అనంతపురం టౌన్ : వేసవిలో నీటి ఎద్దడి అధికంగా ఉండే సూచనలు కన్పిస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో ఏ ప్రాంతమూ ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఇటు ప్రజాప్రతినిధులు, అటు జిల్లా అధికారులపై ఉంది. సమస్య ఎక్కడ తలెత్తినా తక్షణమే స్పందించాలి. తగిన పరిష్కార మార్గాలు చూపాలి. ‘జల జగడాలు’ తలెత్తకుండా చూడాలి. ప్రస్తుతం అనంతపురం రూరల్ పరిధిలోని చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వీటికి అనంతపురం నగర పాలక సంస్థకు చెందిన సత్యసాయి ప్రాజెక్టు ద్వారా నీరివ్వాలని ఇటీవల ప్రభుత్వం జీఓ-5 జారీ చేసింది. ఈ క్రమంలో అనంతపురం నగరానికి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయమూ కలగకూడదని పేర్కొంది. మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నుంచి తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ద్వారా వచ్చే నీటిని సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు పంపింగ్ చేసుకుని..అనంతపురం రూరల్ గ్రామాలకు సమృద్ధిగా సరఫరా చేయవచ్చు. అరుుతే.. నగరానికి నీటిని అందిస్తున్న పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) పథకం ద్వారా రూరల్ గ్రామాలకు నీరు సరఫరా చేసేలే జీవో తీసుకొచ్చేందుకు మంత్రి పరిటాల సునీత ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా జీవో తేవడం వల్ల ఇరు ప్రాంతాలను ఇబ్బందులకు గురి చేసినట్లు అవుతుంది. వేసవిలో రూరల్ గ్రామాలకు నీరు తప్పని సరిగా ఇవ్వాల్సిన అవసరముంది. అయితే.. ఒక పథకం ద్వారా మళ్లించేలా చూడడం వల్ల దానిపై ఆధారపడిన ప్రాంతాల్లో సమస్య తలెత్తుతుంది. నగ ర జనాభాకు అనుగుణంగా రోజుకు 40 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు పీఏబీఆర్ పథకం ద్వారా సరఫరా అవుతోంది. దీనికి అంతరాయం కల్గిస్తే నగరంలో నీటి ఎద్దడి నెలకొంటుంది.
అలాగాకుండా ఎంపీఆర్ నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పంపింగ్ చేసుకుని.. సత్యసాయి వాటర్ వర్క్స్ ద్వారా రూరల్ గ్రామాలకు సరఫరా చేస్తే సమస్య ఉండదు. ప్రస్తుత జీవో కూడా ఇదే చెబుతోంది. పీఏబీఆర్ పథకం ఏర్పాటు చేయకముందు ఎంపీఆర్‌లో నగర వాటాగా 1.4 టీఎంసీల నీటి కేటాయింపు ఉండేది. అదే కోటాను ప్రస్తుతం రూరల్‌కు ఇచ్చేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇటు నగర, అటు రూరల్ ప్రజలకు పూర్తిస్థాయిలో నీటిని అందించవచ్చు.
అందరికీ ఇవ్వాలి
అందరికీ నీరు ఇవ్వాల్సిందే. ఒక ప్రాంతానికి ఇచ్చే క్రమంలో మరొక ప్రాంతానికి ఇబ్బంది కల్గించకూడదు. జీవో ప్రకారం సత్యసాయి ప్రాజెక్టు నుంచి గ్రామాలకు ఇచ్చుకోవాలి. పీఏబీఆర్ పథకానికి అంతరాయం కల్పించకూడదు. నగర ప్రజలకు పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు దివంగత వైఎస్సార్‌ను ఒప్పించి రూ.67 కోట్లతోపథకాన్ని ఏర్పాటు చేయించాము. దీనికి అంతరాయం కల్పిస్తే నగరప్రజలు ఇబ్బంది పడతారు.
-బి.గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
సమస్యలు సృష్టించకూడదు
నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంది. అన్ని ప్రాంతాలకు నీటిని కచ్చితంగా ఇవ్వాలి. ఈ క్రమంలో సమస్యలు సృష్టించకూడదు. పీఏబీఆర్ పథకాన్ని నగర జనాభాకు అనుగుణంగా నిర్మించారు. ఈ నీటిని మళ్లిస్తే నగరంలోని ఐదారు లక్షల మంది ఇబ్బంది పడతారు. అలాగాకుండా సత్యసాయి ప్రాజెక్టును ఉపయోగించుకోవాలి.
- అనంత చంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు
గొడవ పడే పరిస్థితి కల్పించకూడదు
వేసవిలో నీటి ఎద్దడి అధికంగా ఉంటుంది. దీని నివారణకు చేపట్టే చర్యల కారణంగా ప్రాంతాల మధ్య గొడవ లు జరిగే పరిస్థితి కల్పించకూడదు. అనంతపురం రూరల్ గ్రామాలకు కచ్చితంగా నీరు ఇవ్వాలి. అయితే.. వేరొక ప్రాంతానికి ఇబ్బంది రాకుండా చూడాలి. - రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి
జీవో ప్రకారం నడుచుకోవాలి
నీటి సమస్య ఎక్కడున్నా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదే. అలా అని ఒక ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టి.. మరో ప్రాంతానికి మేలు చేసే చర్యలకు దిగకూడదు. సత్యసాయి ప్రాజెక్టు నుంచి రూరల్ గ్రామాలకు నీటిని ఇవ్వాలని జీవోలో ఉంది. ఆ ప్రకారం నడుచుకోవాలి.
- జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి
జగడం వద్దు.. జలం ఇవ్వండి
Published Mon, Feb 9 2015 2:00 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement