గిట్టుబాటు ధర అందేనా ! | Ensure remunerative price! | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర అందేనా !

Published Mon, Feb 17 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

Ensure remunerative price!

 ఉదయగిరి, న్యూస్‌లైన్ : ఈ ఏడాదైనా తమకు గిట్టుబాటు ధర అందేనా అని పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.  ఈ ఏడాది రైతులు అనేక ఒడిదుడుకుల మధ్య పొగాకు సాగు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది సాగు, కూలీల ఖర్చులు పెరగడంతో అనుకున్నదాని కంటే పెట్టుబడులు ఎక్కువయ్యాయి. దిగుబడి ఆశించిన మేర రాలేదు. దీంతో కొనుగోలుదారులు ఇచ్చే ధరపైనే రైతన్నలు ఆశపెట్టుకున్నారు. బయ్యర్ల దయా దాక్షిణ్యాలపైనే ఈ ఏడాది పొగాకు రైతుల జీవితాలు ముడిపడివున్నాయి.
 
 రాష్ర్టంలో ఈ ఏడాది 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి పొగాకు బోర్డు లక్ష్యంగా  నిర్ణయించింది. రాష్ట్రంలో 1,22,695 హెక్టార్లలో ఈ ఏడాది పొగాకు సాగయింది. పొగాకును ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో సాగు చేస్తారు. ప్రకాశం, నెలూరు జిల్లాల్లోని పొదిలి, కొండేపి, కందుకూరు, యల్లంపల్లి, ఒంగోలు, డీసీ పల్లి, కలిగిరి  వేలం కేంద్రాల పరిధిలో 7,379 హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. పశ్చిమగోదావరి  జిల్లా దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యల గూడెం, గోపాలపురం, ఖమ్మం జిల్లాలోని తొర్రేడు ప్రాంతంలో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేశారు.
 
 పెరిగిన ఖర్చులు
 సాధారణంగా 7.5 ఎకరాల విస్తీర్ణంలో పొగాకు ఒక బ్యారన్‌కు అనుమతిస్తారు. ఒక్కో బ్యారన్‌కు కనీసం రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చువుతుంది. ఎకరాకు ఐదు క్వింటాళ్ల మేర దిగుబడి రావాలి. అయితే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 3-4 క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తోంది. ఈ ఏడాది కూలీల కొరత అధికంగా ఉండటంతో ఒక బ్యారన్‌కు కేవలం కూలీలకే లక్ష రూపాయలు ఇస్తున్నారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులతో సుదూర ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీటిని తరలించి పంటను తడిపారు. దీంతో ఈ ఏడాది అదనంగా ఈ ఖర్చు కూడా పెరిగింది. సాధారణంగా ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చవుతుండగా, ఆ ఖర్చు ఈ ఏడాది రూ.50 వేల వరకు ఎగబాకింది.
 
 గిట్టుబాటు ధర కోసం ఎదురుచూపు
 ఈ ఏడాది కర్ణాటకలో క్వింటాల్ పొగాకును రూ.18 వేల వరకు గరిష్టంగా కొనుగోలు జరిగింది. దీంతో అక్కడి పొగాకు రైతులు కొంతమేర లాభం పొందగలిగారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుంటే గతేడాది మన రాష్ట్రంలో క్వింటాల్‌కు సగటున రూ.10,200 అమ్మకం జరిగింది. గరిష్టంగా రూ.14,200 కాగా, కనిష్టంగా రూ.1000 పలికింది. ఈ ఏడా ది రూ.12 వేలు వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. దిగుబడి సగటున మూడు క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 
 ఈ లెక్కన చూస్తే రైతులకు నష్టాలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా వేలంలో 24 కంపెనీలు పాల్గొననున్నాయి. వీటిలో ఐటీసీ, జీపీఐ, అలయన్స్, పోలుశెట్టి, ఎంఎల్ కంపెనీలు కొనుగోలు చేయనున్నాయి. అయితే మొత్తం వ్యాపారంలో 50-60 శాతం పైగా ఒక్క ఐటీసీ కంపెనీ మాత్రమే కొనుగోలు చేయనుంది. అంటే ధరను ఈ కంపెనీ మాత్రమే నియంత్రించే పరిస్థితి ఉంది. మిగతా కంపెనీలన్నీ చిన్నా చితకవి కావడంతో ఐటీసీ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించే పరిస్థితి కనిపించడం లేదు.
 
 కొనుగోలు కేంద్రాలు ఇవే
 ప్రకాశం జిల్లాలో పొదిలి, కొండేపి, కందుకూరు, యల్లంపల్లి, ఒంగోలు, టంగుటూరు, నెల్లూరు జిల్లాలో కలిగిరి, డీసీ పల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలో దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం, ఖమ్మం జిల్లాలో తొర్రేడు ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు ఈ నెల 17 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా, మరికొన్ని కేంద్రాల్లో మార్చి చివరలో ప్రారంభం కానున్నాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement