అమలాపురం : నియోజకవర్గ పరిధిలో శివార్లలో తాగునీటి కోసం ప్రజలు అలమటిస్తున్నారు. పట్టణ పరిధిలో మున్సిపల్ కుళాయిలకు విద్యుత్ మోటార్లు పెట్టి తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. పట్టణ ప్రజలకు 45 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తుంటే అందులో 13 లక్షల లీటర్ల నీరు పక్కదారి పడుతోంది. మిగిలిన 32 లక్షల లీటర్ల నీరు పట్టణంలోని 11 వేలఇళ్లకు చెందిన 53 వేల మంది ప్రజలకు సరిపోవడం లేదు. 15 శివారు ప్రాంతాల్లో ఉదయం పూట మాత్రమే నీరు సక్రమంగా సరఫరా అవుతోంది. సాయంత్ర వేళల్లో ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు.
అమలాపురం మండలంలో బండారులంకలో రూ.3.50 కోట్లతో మంచినీటి పథకాన్ని ఆరంభించినా సమ్మర్‌స్టోరేజ్‌కు గ్రామంలో భూమి దొరక్కపోవడంతో కాలువలు మూసిన తరువాత వేసవిలో నీటి ఇక్కట్లు తప్పడం లేదు. బోరు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా, పూర్తి స్థాయిలో అందడం లేదు. ఫిల్టర్ బెడ్‌లు పాడైపోవడంతో అమలాపురం మున్సిపాలిటీ, ప్రైవేట్ కంపెనీల నుంచి మంచినీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గున్నేపల్లి అగ్రహారం, నడిపూడి, గ్రామాల్లో వేసవిలో శివారుల్లో నీటి సరఫరాకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈదరపల్లిలో శివారు ప్రాంతాలకు తాగునీరు అందడంలేదు. శ్రీనివాసనగర్‌లో 60 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్‌ను నిర్మించినప్పటికీ పైపులైన్‌లేకపోవడం వల్ల నీరు అందడంలేదు.
ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ఉన్న ఓహెచ్ ట్యాంకు సామర్థ్యం సరిపడక, పైపులైన్ సాంకేతిక సమస్యతో తాగునీరు సరిగా అందడం లేదు. కుళాయిల వద్ద గోతులు తీసి అడుగుభాగాన ఉన్న పైపులైన్ నుంచి నీరు పట్టుకుంటున్నారు. వాసాలతిప్ప తీరంలో అయితే ఓహెచ్ ట్యాంకుశిథిలస్థితికి చేరింది.
డి.రావులపాలెం గ్రామంలో శివారు ప్రాంతాలైన బళ్లవారిపేట, సాపేవారిపేట ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. శివారు ప్రాంతాలు కావడంతో మంచినీటిని ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామంలో ఉన్న ట్యాంకు నుంచి వాటర్‌టిన్నుల సహాయంతో సైకిల్‌పై తెచ్చుకుంటారు.
అల్లవరం మండలం ఎస్.పల్లిపాలెం, కొమరగిరిపట్నం శివారు నక్కా రామేశ్వరంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి నక్కా రామేశ్వరానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. దూరం కావడం వల్ల ట్యాంకులోకి నీరు రావడం లేదు. రెండు రోజులకు ఒక్కసారి మత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారు.
శివార్లలో తాగునీటికి కటకట
Published Mon, May 2 2016 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM
Advertisement