* పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అనుమతి నిరాకరణ
* శ్రీవారిమెట్టు వద్దనే అడ్డుకున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/చంద్రగిరి: శేషాచలం అడవుల్లో ఎర్రకూలీలు చనిపోయిన స్థలానికి తమను అనుమతించకపోవడంపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటలపాటు నిరీక్షింపజేసి చివరకు అనుమతించక పోవడంపై ఈ నెల 23న హైదరాబాద్‌లో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(ఎన్‌హెచ్‌ఆర్‌ఓ)కు ఫిర్యాదు చేయనున్నామని పీపుల్స్‌వాచ్ కమిటీ(పీడబ్ల్యూసీ) ఆర్గనైజర్ హెన్రీ డిఫెన్ తెలిపారు.
శేషాచల అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ ఘటనపై నిజానిజాలు తెలుసుకోవడానికి పీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ముంబై హైకోర్టు రిటైర్డ్ జడ్జి సురేష్, ఎన్‌హెచ్‌ఆర్‌వో ఆర్గనైజింగ్ మెంబర్ ఛత్రపాల్, రిటైర్డ్ డీజీపీ రామ్మోహన్, పాకిస్తాన్‌లోని భారత మాజీ రాయబారి సత్యప్రతాప్, ఫోరెన్సిక్ నిపుణులు సేవియార్, ప్రముఖ న్యాయవాది అజిత, తమిళనాడు ముస్లిం మునేట్ర కలగమ్ పార్టీ అధ్యక్షుడు, రామనాథపురం ఎమ్మెల్యే జవహరుల్లాతో కూడిన బృందం మంగళవారం శ్రీవారిమెట్టుకు చేరుకుంది. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.అనంతరం డిఫెన్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఆర్‌వో అనుమతితోనే ఇక్కడికొచ్చామని, నిజానిజాలు తెలుసుకునేందుకు వస్తే అటవీ శాఖాధికారులు అనుమతించలేదని తెలిపారు. దీనిపై ఎన్‌హెచ్‌ఆర్‌వోకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఏం జరిగిందో తెలుసుకోవడానికే వచ్చాం
40 సంవత్సరాలకుపైగా భారతదేశానికి ఎనలేని సేవలు చేశాం. రిటైర్డ్ సీనియర్ జడ్జి అని చూడకుండా 2 గంటలపాటు నిరీక్షణకు గురిచేశారు. ఇక్కడ జరిగిందేమిటో తెలుసుకోవడానికే వచ్చాం. అధికారులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీనిపై ఎన్‌హెచ్‌ఆర్‌వోకు ఫిర్యాదు చేస్తాం.
-సురేష్, ముంబై హైకోర్టు రిటైర్డ్ జడ్జి
భిన్నవాదనలు వినిపిస్తున్నాయి
శేషాచలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై పోలీసు అధికారులు ఒకవిధంగా, మీడియా ప్రతినిధులు మరోవిధంగా పొంతన లేకుండా వార్తలు వస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకునేందుకు ఇక్కడికొస్తే అధికారులు అనుమతించలేదు. - రామ్మోహన్, రిటైర్డ్ డీజీపీ
ఎన్‌కౌంటర్ స్థలానికి వెళ్లడానికి వీల్లేదు
Published Wed, Apr 15 2015 3:15 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement