దస్తగిరితో చంద్రబాబే పిటిషన్‌ వేయించారు | Vivekananda Reddy murder case: Dastagiri petition with false allegations | Sakshi
Sakshi News home page

దస్తగిరితో చంద్రబాబే పిటిషన్‌ వేయించారు

Published Tue, Apr 16 2024 4:19 AM | Last Updated on Tue, Apr 16 2024 4:23 AM

Vivekananda Reddy murder case: Dastagiri petition with false allegations - Sakshi

ఈ పిటిషన్‌ వెనుక రాజకీయ దురుద్దేశాలు

వైఎస్‌ సునీత కూడా చంద్రబాబు ఆదేశాల మేరకే వాదనలు

వివేకా హత్య కేసులో అవినాశ్‌ను ఇరికించేందుకు శతవిధాలా ప్రయత్నాలు

దస్తగిరి చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు

అవినాశ్‌ బెయిల్‌ రద్దు కోరుతూ దస్తగిరి వేసిన పిటిషన్‌ కొట్టేయండి

తెలంగాణ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు

తీర్పు రిజర్వు చేసిన తెలంగాణ హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌:  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌గా మారిన కిరాయి హంతకుడు దస్తగిరి పిటిషన్‌ వేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ ప్రతి­పక్ష నేత చంద్రబాబు దస్తగిరితో ఈ పిటిషన్‌ దాఖలు చేయించారని చెప్పారు. ఓ పక్క కేసు విచారణ సాగుతుండగా.. కడప నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి, వైఎస్‌ వివేకా కూతురు.. ఇద్దరూ అవినాశ్‌ను హంతకుడిగా చిత్రీకరించేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.

అవినాశ్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఇదే కేసులో నిందుతుడు (ఏ–4) దస్తగిరి తెలంగాణ హై­కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయ­మూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం విచారణ చేపట్టారు. అవినాశ్‌రెడ్డి తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ వాదనలను సమర్థిస్తూ సీబీఐ, సునీత తరఫు న్యాయవా­దులు వాదించారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. 

వారివి సంబంధం లేని వాదనలు
సీబీఐ, సునీత తరఫు న్యాయవాదుల వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని నిరంజన్‌ రెడ్డి చెప్పారు. ‘చట్టవిరుద్ధంగా అవినాశ్‌కు బెయిల్‌ ఇచ్చారని చెప్పడం ఈ వాదనలతో సంబంధంలేని అంశం. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కోర్టు అవినాశ్‌కు బెయిల్‌ ఇచ్చిన తర్వాత వాటిని ఆయన ఉల్లంఘించారా లేదా అన్న దానిపైనే వాదనలు సాగాలి. ఓ సీనియర్‌ న్యాయవాది, మరో పీపీ అనవసర వాదనంతా వినిపించారు. న్యాయ­స్థానం అవినాశ్‌కు విధించిన షరతుల్లో దేన్నీ ఆయన ఉల్లంఘించలేదు. కనీ వినీ ఎరుగని విధంగా బాధితులం అని చెప్పుకుంటున్న వారు అప్రూవర్‌తో కలసి నడుస్తున్నారు.

క్రిమి­నల్‌ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇష్టం వచ్చినట్లు అప్రూ­వర్‌ను ప్రకటించకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించినా.. దర్యాప్తు సంస్థే అతన్ని వెను­కేసుకుని వస్తోంది. వైఎస్‌ సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, కిరాయి హంతకుడు దస్తగిరి కూడా చంద్రబాబు చెబుతున్నట్లు వ్యవహరిస్తు­న్నారు. వివేకాకు రెండో భార్య ఉందని, ఆమె­తో కలిగిన కుమారుడికి, సునీతకు ఆస్తి తగా­దాలు ఉన్నాయన్నది వాస్తవం. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయడంలేదు. వివేకాను నరికా­నని చెబుతున్న వ్యక్తికే సునీత మద్దతుగా నిల­వడం పలు అను­మానాలకు తావిస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె కోర­లేదు. ఎవరు ఏ పిటిషన్‌ వేసినా ఇంప్లీడ్‌ అవుతూ అవినాశ్‌ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని ఆమె విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ, సునీత, కిరాయి హంతుకుడు ఒకే బాటలో సాగుతూ అవినాశ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

తప్పుడు ఆరోపణలతో దస్తగిరి పిటిషన్‌
‘ఇక్కడ దస్తగిరి తండ్రిపై దాడి చేశారని, జైలులో దస్తగిరిని చైతన్యరెడ్డి కలిశారని రెండు ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ఒక్క ఆధారమూ లేదు. ఆరోగ్య శిబి­రం నిర్వహించిన రోజు చైతన్యరెడ్డితో పాటు పదుల సంఖ్యలో వైద్యులు అక్కడికి వెళ్లారు.

జైలు అధికారులంతా వారి వెంట ఉన్నారు. దస్తగిరిని చైతన్యరెడ్డి కలవడం అనేది అసాధ్యం అని జైలు అధికారులు చెబుతు­న్నారు. చైతన్యరెడ్డి జైలుకు రూ.20 కోట్లు తీసుకొచ్చాడని దస్తగిరి ఆరోపిస్తు­న్నారు. అంత మంది ఉండగా, అంత పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం సాధ్యం అవుతుందా? దీనికి, అవినాశ్‌కు ఏమిటి సంబంధం? అలాగే శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్ద దస్తగిరి తండ్రిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, ఎన్నికల్లో దస్త­గిరి పోటీ చేయకూడదని బెదిరించారన్నది ఆరోపణ. ఈ కేసుకూ అవినాశ్‌కు సంబంధం ఏమిటో కూడా ఆధారం లేదు.

విచిత్రమే­మి­టంటే.. తనపై దాడి జరిగిందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయలేదు. కుమారుడు దస్తగిరి ఒకరోజు తర్వాత చేశారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లోనూ అవినాశ్‌ ప్రస్తావన లేదు. రోడ్డు ప్రమాదం కారణంగా దస్తగిరి తండ్రికి, యువకులకు మధ్య వివాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అవినాశ్‌ ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతున్నారు. ఇది సమర్థనీయం కాదు. దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement