సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హైదరాబాద్‌లోని నిజాం కళాశాల హాస్టల్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన దౌర్జన్యంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. సభ నేపథ్యంలో ఎల్‌బీ స్టేడియానికి దగ్గరలో ఉన్న నిజాం కళాశాల హాస్టల్ నుంచి విద్యార్థులను అక్కడి నుంచి ముందుగానే పంపించి ఉండాల్సిందన్నారు. అలా చేయకుండా వారిపై దౌర్జన్యం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో సభ నిర్వహించుకోవడానికి ఏపీఎన్‌జీవోలకు అనుమతి ఇచ్చి, తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి నిరాకరిం చడం కంటే ఇరు ప్రాం తాల ప్రతినిధులను పిలిపించి, వేర్వేరుగా అనుమతులు ఇస్తే ఇంతా రాద్ధాంతం జరిగి ఉండేది కాదన్నారు. ఏపీఎన్‌జీవోల సభలో కొందరు బయటి వారు రాజకీయాలు మాట్లాడి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. సభలో ఒక కానిస్టేబుల్ ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తే, శభాష్ అని చెప్పి పక్కకు పంపించాల్సింది పోయిసహచరులు చితకబాదడం శోచనీయమన్నారు. ఇక్కడి ప్రజలు సంయమనం పాటించి తెలంగాణ సంస్కృతిని చాటారన్నారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయకుండా హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ చేపడతామని చెప్పడం సమంజసం కాదని హితవుపలికారు.