= కమిషనర్ తీరుకు నిరసనగా ఉద్యోగుల మూకుమ్మడి సెలవు
= అన్ని రకాల ప్రజా సేవలు బంద్
= విజయలక్ష్మి తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఒంగోలు నగర కమిషనర్ విజయలక్ష్మి తీరుపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో నగర పాలన స్తంభించింది. గతంలో రెండు నెలల పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రజా సేవలు బంద్‌కాగా ఇప్పుడు ఉద్యోగుల ఆధిపత్య పోరుతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నిత్యం వివిధ పనులపై కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వయంగా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్న కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం గమనార్హం.
రచ్చకెక్కిన విభేదాలు
కమిషనర్ విజయలక్ష్మి, ఉద్యోగుల మధ్య కొంతకాలంగా అంతర్గతపోరు సాగుతోంది. చివరకు ఉద్యోగులు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో విషయం రచ్చకెక్కింది. కమిషనర్ తీరు నిరసిస్తూ ఉద్యోగులంతా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. బుధవారం మూకుమ్మడి సెలవులు పెట్టి విధులకు గైర్హాజరయ్యారు. అందరి సంతకాలతో కూడిన సెలవు చీటీని కమిషనర్‌కు అందించి ఒకరోజు సెలవు పెడుతున్నట్లు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా అందరూ ఒకేసారి ఎలా సెలవు పెడతారని ఉద్యోగులను కమిషనర్ ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆమె హెచ్చరించారు. ఉద్యోగుల మూకుమ్మడి సెలవుతో కార్యాలయంలోని అన్ని విభాగాల్లో సేవలు నిలిచిపోయాయి. కమిషనర్ మాత్రమే విధులు నిర్వహించారు. ఉద్యోగుల్లేకపోవడంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వివిధ పనులపై వచ్చిన ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. కమిషనర్ వ్యవహార శైలిపై కార్పొరేషన్ ఉద్యోగులంతా కలెక్టర్ విజయ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె వేధింపులు భరించలేకపోతున్నామని వినతి పత్రం అందించారు.
ఎక్కడి ఫైళ్లు అక్కడే
కార్పొరేషన్ కార్యాలయంలో అంతర్గతపోరుతో అన్ని విభాగాల్లోనూ ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదు. దీంతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కుంటుపడిపోతుండగా కాంట్రాక్టర్లకు చె ల్లించాల్సిన బిల్లులు నిలిచిపోయాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరుకాక ప్రజలు కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇక నిత్యం ఎదురయ్యే పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. చెప్పినా పరిష్కరిస్తారనే నమ్మకం ప్రజల్లో లేకుండా పోయింది. దీనికంతటికీ కారణం కమిషనర్ వ్యవహార శైలి అని ఉద్యోగులు ఆరోపిస్తుంటే, ఉద్యోగులే సక్రమంగా పనిచేయడం లేదని కమిషనర్ మండిపడుతున్నారు. కమిషనర్ వ్యవహారం పూర్తిగా తమను అవమానపరిచే విధంగా ఉందంటూ ఉద్యోగులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఒక్క ఫైల్‌ను కూడా ఉద్యోగులు సక్రమంగా రూపొందించడం లేదని కమిషనర్ చెబుతున్నారు. సక్రమంగా పనిచేయమనడం తప్పా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వీరి అంతర్గతపోరుతో చివరికి ఇబ్బంది పడుతోంది సామాన్యులే. చాలాకాలం నుంచి కార్యాలయంలో జరుగుతున్న అంతర్గతపోరును ప్రత్యేకాధికారిగా కలెక్టర్ విజయ్‌కుమార్‌తో పాటు మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.
చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్లు
కమిషనర్, ఉద్యోగుల మధ్య వివాదానికి కాంట్రాక్టర్లే కారణమన్న ప్రచారం కూడా జరుగుతోంది. పనులకు సంబంధించి బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండటం, ఆ ఫైళ్లపై కమిషనర్ సంతకాలు చేయకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఉద్యోగులను నడిపిస్తున్నారనే విమర్శలు కాంట్రాక్టర్లపై వ్యక్తమవుతున్నాయి. దాదాపు కోటి రూపాయల వరకు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు.
కార్పొరేషన్ వివాదంపై ఆర్ డీ విచారణ
నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మికి, ఉద్యోగులకు మధ్య సాగుతున్న వివాదంపై మున్సిపల్ ఆర్‌డీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న వివాదంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం సాయంత్రం కార్యాలయానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ బుధవారం ఉద్యోగులంతా మూకుమ్మడి సెలవు పెడుతున్నారనే సమాచారం అందిందని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ అధికారిగా పంపారని చెప్పారు.
ఈ వివాదంపై అటు ఉద్యోగులతో, ఇటు కమిషనర్‌తో ఇద్దరితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానన్నారు. కమిషనర్, ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయన్నారు. కార్యాలయంలో అంతర్యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వీటన్నింటిపై పూర్తి సమాచారం సేకరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా పారిశుధ్య విభాగానికి చెందిన ఉద్యోగులను ఆయన ప్రశ్నించారు. కమిషనర్‌తో ఏమైనా ఇబ్బందులుంటే లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కోరారు. అయితే సదరు ఉద్యోగులు మాత్రం కమిషనర్‌తో తమకు ఎటువంటి ఇబ్బందీ లేదని, కేవలం అసోసియేషన్‌పరంగా సమావేశం నిర్వహిస్తున్నామంటేనే మంగళవారం సమావేశానికి వచ్చామని సమాధానమిచ్చారు. అయితే బుధవారం ఉద్యోగుల మూకుమ్మడి సెలవులో వీరూ విధులకు గైర్హాజరవడం గమనార్హం. మొత్తం ఎంతమంది సెలవు పెట్టారనే విషయాన్ని పరిశీలిస్తామని ఆర్‌డీ శ్రీనివాస్ తెలిపారు. కార్యాలయ విభేదాలపై ఇరుపక్షాలతో మాట్లాడి పూర్తి నివేదికను ఉన్నతాధికారులు అందజేస్తానని వివరించారు. అనంతరం ఆయన ఉద్యోగులు, కమిషనర్ విజయలక్ష్మితో చర్చలు జరిపారు.
కార్పొరేషన్‌లో కిరికిరి
Published Thu, Nov 7 2013 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement