ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల సౌకర్యం కరువు
నగరంలోని బోధనాసుపత్రిలో సైతం ఐసీయూ లేని వైనం
అందుబాటులో ట్రామాకేర్ సెంటర్ ఒక్కటే
ఇదీ సర్కారీ ప్రజావైద్యం తీరు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అనేది ఉత్త మాటగా మారింది. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని గాలి కబుర్లు చెబుతున్న పాలకుల మాటలు నీటి మూటలుగా మారుతున్నాయి. జిల్లాలో ఎక్కడ నుంచైనా పేషెంట్లను వెంటిలేటర్ కోసం నెల్లూరు నగరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రికి తరలించాల్సి వస్తోంది.
నెల్లూరు(అర్బన్): రోడ్డు ప్రమాదాలు, పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం తదితర కేసుల్లో శ్వాస తీసుకోలేక పేషంట్లు ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు అత్యవసర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందడం లేదనే విమర్శలున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషంట్లకు వైద్యం చేయాలంటే మొదట కృత్రిమ శ్వాసనందించే వెంటిలేటర్లు తప్పనిసరి. కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిల్లో కనీసం ఒక్క చోట కూడా వెంటిలేటర్ సౌకర్యం లే దు. వెంటిలేటర్ అవసరమైన రోగులను నెల్లూరు నగరంలోని ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రి (పెద్దాసుపత్రి)కి జిల్లా నలు మూలల నుంచి తరలించాల్సి వస్తోంది. అలాకాకుంటే అప్పో సప్పో చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలి. లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవాలి. పెద్దాసుపత్రిలో సైతం రోగులకు తగినన్ని వెంటిలేటర్లు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
జిల్లాలో 74 పీహెచ్‌సీలు
జిల్లాలో 74 పీహెచ్‌సీలు, మూడు ఏరియా ఆసుపత్రులు, 15 సీహెచ్‌సీలు, 24 గంటలు పని చేసే ఆసుపత్రులు 28 ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రి ఉంది.
వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ లేని బోధనాసుపత్రి
నెల్లూరు నగరంలోని బోధనాసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించి రోజుకు సరాసరి 800 నుంచి 1000 వరకు ఔట్ పేషంట్లు వస్తున్నారు. ఇన్ పేషంట్లు సుమారు 100 వరకు ఉంటున్నారు. వీరిలో వెంటిలేటర్ వైద్యం కోసం 10 నుంచి 12 మంది వరకు వస్తున్నారు. ఆసుపత్రిలో వాస్తవానికి ఐసీయూనే లేదు. హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు రోగుల ప్రాణాలు కాపాడేందుకు 2007లో కేంద్రప్రభుత్వం ట్రామా కేర్ ఏర్పాటు చేసింది. నిర్వహణ బాధ్యతలు పెద్దాసుపత్రికి అప్పగించారు. ట్రామా కేర్‌కి చెందిన ఐసీయూనే పెద్దాసుపత్రి వారు తమ ఐసీయూగా చెప్పుకుంటున్నారు. మెడికల్ కళాశాలకు ఎంసీఐ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు ట్రామాకేర్ ఐసీయూనే చూపించి బోధనాసుపత్రి ఐసీయూగా చెప్పుకున్నారు. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ లేని బోధనాసుపత్రి రాష్ట్రంలో నెల్లూరులో మాత్రమే ఉంది. వాస్తవాన్ని పరిశీలిస్తే ట్రామాతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పెద్దాసుపత్రికి ఉండాలి.
ట్రామాకేర్‌లో ఉక్కపోత..
ట్రామాకేర్ సెంటర్లో ఆరు బెడ్స్ మాత్రమే ఉన్నాయి. అధికారులు మాత్రం 23 బెడ్లతో కూడిన ఐసీయూ ఉందని చెబుతున్నారు. ఏడు వెంటిలేటర్లున్నాయి. వీటిలో కేవలం మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావి మరమ్మతుల్లో ఉన్నాయి. ట్రామాకేర్‌లో రెండు ఏసీలున్నాయి. వీటిలో ఒకటి చాలా కాలంగా మరమ్మతులకు గురై ఉంటే ఇటీవల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు రిపేరు చేయించారు. అయినా చ ల్లటి గాలే రావడం లేదు. ఉక్కపోతతో రోగులు అల్లాడుతున్నారు. ఇదిలా ఉంటే బయట ఆసుపత్రుల నుంచి వచ్చే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు పూర్తి స్థాయిలో వెంటిలేటర్లు లేక కొంతమందిని ట్రామా వార్డులోనే ఉంచుతున్నారు. ప్రతి రోజూ రోగులు ఒకరో, ఇద్దరో మరణిస్తూనే ఉన్నారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకు ఒక బెడ్డుకు ఒక నర్సు ఉండాలి. కాని ట్రామా కేర్ ఐసీయూ మొత్తానికి ఒకే నర్సు ఉంటున్నారు. ఉన్న క్యాజువాల్టీలో (అత్యవసర వార్డు) సైతం కనీస సదుపాయాలు లేవు. ఆక్సిజన్, వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్‌లు ఉండాల్సి ఉంటే అలాంటివేమి లేకుండానే క్యాజువాల్టినీ నిర్వహిస్తున్నారు.
ప్రజారోగ్యంపై విమర్శల వెల్లువ
పేదలందరికీ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తామంటూ ప్రచారం చేసి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లను, తగిన సిబ్బందిని నియమించకుండా రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.
అవన్నీ గాలి కబుర్లే
Published Mon, Apr 18 2016 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM
Advertisement
Advertisement