ఉద్యోగులు.. అధికారులు తరతమ బేధం లేకుండా ఉల్లాసంగా.. ఉత్సాహంగా వివిధ క్రీడా పోటీలలో పాల్గొంటున్నారు. గెలిచిన జట్ల సభ్యులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. వీరికి ఓడిన జట్టు సభ్యులు క్రీడాస్ఫూర్తితో అభినందనలు తెలుపుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్న పోటీలలో ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఉద్యోగుల క్రీడోత్సవాలు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. ఈ క్రీడాపోటీలను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పరిశీలించారు. అన్ని క్రీడాంశాల వద్దకు వెళ్లి ఉద్యోగులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులు కలిసిమెలిసి ఆడుతుంటే ఆత్మీయత, అనుబంధం కలబోసినట్లు ఉందన్నారు. అనంతరం ఉద్యోగులతో పాటు భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాజంపేట సబ్‌కలెక్టర్ ప్రీతిమీనా, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ ఎం. రామచంద్రారెడ్డి, డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, రిమ్స్ డెరైక్టర్ సిద్ధప్పగౌర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ ప్రతిభాభారతి, స్టెప్ సీఈఓ మమత తదితరులు ఉన్నారు.
చెడుగుడు ఆడేశారు..
కబడ్డీ.. కబడ్డీ అంటూ ఉద్యోగులు చెడుగుడు ఆడేశారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వీరి ఆటతీరు కొనసాగింది.
మేం.. గెలిచాం..
వాలీబాల్‌లో పాల్గొన్న జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. జిల్లాపరిషత్‌పై డీఈఓ కార్యాలయ సిబ్బంది విజయం సాధించడంతో కేరింతలు కొట్టారు. మేం గెలిచాం.. అంటూ సందడి చేశారు.
పాపం.. క్రీ‘డల్’..
జిల్లా క్రీడాప్రాథికార సంస్థ అంటే క్రీడలకు జిల్లాలో ఆయువుపట్టు లాంటింది. అటువంటి జట్టుపైనే నెగ్గిన సర్వే అండ్ ల్యాండ్స్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఒక్కపాయింటు తేడాతో ఓటమి చెందిన క్రీడాప్రాధికార సంస్థ ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో విజేతలను అభినందించారు.
క్రికెట్.. క్రికెట్..
వైఎస్ రాజారెడ్డి, ఆర్ట్స్ కళాశాల మైదానాల్లో క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జెడ్పీ జట్టు, నీటిపారుదల జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ సాగింది. క్రికెట్ పోటీలను కలెక్టర్, అధికారులు తిలకించారు.
స్కిప్పింగ్ మహరాణులు..
స్కిప్పింగ్ పోటీల్లో మహిళలు ఉల్లాసంగా పాల్గొన్నారు. డీటీసీ కృష్ణవేణి, జిల్లా పంచాయతీ అధికారిణి అపూర్వసుందరి పాల్గొని మహిళా ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు.
పరుగో.. పరుగు..
100 మీటర్లు, 200 మీటర్ల పరుగుపందెంలో రిమ్స్ డెరైక్టర్ సిద్ధప్పగౌరవ్, సీపీఓ తిప్పేస్వామి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి పాల్గొన్నారు. మహిళలు సైతం పరుగు పందెంలో పాల్గొన్నారు.
షటిల్ మాస్టర్.. సబ్ కలెక్టర్..
రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా షటిల్ బ్యాడ్మింటన్ ఉత్సాహంగా ఆడారు. ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌తో కలసి చాలాసేపు ఆడి తోటి ఉద్యోగులను ఉత్సాహపరిచారు.
అన్ని క్రీడల్లోనూ,...
ఎవరైనా ఒక రంగంలో రాణిస్తేనే అబ్బో అంటాం.. అలాంటిది.. వివిధ క్రీడాంశాల్లో ఆడటమే కాక పోరాటపటిమను చూపుతూ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నాడు జిల్లా కలెక్టర్ కోన శశిధర్. షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, క్రికెట్ ఇలా అన్ని క్రీడాంశాల్లో ప్రొఫెషనల్ క్రీడాకారుడు వలే ఆడుతుండటం పట్ల ఉద్యోగులు సైతం స్వతహాగానే క్రీడాకారుడు కనుకనే క్రీడలు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాడంటూ కితాబునిస్తుండటం గమనార్హం.
- న్యూస్‌లైన్, కడప స్పోర్ట్స్
ఉల్లాసంగా..ఉత్సాహంగా
Published Sat, Jan 11 2014 2:21 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement