సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్రం మరికొన్ని కొత్త పనులను ఈ జాబితాలో చేర్చింది. జాతీయ ఆహార భద్రత కోసం దేశ వ్యాప్తంగా ఆధునాతన గోడౌన్ల నిర్మాణం భారీగా చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తించిన కేంద్రం అందుకు అనుగుణంగా జాతీయ ఉపాధి హామీ నిధులను దీనికి వినియోగించుకోవడానికి అనుమతినిచ్చింది. ప్రతీ మెట్రిక్ టన్నుకు మూడు వేల రూపాయలు ఉపాధి హామీ పథకం నిధులు వినియోగించుకోవచ్చని కేంద్రం సూచించింది. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని రాష్ట్రప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆయా రాష్ట్రాల్లో గోడౌన్ల నిర్మాణ వ్యయానికి అంచనాలు రూపొందించి పంపాలని, జాతీయ గిడ్డంగుల నిర్మాణ సంస్థను సంప్రతించి ఏ మేరకు నిధులు వినియోగించుకోవాలో వెల్లడిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ఉపాధి కోసం కూలీలు డిమాండ్ చేసే కార్యక్రమంగా దీనిని రూపొందించడానికి వీలుగా ఇటుకల తయారీని కూడా ఈ జాబితాలో చేర్చుతున్నట్టు కేంద్రం పేర్కొంది.
ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులతో ప్రజలకు కలిగే ప్రయోజనాన్ని ముందుగా అంచనా వేయాలని, ఆ మేరకు నివేదికలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని సూచించింది.ప్రజోపయోగం లేని పనులు చేపట్టరాదని, పనుల్లో నాణ్యత పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే, పధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద చేపట్టే రహదారుల్లో నాణ్యత పెంచడానికి వీలుగా ఉపాధి హామీ పథకం నిధులు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. పీఎంజీ ఎస్‌వై కింద చేపట్టే పనులకు కాంట్రాక్టర్ల ఐదేళ్ల నిర్వహణ కాలం పూర్తయిన తరువాత ఆ రహదారుల నిర్వహణను ఉపాధి నిధులతో చేపట్టవచ్చని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.
చెల్లింపులో జాప్యం జరిగితే పరిహారం...
వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరిగితే సదరు కూలీకి నష్టపరిహారం చెల్లించాలనేది చట్టంలో తప్పనిసరి చేసిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని పేర్కొంది. వేతనం ఎన్ని రోజులు ఆలస్యం అయితే ఎంత నష్టపరిహారం చెల్లించాలన్న అంశాన్ని కంప్యూటర్లు లెక్కిస్తాయని అందువల్ల.. దీనిని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.