అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: నగర పాలక సంస్థ నీటి ప్రాజెక్టులోని సమ్మర్ స్టోరేజ్(ఎస్‌ఎస్)ట్యాంక్‌కు బుధవారం ఉదయం గండి పడింది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు యుద్ధ ప్రాతిదికన చర్యలు చేపట్టడంతో ముప్పు తప్పింది. ట్యాంక్ కట్టకు గండి పడి నీరు కట్టకు ఆవలి వైపునకు వచ్చింది. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) జక్కా శ్రీనివాసులు, మున్సిపల్ ఇంజనీర్ శివరామిరెడ్డి, డీఈఈ సతీష్‌చంద్ర, ఏఈ నరసింహ నీటి సరఫరా ఉద్యోగులు సంఘటన స్థలానికి వెళ్లి గండిని పరిశీలించారు.
గండి తీవ్రత పెరగకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ఇసుక, నల్లమట్టి, ఎండుగడ్డి కట్టలు తెప్పించి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మరమ్మతు చేపట్టినా.. గండి పడిన చోట నీటి వేగం తగ్గించగలిగారే కానీ పూర్తి స్థాయిలో అరికట్టలేకపోయారు. దీంతో రాత్రికి ప్రమాదం చోటుచేసుకోకూడదని ఇసుక బస్తాలు, నల్లమట్టిని గండి మార్గం వద్ద డంప్ చేయించారు. దీంతో రాత్రి 9 గంటలకు నీటి లీకేజీ తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. పూడ్చివేత పనులను కమిషనర్ రంగయ్య పరిశీలించారు. రాత్రి వేళలో కూడా కొందరు కార్మికులను ఎస్‌ఎస్ ట్యాంక్ వద్ద ఉంచి, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
గండి పడడం ఇది మూడో సారి
సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండిపడడం ఇది మూడోసారి. మొదటి సారి 1992లో గండి పడింది. అయితే దాని తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో త్వరగానే మరమ్మతు చేశారు. రెండవ సారి 2002లో భారీ స్థాయిలో గండి పడింది. అది రాత్రివేళ చోటు చేసుకుంది. గండిపడిన విషయం గుర్తించే సరికి కట్ట తెగింది. అప్పటి కలెక్టర్ సోమేష్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగి వందల సంఖ్యలో లారీలతో ఇసుకను తెప్పించి గండి పూడ్చివేయించారు. అప్పట్లో ట్యాంక్ పరిసరాల్లో నివాసాలు లేకపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రస్తుతం మూడో సారి గండి పడింది.
ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండేది. ప్రస్తుతం కట్ట కింది భాగంలో వందల సంఖ్యలో నివాస గృహాలు వెలిశాయి. అధికారులు అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టడంతో ముప్పు తప్పింది. మూడు నాలుగు గంటలు ఆలస్యం జరిగినా గండి స్థాయి పెరిగేదని, ఆ ఒత్తిడికి కట్ట తెగిపోయేదని అధికారులు పేర్కొన్నారు. ఎస్‌ఎస్ ట్యాంక్‌లోని నీటిని హెచ్‌ఎల్‌సీలోకి వదిలేందుకు నాన్ రిటర్న్ వాల్వును రాత్రి 9 గంటలకు కట్ చేశారు. దీంతో కొంత నీరు కాలువలోకి వెళ్లింది.
నీటి సరఫరాలో ఇబ్బంది లేదు
సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌కు గండి పడిన కారణంగా నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం నగర ప్రజలకు పీఏబీఆర్ నుంచి నీటిని అందిస్తున్నాం. ఏదైనా సమస్య తలెత్తి పీఏబీఆర్ నీటికి అంతరాయం ఏర్పడితే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయంగా ఎస్‌ఎస్ ట్యాంక్‌ను నింపి ఉంచామన్నారు.
- రంగయ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
ఎస్‌ఎస్ ట్యాంక్‌కు గండి
Published Thu, Jan 23 2014 2:15 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement