సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘రాబోయే 50 ఏళ్ల వరకు నెల్లూరు నగరంతో పాటు శివారు గ్రామాల్లో సైతం తాగునీటి ఎద్దడి లేకుండా చేస్తా. నగరానికి రెండు పూటలా నీరందించేందుకు జరుగుతున్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులను వెంటనే పూర్తి చేయిస్తా. ప్రజలు హాయిగా నిద్రపోయేందుకు , దోమలను నివారించేందుకు భూగర్భడ్రైనేజీని సాధించి రెండేళ్లలో పూర్తి చేస్తా. అభివృద్ధి కావాలంటే నాకే ఓట్లు వేయాలి’ అని 2009 ఎన్నికల ప్రచారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనం వివేకానందరెడ్డి పదే పదే పలికిన చిలుక పలుకులివి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సదాశయంతో ప్రజల దాహార్తి తీర్చేందుకు 2005లో నగరానికి రూ.102 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును మంజూరు చేశారు.
ఆ తర్వాత మరో రూ. 18.58 కోట్లను అదనపు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణానికి, పెన్నానదిలో ఇన్‌ఫిల్టరేషన్ గాలరీ తదితర పనుల కోసం మంజూరు చేయించి ఈ ప్రాజెక్టుకు కలిపారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.120.58 కోట్లకు పెరిగింది. ఈ పనుల పర్యవేక్షణను పబ్లిక్‌హెల్త్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించారు. ప్రాజెక్టును పూర్తి చేసి తాగునీటి ఇబ్బందులు తొలగించాలి. ఉన్నతాశయంతో వైఎస్ మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల కమీషన్‌ల కక్కుర్తి వల్ల మట్టిపాలవుతోంది.
పనులు ప్రారంభించి ఐదేళ్లు అయినా నీటిని పూర్తి స్థాయిలో నిలువ ఉంచలేదు. ఇంతలోనే పెనుప్రమాదం ముంచుకొచ్చింది. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మట్టి కట్ట పెద్ద ఎత్తున బీటలు వారింది. కట్ట ఎప్పుడైనా తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. 120 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. దీనికి ప్రధాన కారణం కమీషన్‌లు కోసం కక్కుర్తిపడటమే. కట్ట నిర్మించే ముందు సరైన పరీక్షలు చేయలేదని తెలుస్తోంది. దీని వెనక ఓ ప్రజాప్రతినిధి హస్తముందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా నగర వాసులు తీవ్ర నీటి ఎద్దడిని మళ్లీ ఎదుర్కోబోతున్నారు.
ఎస్‌ఎస్ ట్యాంకు కథా కమామిషు
నెల్లూరుకు వరప్రసాదిని సోమశిల ప్రాజెక్టు. నగరానికి తాగునీటి కోసం నికర జలాల వాటా ఉంది. పక్కనే పెన్నానది ఉంది. అయినా నగర వాసులకు వేసవి నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర ప్రజల నీటి ఎద్దడి గురించి తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చేయాలంటే సమ్మర్ స్టోరేజీ ట్యాంకు అవసరమని గుర్తించారు.
ఈ మేరకు జూలై 27, 2005న రూ. 102 కోట్లతో అప్పటి పురపాలకశాఖ మంత్రిగా ఉన్న కోనేరు రంగారావుతో కలిసి ఇందిరా జలనిధి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు నెల్లూరులో శంకుస్థాపన చేశారు. అప్పటి రాపూరు ఎమ్మెల్యే, ప్రస్తుత ఆర్థిక మంత్రి అయిన ఆనం రామనారాయణరెడ్డి , నాటి నెల్లూరు నగర ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఈ కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా నడిపించారు. తామే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ద్వారా నిధులు విడుదల చేయించామని ప్రచారం చేసుకున్నారు. 2021వ సంవత్సరం వరకు 8,69,747 మంది ప్రజలకు నీటిని అందించే విధంగా ఈ ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులను చెన్నైకు చెందిన ఎల్‌అండ్‌టీ కంపెనీ (లార్సెన్ అండ్ టుబ్రో) దక్కించుకుంది. 2009 నాటికే పనులు పూర్తి చేయాలి. కాని అగ్రిమెంటుకు విరుద్ధంగా మూడు సార్లు గడువును పొడగించాల్సి వచ్చింది. ఓ ప్రజాప్రతినిధి తన అభయహస్తం ద్వారా గడువును పొడిగించేందుకు సహకరించడం విశేషం.
బినామీలు, ఆలస్యం
కాంట్రాక్టు దక్కించుకున్న ఎల్‌అండ్‌టీ కంపెనీ పనులను సబ్‌కాంట్రాక్టర్ సుబ్బయ్య చౌదరికి లీజుకు అప్పగించింది. అయితే సకాలంలో సబ్‌కాంట్రాక్టర్‌కు కంపెనీ చెల్లింపులు చేయలేదు. దీంతో సబ్ కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకుండా ఆపేశారు. పలు చోట్ల నాసిరకం నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎల్‌అండ్‌టీ కంపెనీకి, సబ్‌కాంట్రాక్టర్‌కు మధ్య వివాదం ఏర్పడటంతో పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీరిద్దరికి నగరాన్ని శాసించే ఓ ప్రజాప్రతినిధి రాజీ చేశారు. అయితే చివరగా సబ్ కాంట్రాక్టర్‌ను తొలగించి నేరుగా ఎల్‌అండ్‌టీ కంపెనీ పనులు చేపట్టింది.
కట్టకు బీటలు
నీటిని నిల్వ చేసేందుకు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుతోపాటు నీటిని శుద్ధి చేసే ప్లాంటు నిర్మించాలి. నగరంలో 8 ఓవర్‌హెడ్ ట్యాంకులు పూర్తి చేయాలి. 36 కిలోమీటర్లు పైపులైను ఏర్పాటు చేయాలి. 8000 ఎంఎల్‌టీ నీటిని నిల్వ చేసేందుకు అనుకూలంగా కట్టను నిర్మించాలి. 2009 నుంచి ప్రతి సంవత్సరం మూడోవంతు నీటిని నిల్వ చేస్తూ మూడేళ్లలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచి ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా చూడాలి. అయితే దాదాపు మూడేళ్లు ఆలస్యంగా సమ్మర్ స్టోరేజీ ట్యాంకు కట్ట మినహా మిగతా పనులు పూర్తిచేశారు. ఇంతలోనే కట్ట కు బీటలు రావడంతో అధికారులతో పాటు కాంట్రాక్టర్ తలలు పట్టుకున్నారు.
బీటలు వారడానికి కారణం
చెరువులో మరో చెరువు నిర్మించారు. సరైన జియో స్ట్రక్చరల్ ఇంజనీర్లతో పరీక్ష చేయించకుండానే చెరువులో మరో చెరువు కట్టను నిర్మించడం వల్ల సమస్య తలెత్తింది. కట్టకు ఎన్ని సార్లు మరమ్మతులు చేస్తున్నా బీటలు వారడంతో చేసేదేమీలేక పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి గత మూడు నెలల కిందట నివేదిక పంపారు. ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు డిజైన్‌ను కొంత వరకు మార్చి మళ్లీ కట్టను నిర్మించేందుకు ఎల్‌అండ్‌టీ కంపెనీ సిద్ధపడింది. ఇది ఎంత వరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాల్సిందే .
మెగా ఇంజనీరింగ్
ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్‌దీ మరో కథ
ఎస్‌ఎస్ ట్యాంకుకు మొదట మంజూరు చేసిన 102 కోట్లకు మరో 18.58 కోట్లను ప్రభుత్వం 2010లో మంజూరు చేసింది. ఈ నిధులను అదనంగా మరో 10 ఓవర్‌హెడ్ ట్యాంకులను, పెన్నానదిలో ఇన్‌ఫిల్టరేషన్ గ్యాలరీను ఏర్పాటు చేసేందుకు కేటాయించింది. ఈ 18.58 కోట్ల పనులను లెస్ పోను 16.68 కోట్లతో పనులు చేపట్టేందుకు మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్ కంపెనీ జనవరి 7, 2011న టెండర్ దక్కించుకుంది.
సంవత్సరంలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ పనులనూ కూడా సదరు కంపెనీ శంకరయ్య, రమేష్ అనే ఇద్దరు సబ్ కాంట్రాక్టర్‌లకు అప్పగించింది. వీరు పదికి గాను కేవలం 4 ట్యాంకులను మాత్రమే పూర్తి చేశారు. మిగతా పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయినా అడిగే నాథుడే లేడు. దీంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.
కమీషన్లకు కక్కుర్తి
Published Thu, Oct 24 2013 3:52 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement