అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : డ్రిప్ యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారు మట్టి, నీటి నమూనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జతచేయాలన్న ప్రభుత్వ నిబంధనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండున్నర నెలలుగా అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లో ఉన్న భూసార పరీక్ష కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సహన పరీక్ష ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 9 వేల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులు, రైతుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. రేకులకుంట్ల, రెడ్డిపల్లి పరిశోధన కేంద్రాల్లో మట్టి పరీక్షల ప్రయోగశాలలు ఉన్నా అక్కడి వెళ్లేందుకు రైతులు వెనుకాడుతున్నారు. అనంతలో తరచూ గొడవలు జరుగుతుండడంతో కొన్ని రోజుల పాటు రైతు బజార్‌కు మార్చినా ఫలితం లేకపోయింది. దీంతో తిరిగి భూసార పరీక్ష కేంద్రం వద్దే నమూనాలు తీసుకుని, ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు. ఈ కేంద్రంలో నీరు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు టెక్నికల్ స్టాఫ్, సిబ్బంది పరిమిత సంఖ్యలో ఉండడంతో రోజుకు 50 మట్టి, 50 నీటి నమూనాలు మాత్రమే చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఈ సమస్య కలెక్టర్ దృష్టికి వెళ్లాక మధ్యలో వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన సంచార భూసార పరీక్ష కేంద్రం వాహనాన్ని తెప్పించి కొన్ని పరీక్షలు చేశారు. అయినా ఫలితం కనబడటం లేదు. ఏపీఎంఐపీ తరఫున అదనపు సిబ్బందిని సమకూర్చడంతో పాటు సహకారం అందిస్తామని చెప్పినా ఆచరణకు రాలేదు. ఈ క్రమంలో డ్రిప్ పుణ్యకాలం దాటిపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయాన్నే పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి చేరుకున్నారు. దరఖాస్తులు పూరించి, మట్టి, నీటి నమూనాలు ఇచ్చి రసీదులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే నాలుగైదు సార్లు వచ్చామని, అయితే ధ్రువీకరణ పత్రాలు అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సహన పరీక్ష
Published Wed, Jan 8 2014 3:51 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement