'ఈ' పక్షి 'ముం'చేసింది | Emu farming fails to take wings in WG | Sakshi
Sakshi News home page

'ఈ' పక్షి 'ముం'చేసింది

Published Sat, May 12 2018 1:24 PM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

Emu farming fails to take wings in WG - Sakshi

జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పెంచిన ఈము పక్షులు (ఫైల్‌)

నిడదవోలు: 2006లో కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో ఈము పక్షుల పెంపకానికి సుమారు 400 మంది రైతులకు రుణాలు అందజేసింది. వంద పక్షులకు ఒక యూనిట్‌ చొప్పున ఒక్కొక్క యూనిట్‌కు రూ.30 లక్షల బాంకు నుంచి రుణంగా అందజేసింది. రుణాలతో పాటు రైతులు సొంత పెట్టుబడులతో పొలా లను లీజుకు తీసుకుని పక్షుల పెంపకాన్ని మొదలుపెట్టారు. ప్రారంభంలో వీటి మార్కెటింగ్‌ బాగానే ఉన్నా రాను రాను సరైన మార్కెటింగ్‌ లేదు. దేశ విదేశాల్లో ఈము పచ్చిమాంసాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెంపకందారులు తీవ్రంగా నష్టపోయారు.

రైతును దగా చేసిన ప్రభుత్వం
రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 27 లక్షలురుణమిస్తామంటూ ప్రభుత్వం రైతులను నమ్మించింది. నాబార్డు ద్వారా రూ.15 లక్షలు వడ్డీ లేని రుణం, రూ.12 లక్షలు బ్యాంక్‌ ద్వారా వడ్డీకి రుణం ఇచ్చారు. ఈ పెట్టుబడితో ఒక్కో రైతు యూనిట్‌కు 100 ఈము పక్షుల ఫామ్‌ ఏర్పాటు చేసుకుని పెంపకం చేశారు. పెంపకందారు నుండి తామే పక్షులను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నమ్మబలకడంతో అప్పట్లో వందలాది మంది రైతులు ఈ పక్షుల పెంపకానికి మొగ్గు చూపారు. అయితే ప్రభుత్వం మార్కెటింగ్‌ కల్పించకపోవడంతో పక్షులను కొనుగోలు చేసేవారు లేక రైతులు నిండా మునిగిపోయారు.

ప్రోసెసింగ్‌ కేంద్రమే లేదు
ఒక ఈము పక్షిని పెంచిన తరువాత 40 నుంచి 50 కేజీల వరకు మాంసం వస్తుంది. ఒక్కో ఈము పక్షి నుండి 8 లీటర్ల ఈము నూనె లభిస్తుంది. దీనిని లీటరు రూ.7 వేలు చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నాబార్డు ద్వారా ప్రచారం చేసింది. కేజీ మాంసం రూ. 700 లు, చర్మం రూ.4 వేల లెక్కన ఒక్కో పక్షికి సుమారు రూ.60 వేలు వరకు చెల్లించి ప్రోసెసింగ్‌ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ఊదరగొట్టింది. దీని నిమిత్తం అప్పట్లో ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో రైతులకు శిక్షణ నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈము పక్షి నుంచి మాంసం, నూనె, చర్మాలను వేరుచేసే ప్రోసెసింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో రైతుల వద్ద పక్షులను కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు.

పక్షులకు రోగం వస్తే అంతే సంగతులు
ఈము పక్షులకు రోగం వస్తే సరైన చికిత్స అందించలేకపోవడం దీని వైఫల్యానికి గల కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. పశువైద్యశాఖ వద్ద ఈము పక్షికి సంబంధించిన వ్యాక్సిన్లు లేవు. వర్షాకాలం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వీటికి వచ్చే వ్యాధులను నయం చేసేందుకు మందులు లేకపోవడంతోపాటు వైద్యమే అందలేదని రైతులు వాపోతున్నారు. జబ్బుపడిన కొన్ని పక్షులు మృత్యువాతపడి చనిపోయాయి. పక్షికి రోజుకి రూ.30 తిండి ఖర్చు అవుతుంది. 100 పక్షులను పెంచే రైతుకు రోజు రూ.3 వేల వరకు పెట్టుబడి కావాలి. దీనితో పెంపకందారులు బెంబేలెత్తిపోయారు. భారీ పెట్టుబడులు పెట్టి 200 నుండి 300 పక్షుల వరకు పెంచే రైతుల్లో కొందరు వాటిని పూర్తిగా వదిలించుకున్నారు.

తడిసి మోపెడు
ఈము పక్షి ఫామ్‌ ఏర్పాటుకు ముందుగా రైతు తన వాటాకింద సొంత డబ్బులు రూ.3 లక్షలు డిపాజిట్‌ చేయాలి. నాబార్డు ద్వారా రూ.15 లక్షలు వడ్డీలేని రుణం, రూ.12 లక్షలు బ్యాంకుల ద్వారా వడ్డీతో కూడిన రుణం అందించగా మొత్తం 30 లక్షలతో ఈము పక్షుల ఫామ్‌ను ఏర్పాటుచేశారు. ఈ ఫామ్‌లో మొత్తం 100 పక్షులు పెంపకానికి రైతులు రంగం సిద్ధం చేసుకున్నారు. భూమి లేని రైతు ఎకరం పొలం లీజుకు తీసుకుని చుట్టూ కంచె, పక్షుల గుడారాలు, విద్యుత్‌ సదుపాయం, మంచినీటి సదుపాయంతోపాటు నలుగురు కూలీలను నియమించుకున్నారు. వీటికి ఖర్చు సుమారు రూ.6లక్షలు అవుతుంది. 100 పక్షుల కొనుగోలుకు రూ.3.50 లక్షలు, కూలీలు, పక్షుల ఆహారానికి సుమారు నెలకు రూ.లక్ష చొప్పున ఖర్చవుతుంది. ఇలా అన్ని పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోయారు. దీనితో పెట్టుబడులు రాక, నాబార్డు ఇచ్చిన రుణాలు చెల్లించలేక రైతులు కుదేలయ్యారు. కొంతమంది అయినకాడికి భూములు అమ్మి అప్పులు చెల్లించారు. మరి కొంతమంది మనోవేదనతో మంచం పట్టారు. కొంతమంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి.

జిల్లాలోనే అధికం
రాష్ట్రంలో ఈము పక్షుల పెంపకంలో అప్పట్లో పశ్చిమగోదావరి జిల్లా ముం దంజలో ఉండేది. జిల్లాలో సుమారు 20 వేల పక్షులను పెంచారు. మొదట్లో ప్రభుత్వం ప్రోత్సాహం బాగుండటంతో జిల్లాలోని రైతులు వీటి పెంపకంపై ఆసక్తి చూపించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, చింతలపూడి, ప్రగడవరం, నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, జంగారెడ్డిగూడెం, చాగల్లు తదితర ప్రాంతాలలో సుమారు వంద మంది రైతులు ఈము ఫామ్‌లు నిర్వహించారు. నష్టాలు భరించలేక కొద్దికాలంలోనే అవన్నీ పూర్తిగా మూసివేశారు.

నాబార్డు సబ్సిడీ7.50 లక్షలు ఎగనామం
ఈము పక్షుల పెంపకంతో తీవ్రంగా నష్టపోయినందు వల్ల తీసుకున్న బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గతంలో రైతులు ఆందోళన చేశారు. ఈము పక్షుల పెంపకందారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతులు ధర్నాలు చేశారు. ఈము పక్షుల పెంపకం ద్వారా అధిక లాభాలు వస్తాయని ప్రభుత్వం ప్రోత్సహించడం వల్లే ఫామ్‌లను పెట్టామని రైతులు వాపోయారు. రైతులకు ప్రభుత్వం సరైన మార్కెట్‌ కల్పించకపోవడంతో నష్టపోయామన్నారు. నాబార్డు ద్వారా రైతులకు ఇవ్వాల్సిన 7.50 లక్షల సబ్సిడీ రుణాల్ని ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈము ఆయిల్‌కు మంచి గిరాకీ
ఈము మాంసంతోపాటు ఈము ఆయిల్‌కు అరబ్‌ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. పక్షి కొవ్వు నుంచి ఈము ఆయిల్‌ను తీస్తారు. విదేశాల్లో వివిధ ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. అమెరికాలో మంచి మార్కెట్‌ ఉన్నా ఆ దిశగా అధికారులు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుమతులు తీసుకోకపోవడంతో రైతులు నష్టపోయారు. 2014లో కృష్ణా జిల్లా నూజివీడులో ఓ ప్రయివేటు సంస్థ ఈము పక్షుల ప్రోసెసింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే అది మూడు మాసాలకే మూతపడటంతో పక్షలకు మార్కెటింగ్‌ లేక రైతులు తీవ్రంగానష్టపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement