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. అమలాపురం మండలంలో బండారులంకలో రూ.3.50 కోట్లతో మంచినీటి పథకాన్ని ఆరంభించినా సమ్మర్‌స్టోరేజ్‌కు గ్రామంలో భూమి దొరక్కపోవడంతో కాలువలు మూసిన తరువాత వేసవిలో నీటి ఇక్కట్లు తప్పడం లేదు. బోరు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా, పూర్తి స్థాయిలో అందడం లేదు. ఫిల్టర్ బెడ్లు పాడైపోవడంతో అమలాపురం మున్సిపాలిటీ, ప్రైవేట్ కంపెనీల నుంచి మంచినీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గున్నేపల్లి అగ్రహారం, నడిపూడి, గ్రామాల్లో వేసవిలో శివారుల్లో నీటి సరఫరాకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈదరపల్లిలో శివారు ప్రాంతాలకు తాగునీరు అందడంలేదు. శ్రీనివాసనగర్‌లో 60 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్‌ను నిర్మించినప్పటికీ పైపులైన్లేకపోవడం వల్ల నీరు అందడంలేదు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ఉన్న ఓహెచ్ ట్యాంకు సామర్థ్యం సరిపడక, పైపులైన్ సాంకేతిక సమస్యతో తాగునీరు సరిగా అందడం లేదు. కుళాయిల వద్ద గోతులు తీసి అడుగుభాగాన ఉన్న పైపులైన్ నుంచి నీరు పట్టుకుంటున్నారు. వాసాలతిప్ప తీరంలో అయితే ఓహెచ్ ట్యాంకుశిథిలస్థితికి చేరింది. డి.రావులపాలెం గ్రామంలో శివారు ప్రాంతాలైన బళ్లవారిపేట, సాపేవారిపేట ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. శివారు ప్రాంతాలు కావడంతో మంచినీటిని ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామంలో ఉన్న ట్యాంకు నుంచి వాటర్టిన్నుల సహాయంతో సైకిల్‌పై తెచ్చుకుంటారు. అల్లవరం మండలం ఎస్.పల్లిపాలెం, కొమరగిరిపట్నం శివారు నక్కా రామేశ్వరంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి నక్కా రామేశ్వరానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. దూరం కావడం వల్ల ట్యాంకులోకి నీరు రావడం లేదు. రెండు రోజులకు ఒక్కసారి మత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారు. -
జగడం వద్దు.. జలం ఇవ్వండి
అనంతపురం టౌన్ : వేసవిలో నీటి ఎద్దడి అధికంగా ఉండే సూచనలు కన్పిస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో ఏ ప్రాంతమూ ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఇటు ప్రజాప్రతినిధులు, అటు జిల్లా అధికారులపై ఉంది. సమస్య ఎక్కడ తలెత్తినా తక్షణమే స్పందించాలి. తగిన పరిష్కార మార్గాలు చూపాలి. ‘జల జగడాలు’ తలెత్తకుండా చూడాలి. ప్రస్తుతం అనంతపురం రూరల్ పరిధిలోని చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వీటికి అనంతపురం నగర పాలక సంస్థకు చెందిన సత్యసాయి ప్రాజెక్టు ద్వారా నీరివ్వాలని ఇటీవల ప్రభుత్వం జీఓ-5 జారీ చేసింది. ఈ క్రమంలో అనంతపురం నగరానికి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయమూ కలగకూడదని పేర్కొంది. మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నుంచి తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ద్వారా వచ్చే నీటిని సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు పంపింగ్ చేసుకుని..అనంతపురం రూరల్ గ్రామాలకు సమృద్ధిగా సరఫరా చేయవచ్చు. అరుుతే.. నగరానికి నీటిని అందిస్తున్న పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) పథకం ద్వారా రూరల్ గ్రామాలకు నీరు సరఫరా చేసేలే జీవో తీసుకొచ్చేందుకు మంత్రి పరిటాల సునీత ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా జీవో తేవడం వల్ల ఇరు ప్రాంతాలను ఇబ్బందులకు గురి చేసినట్లు అవుతుంది. వేసవిలో రూరల్ గ్రామాలకు నీరు తప్పని సరిగా ఇవ్వాల్సిన అవసరముంది. అయితే.. ఒక పథకం ద్వారా మళ్లించేలా చూడడం వల్ల దానిపై ఆధారపడిన ప్రాంతాల్లో సమస్య తలెత్తుతుంది. నగ ర జనాభాకు అనుగుణంగా రోజుకు 40 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు పీఏబీఆర్ పథకం ద్వారా సరఫరా అవుతోంది. దీనికి అంతరాయం కల్గిస్తే నగరంలో నీటి ఎద్దడి నెలకొంటుంది. అలాగాకుండా ఎంపీఆర్ నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పంపింగ్ చేసుకుని.. సత్యసాయి వాటర్ వర్క్స్ ద్వారా రూరల్ గ్రామాలకు సరఫరా చేస్తే సమస్య ఉండదు. ప్రస్తుత జీవో కూడా ఇదే చెబుతోంది. పీఏబీఆర్ పథకం ఏర్పాటు చేయకముందు ఎంపీఆర్‌లో నగర వాటాగా 1.4 టీఎంసీల నీటి కేటాయింపు ఉండేది. అదే కోటాను ప్రస్తుతం రూరల్‌కు ఇచ్చేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇటు నగర, అటు రూరల్ ప్రజలకు పూర్తిస్థాయిలో నీటిని అందించవచ్చు. అందరికీ ఇవ్వాలి అందరికీ నీరు ఇవ్వాల్సిందే. ఒక ప్రాంతానికి ఇచ్చే క్రమంలో మరొక ప్రాంతానికి ఇబ్బంది కల్గించకూడదు. జీవో ప్రకారం సత్యసాయి ప్రాజెక్టు నుంచి గ్రామాలకు ఇచ్చుకోవాలి. పీఏబీఆర్ పథకానికి అంతరాయం కల్పించకూడదు. నగర ప్రజలకు పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు దివంగత వైఎస్సార్‌ను ఒప్పించి రూ.67 కోట్లతోపథకాన్ని ఏర్పాటు చేయించాము. దీనికి అంతరాయం కల్పిస్తే నగరప్రజలు ఇబ్బంది పడతారు. -బి.గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సమస్యలు సృష్టించకూడదు నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంది. అన్ని ప్రాంతాలకు నీటిని కచ్చితంగా ఇవ్వాలి. ఈ క్రమంలో సమస్యలు సృష్టించకూడదు. పీఏబీఆర్ పథకాన్ని నగర జనాభాకు అనుగుణంగా నిర్మించారు. ఈ నీటిని మళ్లిస్తే నగరంలోని ఐదారు లక్షల మంది ఇబ్బంది పడతారు. అలాగాకుండా సత్యసాయి ప్రాజెక్టును ఉపయోగించుకోవాలి. - అనంత చంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు గొడవ పడే పరిస్థితి కల్పించకూడదు వేసవిలో నీటి ఎద్దడి అధికంగా ఉంటుంది. దీని నివారణకు చేపట్టే చర్యల కారణంగా ప్రాంతాల మధ్య గొడవ లు జరిగే పరిస్థితి కల్పించకూడదు. అనంతపురం రూరల్ గ్రామాలకు కచ్చితంగా నీరు ఇవ్వాలి. అయితే.. వేరొక ప్రాంతానికి ఇబ్బంది రాకుండా చూడాలి. - రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి జీవో ప్రకారం నడుచుకోవాలి నీటి సమస్య ఎక్కడున్నా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదే. అలా అని ఒక ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టి.. మరో ప్రాంతానికి మేలు చేసే చర్యలకు దిగకూడదు. సత్యసాయి ప్రాజెక్టు నుంచి రూరల్ గ్రామాలకు నీటిని ఇవ్వాలని జీవోలో ఉంది. ఆ ప్రకారం నడుచుకోవాలి. - జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి -
సమస్యలు సవాలక్ష
పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. వేసవిలో అయితే మరీ కష్టంగా ఉంటోంది. పైపు లైను లీకేజీలతో నీరు కలుషితమవుతోంది. దీంతో మంచినీరు కొని తాగాల్సి వస్తోంది. పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నం. కాలువల్లో నీరు సక్రమంగా ముందుకు పారడం లేదు. దీంతో దోమలతో అల్లాడిపోతున్నాం. వేకాదు.. మరెన్నో సమస్యలను సత్తెనపల్లి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. జనాభాకు సరిపడా మంచినీరు సమృద్ధిగా ఉన్నా తరచూ పైపుల లీకేజీల కారణంగా మంచినీరు అందడం లేదు. రూ.14.50 కోట్లతో లక్కరాజుగార్లపాడు రోడ్డులో 120 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసి చెరువు తవ్వించారు. రూ.20.06 కోట్ల యూఐడీఎస్ఎస్ఎంటీ నిధులు, హడ్కో కింద రూ.14 కోట్లు ఖర్చు చేసి రిజర్వాయర్లు, సమ్మర్ స్టోరేజీ, ఫిల్టరేషన్ ప్లాంట్లు, ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. 60 కిలోమీటర్ల వరకు పైపులైను ఏర్పాటు చేశారు. తరచూ పైపులైనుల లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతుండటంతో పట్టణ ప్రజలు డబ్బా నీటిని కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి నెలకొంది. శివారు కాలనీలకు ట్యాంకర్ల నీరే గత్యంతరం. పట్టణంలోని అన్ని వార్డుల్లో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారులపైకి కూడా వచ్చి వాహనచోదకులను ఇబ్బందులు పెడుతున్నాయి. వాటి దాడిలో స్థానికులు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. పురపాలక సంఘ పరిధిలో కొన్ని చోట్ల డ్రెయినేజీలు ఆక్రమణలకు గురయ్యాయి. పట్టణం మొత్తం మీద మురుగునీరు పారేందుకు సక్రమమైన వ్యవస్థ లేదు. పారిశుద్ధ్యానికి ఏడాదికి రూ.1.80 కోట్లు పురపాలక సంఘం ఖర్చు చేస్తుంది. రోజుకు 48 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ చేస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు చేర్చాలి. అలాకాకుండా రైల్వేస్టేషన్ రోడ్డులో ఎక్కడపడితే అక్కడ నిల్వ చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 12వ ఆర్థిక సంఘం నిధులు 1.50 కోట్లు ఖర్చు చేసినా పూర్తిస్థాయిలో డంపింగ్ నిర్మాణం మాత్రం జరుగలేదు.పట్టణంలోని రహదారులను సిమెంటు రోడ్లుగా మార్చారు. కొన్ని చోట్ల సిమెంటు రోడ్లు బీటలు వేసి ఇందులోని రాళ్లు పైకిలేచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వర్షం వస్తే సత్తెనపల్లి లోతట్టు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు. ప్రధానంగా నాగన్నకుం ట, సుందరయ్య కాలనీ, వెంకటపతి కాలనీ, దోభీ ఘాట్ ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షం కురిసినా వర్షపు నీరు గృహాల్లోకి చేరుతుంది. ఈ సమస్య పరిష్కారానికి స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్ నిర్మాణమే మార్గమని భావి ంచినప్పటికీ ప్రతిపాదనలు పంపారే తప్ప ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. పట్టణంలో ఏ వార్డులో చూసినా విద్యుద్దీపాలు సరిగా వెలగక అలంకార ప్రాయంగా ఉంటున్నాయి. ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ పరిస్థితి దాదాపు ఇంతే. మున్సిపాలిటీ నెలకు విద్యుత్‌బిల్లుల కింద రూ.2.10 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. దీని నిర్వహణకు రూ.50 నుంచి రూ.లక్ష వరకు అవుతున్నాయి. ఇదిలా ఉంటే పట్టణంలో లక్కరాజుగార్లపాడు బస్టాండ్‌సెంటర్, ఎఫ్‌సీఐ ప్రాంతాల్లో కొన్ని వీధి దీపాలు నిత్యం వెలుగుతూ విద్యుత్ వృధా అవుతుంది. దీంతో నెలకు రూ.30 వేల విద్యుత్ వృధాగా పోతోంది.సత్తెనపల్లిలో పార్కు ఏరియా అని పేరుంది తప్ప, అక్కడ సేద తీరడానికి పార్కు మాత్రం లేదు. రైల్వేస్టేషన్ రోడ్డులోని చెరువు స్థలం పార్కుగా నిర్మించేందుకు రూ.2.2 కోట్లు ఖర్చు చేశారు. పూర్తిస్థాయిలో పనులు జరుగకపోవడంతో ఇంకా వాడుకలోకి రాలేదు. పట్టణంలో పూర్తిస్థాయిలో బైపాస్ రహదారులు లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 50వేల పైనే వాహనాలు పట్టణంలోకి వచ్చి పోతుండటంతో ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది. కోతుల బెడద ఎక్కువగా ఉంది. పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పార్కు ఏరియాలో కోతులు ఇళ్లపైకి గుంపులుగా చేరి దుస్తులు, వస్తువులను తీసుకెళ్లడం, పిల్లలపైకి వచ్చి గాయపర్చడం వంటివి చేస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. చెత్తను నిర్వహణ సరిగా లేదు.. పట్టణంలో సేకరించిన చెత్తచెదారాన్ని సక్రమంగా డంపింగ్ యార్డుకు పారిశుద్ధ్య కార్మికులు చేర్చడం లేదు. రైల్వేస్టేషన్ రోడ్డులో రహదారి పక్కన పోస్తున్నారు. దీంతో రాకపోకల సమయంలో దుర్గంధం భరించలేకపోతున్నాము. -
ఎస్ఎస్ ట్యాంక్‌కు గండి
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: నగర పాలక సంస్థ నీటి ప్రాజెక్టులోని సమ్మర్ స్టోరేజ్(ఎస్ఎస్)ట్యాంక్‌కు బుధవారం ఉదయం గండి పడింది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు యుద్ధ ప్రాతిదికన చర్యలు చేపట్టడంతో ముప్పు తప్పింది. ట్యాంక్ కట్టకు గండి పడి నీరు కట్టకు ఆవలి వైపునకు వచ్చింది. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) జక్కా శ్రీనివాసులు, మున్సిపల్ ఇంజనీర్ శివరామిరెడ్డి, డీఈఈ సతీష్‌చంద్ర, ఏఈ నరసింహ నీటి సరఫరా ఉద్యోగులు సంఘటన స్థలానికి వెళ్లి గండిని పరిశీలించారు. గండి తీవ్రత పెరగకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ఇసుక, నల్లమట్టి, ఎండుగడ్డి కట్టలు తెప్పించి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మరమ్మతు చేపట్టినా.. గండి పడిన చోట నీటి వేగం తగ్గించగలిగారే కానీ పూర్తి స్థాయిలో అరికట్టలేకపోయారు. దీంతో రాత్రికి ప్రమాదం చోటుచేసుకోకూడదని ఇసుక బస్తాలు, నల్లమట్టిని గండి మార్గం వద్ద డంప్ చేయించారు. దీంతో రాత్రి 9 గంటలకు నీటి లీకేజీ తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. పూడ్చివేత పనులను కమిషనర్ రంగయ్య పరిశీలించారు. రాత్రి వేళలో కూడా కొందరు కార్మికులను ఎస్ఎస్ ట్యాంక్ వద్ద ఉంచి, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గండి పడడం ఇది మూడో సారి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండిపడడం ఇది మూడోసారి. మొదటి సారి 1992లో గండి పడింది. అయితే దాని తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో త్వరగానే మరమ్మతు చేశారు. రెండవ సారి 2002లో భారీ స్థాయిలో గండి పడింది. అది రాత్రివేళ చోటు చేసుకుంది. గండిపడిన విషయం గుర్తించే సరికి కట్ట తెగింది. అప్పటి కలెక్టర్ సోమేష్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగి వందల సంఖ్యలో లారీలతో ఇసుకను తెప్పించి గండి పూడ్చివేయించారు. అప్పట్లో ట్యాంక్ పరిసరాల్లో నివాసాలు లేకపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రస్తుతం మూడో సారి గండి పడింది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండేది. ప్రస్తుతం కట్ట కింది భాగంలో వందల సంఖ్యలో నివాస గృహాలు వెలిశాయి. అధికారులు అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టడంతో ముప్పు తప్పింది. మూడు నాలుగు గంటలు ఆలస్యం జరిగినా గండి స్థాయి పెరిగేదని, ఆ ఒత్తిడికి కట్ట తెగిపోయేదని అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎస్ ట్యాంక్‌లోని నీటిని హెచ్ఎల్సీలోకి వదిలేందుకు నాన్ రిటర్న్ వాల్వును రాత్రి 9 గంటలకు కట్ చేశారు. దీంతో కొంత నీరు కాలువలోకి వెళ్లింది. నీటి సరఫరాలో ఇబ్బంది లేదు సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌కు గండి పడిన కారణంగా నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం నగర ప్రజలకు పీఏబీఆర్ నుంచి నీటిని అందిస్తున్నాం. ఏదైనా సమస్య తలెత్తి పీఏబీఆర్ నీటికి అంతరాయం ఏర్పడితే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయంగా ఎస్ఎస్ ట్యాంక్‌ను నింపి ఉంచామన్నారు. - రంగయ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
గరళంలా ‘ఇందిర’ జలం
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ‘తమ కుటుంబాన్ని ఆదరించిన ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.120 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మించాం. స్వచ్ఛమైన నీటిని సింహపురి ప్రజలకు రెండుపూటలా అందిస్తున్నాం. ఓటేసిన వారి రుణం తీర్చుకుంటున్నాం.’ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తరచూ చెప్పే మాటలివి. ‘మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి..కాళ్లు చూస్తే గడప దాటడం లేదు’ అనే సామెత చందాన తయారైంది అసలు పరిస్థితి. మసిపూసి మారేడు కాయ చేసినట్లు కోట్లాది రూపాయల నిధులను ఖర్చుచేసి ఇప్పుడు ప్రజలకు కలుషిత నీరు సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగిన ప్రజలు వ్యాధుల బారిన పడి లబోదిబోమంటున్నారు. నెల్లూరు వాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.120 కోట్ల రూపాయల నిధులతో ఇందిర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పేరుతో నెల్లూరు చెరువులో 500 ఎకరాల విస్తీర్ణంలో ట్యాంకు నిర్మించారు. క్రమేణా స్టోరేజీ ట్యాంక్ నిర్వహణను గాలికొదిలేశారు. ట్యాంకులో జమ్ము, తుంగతో పాటు పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. పశువుల సంచారం కూడా ఎక్కువైంది. మరోవైపు సమీప ప్రాంత ప్రజలు బహిర్భూమిగా వినియోగించుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కొందరు ఈ నీటిలోనే దుస్తులు సైతం ఉతుకుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ట్యాంకు నిర్మించిన నేల చవుడు తత్వా న్ని కలిగివుంది. ఇలాంటి ట్యాంకులో నిల్వచేసిన నీటిని పొదలకూరురోడ్డు, గాంధీనగర్, వీఎంఆర్నగర్, బీవీనగర్, సుందరయ్యకాలనీ, పడారుపల్లి, విక్రమ్‌నగర్ తదితర ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఈ నీరు కలుషితమై పచ్చగా వస్తున్నాయని ప్రజలు లబోదిబోమంటున్నా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకూ పట్టడం లేదు. వీటిని తాగిన జనం జ్వరాల బారిన పడి విలవిలలాడుతున్నా స్పందించే వారు కరువయ్యారు. ఇక చేసేదేమీ లేక పలువురు మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. గతంలో బుజ్జమ్మ రేవు ద్వారా పెన్నానది నుంచి సరఫరా అయ్యే నీటిని వద్దన్న వారే ఇప్పుడు తమకు ఆ నీరే కావాలని కోరుతున్నారంటే సమ్మర్ స్టోరేజీ ట్యాంకు దుస్థితికి అద్దం పడుతోంది. -
కమీషన్లకు కక్కుర్తి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘రాబోయే 50 ఏళ్ల వరకు నెల్లూరు నగరంతో పాటు శివారు గ్రామాల్లో సైతం తాగునీటి ఎద్దడి లేకుండా చేస్తా. నగరానికి రెండు పూటలా నీరందించేందుకు జరుగుతున్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులను వెంటనే పూర్తి చేయిస్తా. ప్రజలు హాయిగా నిద్రపోయేందుకు , దోమలను నివారించేందుకు భూగర్భడ్రైనేజీని సాధించి రెండేళ్లలో పూర్తి చేస్తా. అభివృద్ధి కావాలంటే నాకే ఓట్లు వేయాలి’ అని 2009 ఎన్నికల ప్రచారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనం వివేకానందరెడ్డి పదే పదే పలికిన చిలుక పలుకులివి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సదాశయంతో ప్రజల దాహార్తి తీర్చేందుకు 2005లో నగరానికి రూ.102 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును మంజూరు చేశారు. ఆ తర్వాత మరో రూ. 18.58 కోట్లను అదనపు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణానికి, పెన్నానదిలో ఇన్‌ఫిల్టరేషన్ గాలరీ తదితర పనుల కోసం మంజూరు చేయించి ఈ ప్రాజెక్టుకు కలిపారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.120.58 కోట్లకు పెరిగింది. ఈ పనుల పర్యవేక్షణను పబ్లిక్‌హెల్త్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించారు. ప్రాజెక్టును పూర్తి చేసి తాగునీటి ఇబ్బందులు తొలగించాలి. ఉన్నతాశయంతో వైఎస్ మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల కమీషన్ల కక్కుర్తి వల్ల మట్టిపాలవుతోంది. పనులు ప్రారంభించి ఐదేళ్లు అయినా నీటిని పూర్తి స్థాయిలో నిలువ ఉంచలేదు. ఇంతలోనే పెనుప్రమాదం ముంచుకొచ్చింది. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మట్టి కట్ట పెద్ద ఎత్తున బీటలు వారింది. కట్ట ఎప్పుడైనా తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. 120 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. దీనికి ప్రధాన కారణం కమీషన్లు కోసం కక్కుర్తిపడటమే. కట్ట నిర్మించే ముందు సరైన పరీక్షలు చేయలేదని తెలుస్తోంది. దీని వెనక ఓ ప్రజాప్రతినిధి హస్తముందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా నగర వాసులు తీవ్ర నీటి ఎద్దడిని మళ్లీ ఎదుర్కోబోతున్నారు. ఎస్ఎస్ ట్యాంకు కథా కమామిషు నెల్లూరుకు వరప్రసాదిని సోమశిల ప్రాజెక్టు. నగరానికి తాగునీటి కోసం నికర జలాల వాటా ఉంది. పక్కనే పెన్నానది ఉంది. అయినా నగర వాసులకు వేసవి నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర ప్రజల నీటి ఎద్దడి గురించి తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చేయాలంటే సమ్మర్ స్టోరేజీ ట్యాంకు అవసరమని గుర్తించారు. ఈ మేరకు జూలై 27, 2005న రూ. 102 కోట్లతో అప్పటి పురపాలకశాఖ మంత్రిగా ఉన్న కోనేరు రంగారావుతో కలిసి ఇందిరా జలనిధి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు నెల్లూరులో శంకుస్థాపన చేశారు. అప్పటి రాపూరు ఎమ్మెల్యే, ప్రస్తుత ఆర్థిక మంత్రి అయిన ఆనం రామనారాయణరెడ్డి , నాటి నెల్లూరు నగర ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఈ కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా నడిపించారు. తామే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ద్వారా నిధులు విడుదల చేయించామని ప్రచారం చేసుకున్నారు. 2021వ సంవత్సరం వరకు 8,69,747 మంది ప్రజలకు నీటిని అందించే విధంగా ఈ ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులను చెన్నైకు చెందిన ఎల్అండ్టీ కంపెనీ (లార్సెన్ అండ్ టుబ్రో) దక్కించుకుంది. 2009 నాటికే పనులు పూర్తి చేయాలి. కాని అగ్రిమెంటుకు విరుద్ధంగా మూడు సార్లు గడువును పొడగించాల్సి వచ్చింది. ఓ ప్రజాప్రతినిధి తన అభయహస్తం ద్వారా గడువును పొడిగించేందుకు సహకరించడం విశేషం. బినామీలు, ఆలస్యం కాంట్రాక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ కంపెనీ పనులను సబ్‌కాంట్రాక్టర్ సుబ్బయ్య చౌదరికి లీజుకు అప్పగించింది. అయితే సకాలంలో సబ్‌కాంట్రాక్టర్‌కు కంపెనీ చెల్లింపులు చేయలేదు. దీంతో సబ్ కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకుండా ఆపేశారు. పలు చోట్ల నాసిరకం నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎల్అండ్టీ కంపెనీకి, సబ్‌కాంట్రాక్టర్‌కు మధ్య వివాదం ఏర్పడటంతో పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీరిద్దరికి నగరాన్ని శాసించే ఓ ప్రజాప్రతినిధి రాజీ చేశారు. అయితే చివరగా సబ్ కాంట్రాక్టర్‌ను తొలగించి నేరుగా ఎల్అండ్టీ కంపెనీ పనులు చేపట్టింది. కట్టకు బీటలు నీటిని నిల్వ చేసేందుకు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుతోపాటు నీటిని శుద్ధి చేసే ప్లాంటు నిర్మించాలి. నగరంలో 8 ఓవర్‌హెడ్ ట్యాంకులు పూర్తి చేయాలి. 36 కిలోమీటర్లు పైపులైను ఏర్పాటు చేయాలి. 8000 ఎంఎల్టీ నీటిని నిల్వ చేసేందుకు అనుకూలంగా కట్టను నిర్మించాలి. 2009 నుంచి ప్రతి సంవత్సరం మూడోవంతు నీటిని నిల్వ చేస్తూ మూడేళ్లలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచి ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా చూడాలి. అయితే దాదాపు మూడేళ్లు ఆలస్యంగా సమ్మర్ స్టోరేజీ ట్యాంకు కట్ట మినహా మిగతా పనులు పూర్తిచేశారు. ఇంతలోనే కట్ట కు బీటలు రావడంతో అధికారులతో పాటు కాంట్రాక్టర్ తలలు పట్టుకున్నారు. బీటలు వారడానికి కారణం చెరువులో మరో చెరువు నిర్మించారు. సరైన జియో స్ట్రక్చరల్ ఇంజనీర్లతో పరీక్ష చేయించకుండానే చెరువులో మరో చెరువు కట్టను నిర్మించడం వల్ల సమస్య తలెత్తింది. కట్టకు ఎన్ని సార్లు మరమ్మతులు చేస్తున్నా బీటలు వారడంతో చేసేదేమీలేక పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి గత మూడు నెలల కిందట నివేదిక పంపారు. ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు డిజైన్‌ను కొంత వరకు మార్చి మళ్లీ కట్టను నిర్మించేందుకు ఎల్అండ్టీ కంపెనీ సిద్ధపడింది. ఇది ఎంత వరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాల్సిందే . మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్దీ మరో కథ ఎస్ఎస్ ట్యాంకుకు మొదట మంజూరు చేసిన 102 కోట్లకు మరో 18.58 కోట్లను ప్రభుత్వం 2010లో మంజూరు చేసింది. ఈ నిధులను అదనంగా మరో 10 ఓవర్‌హెడ్ ట్యాంకులను, పెన్నానదిలో ఇన్‌ఫిల్టరేషన్ గ్యాలరీను ఏర్పాటు చేసేందుకు కేటాయించింది. ఈ 18.58 కోట్ల పనులను లెస్ పోను 16.68 కోట్లతో పనులు చేపట్టేందుకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ కంపెనీ జనవరి 7, 2011న టెండర్ దక్కించుకుంది. సంవత్సరంలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ పనులనూ కూడా సదరు కంపెనీ శంకరయ్య, రమేష్ అనే ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. వీరు పదికి గాను కేవలం 4 ట్యాంకులను మాత్రమే పూర్తి చేశారు. మిగతా పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయినా అడిగే నాథుడే లేడు. దీంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.