
దీపావళి సామగ్రి నిల్వ ఉంచిన వ్యాపారి అరెస్టు
గుంటూరు రూరల్:
మిర్చియార్డు సమీపంలోని రెండు గోడౌన్లలో సుమారు రూ.4.88 కోట్ల విలువ చేసే దీపావళి మందుగుండు సామగ్రిని అనధికారికంగా నిల్వ చేసిన వ్యక్తిని రూరల్ ఎస్‌ఐ కృష్ణానందం మంగళవారం అరెస్ట్ చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కన్నావారితోట నాలుగో లైను ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మల్లిశెట్టి సుబ్బారావు దీపావళి మందుగుండు సామగ్రిని ఆదివారం మిర్చియార్డు సమీపంలోని శివరామకృష్ణ గోడౌన్‌లో నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది.
విజిలెన్స్ అధికారుల దాడుల్లో గోడౌన్‌లో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.2 కోట్లు విలువ చేసే దీపావళి సామగ్రిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్‌ఐ కృష్ణానందానికి వచ్చిన సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి సౌత్ జోన్ డీఎస్పీ కె.నరసింహా నేతృత్వంలో మిర్చి యార్డు సమీపంలోని ఓ గోడౌన్‌లో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.2.88 కోట్లు విలువ చేసే దీపావళి సామగ్రిని సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన మల్లిశెట్టి సుబ్బారావును పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణానంతరం మంగళవాకం కేసు నమోదు చేసి సుబ్బారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
రూ.9.4 లక్షల బాణసంచా సీజ్
చెరుకుపల్లి: అనుమతులు లేకుండా గోడౌన్‌లో నిల్వ ఉంచిన రూ. 9.4 లక్షల విలువ చేసే దీపావళి మందుగుండు సామగ్రిని ఎస్‌ఐ పి.కిరణ్ మంగళవారం సీజ్ చేశారు. చెరుకుపల్లిలో దీపావళి మందుగుండు సామాన్ల విక్రయాలకు ఒక షాపునకు లెసైన్సు ఉండగా, అక్కడ విక్రయించకుండా వేరొక గోడౌన్‌లో స్టాకు నిల్వ చేసి విక్రయిస్తుండటంతో మంగళవారం తనిఖీలు నిర్వహించి షాపును సీజ్ చేశారు. షాపులో సుమారు రూ.9.4 లక్షలు విలువ చేసే మందుగుండు సామగ్రి నిల్వలు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో తాతా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.