జూనియర్ అసిస్టెంట్ బిందుబాయ్
► అర్చక నిధి నిధులు మంజూరు కోసం లంచం డిమాండ్
► జూనియర్ అసిస్టెంటు బిందుబాయ్, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు అరెస్ట్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): దేవాదాయ, ధర్మాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. మృతి చెందిన పూజారి కుటుంబ సభ్యులకు అర్చక నిధి నిధులు మంజూరు కోసం లంచం డిమాండ్ చేయగా ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలోని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డోన్ మండలం కొత్తకోట చెన్న కేశవస్వామి ఆలయ పూజారి శేషయ్య ఏడాది క్రితం మృతి చెందారు. ఆయన కుటుంబానికి అర్చక నిధి నుంచి రూ. 2.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో శేషయ్య భార్య పద్మావతి అర్చక నిధి కోసం దేవాదాయశాఖాధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఏ.బిందుబాయ్ అర్చక నిధి ఇన్‌చార్జ్‌గా, బీ.వెంకటేశ్వర్లు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. బాధిత మహిళ దరఖాస్తులో పొందుపరచిన అంశాలను ఇన్‌స్పెక్టర్ బి.వెంకట్శేర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్చక నిధి ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏ.బిందుబాయ్‌కు పంపాలి.
బిందుబాయ్ రూ. ఐదు వేలు, ఇన్‌స్పెక్టర్ రూ. రెండు వేలు లంచం అడగడంతో పద్మావతి ఏసీబీని ఆశ్రయించింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు చెప్పినట్లు పద్మావతి అల్లుడు రాధాకృష్ణమూర్తి, అతని అన్న పూజారి వెంకటరమణతో కలసి అధికారులకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలోని బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారి వద్ద నుంచి రూ.5 వేలు, 2 వేలు స్వాధీనం చేసుకొని జడ్జి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు.
ఇన్‌స్పెక్టర్ బి.వెంకట్శేర్లు