ఎర్రచందనం ధరలపై అటవీశాఖ అధికారుల లెక్కలకూ పోలీసు అధికారుల గణాంకలకూ పొంతన కుదరడం లేదు. ఏ-గ్రేడ్ ఎర్రచందనం టన్ను ధర రూ.12 లక్షలుగా అటవీశాఖ అధికారులు నిర్ణయించారు.
ఎర్రచందనం ధరలపై అటవీశాఖ అధికారుల లెక్కలకూ పోలీసు అధికారుల గణాంకలకూ పొంతన కుదరడం లేదు. ఏ-గ్రేడ్ ఎర్రచందనం టన్ను ధర రూ.12 లక్షలుగా అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. పోలీసులు మాత్రం నాణ్యతతో నిమిత్తం లేకుండా ఎర్రచందనం టన్ను ధర రూ.35 లక్షలుగా లెక్కకట్టారు. ఆదివారం శ్రీకాళహస్తి సమీపంలో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు టన్నుల ఎర్రచందనం విలువను రూ.70 లక్షలుగా పోలీసులు ప్రకటించడమే అందుకు తార్కాణం. అధికారపార్టీ నేతలకు ఎ ర్ర చం‘ధనాన్ని’ దోచిపెట్టడానికే ప్రభుత్వం తక్కువ ధరలు నిర్ణయించిందనే ఆరోపణలకు ఇది బలం చేకూర్చుతోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలోని గోదాముల్లో నిల్వ చేసిన 8,584.1353 టన్నుల ఎర్రచందనాన్ని అమ్మే బాధ్యతను ఎంఎస్‌టీసీ(మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్)కు ప్రభుత్వం అప్పగించింది. తొలి దశలో 4,159.693 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించేందుకు ఆగస్టు 8న ఈ-టెండర్ నోటిఫికేషన్‌ను ఎంఎస్‌టీసీ జారీచేసింది. ఎర్రచందనాన్ని ఈ-టెండర్ కమ్ వేలం పద్ధతిలో విక్రయించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో ఏ-గ్రేడ్ ఎర్రచందనం టన్ను రూ.12 లక్షలు, బీ-గ్రేడ్ రూ.పది లక్షలు, సీ-గ్రేడ్ రూ.ఎనిమిది లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. అంతర్జాతీయ మార్కెట్లో అంతకు రెట్టింపు స్థాయిలో ధరలు పలుకుతున్న విషయం విదితమే. ఓ కీలక మంత్రి.. మరొక టీడీపీ ఎంపీకీ ఎర్రచం‘దనాన్ని’ దోచిపెట్టడానికే కనిష్ఠ ధరలను ప్రభుత్వం నిర్ణయించిందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. సెప్టెంబర్ 19 నుంచి ఎర్రచందనం విక్రయానికి వేలం నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది.
కానీ.. విదేశీ వ్యాపారులు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వేలం వాయిదా వేసింది. అక్టోబర్ 10 నుంచి ఎర్రచందనాన్ని వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. కానీ.. ఎర్రచందనం విక్రయానికి కేంద్రం ఇచ్చిన అనుమతి గడువు ముగియడం, చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎర్రచందనం టెండర్లపై స్టే విధించడంతో చివరి నిముషంలో వేలం రద్దు చేసింది. ఎర్రచందనం విక్రయానికి మరో ఆర్నెళ్లు గడువు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో అటవీశాఖ గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగల విక్రయానికి 2010లోనే కేంద్రం అనుమతి ఇచ్చింది. అప్పట్లో టెండర్ల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైనప్పుడు నాణ్యతతో నిమిత్తం లేకుండా టన్ను ఎర్రచందనం రూ.12 లక్షల చొప్పున కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన ఓ సంస్థ అప్పటి అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రతిపాదించింది.
అంతలోనే రోశయ్యను సీఎం పీఠం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం దించేసింది. ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టిన కిరణ్ ప్రభుత్వం 2011లో తొలి దశలో 600 టన్నుల ఎర్రచందనం విక్రయానికి టెండర్లు నిర్వహించింది. చైనా సంస్థ ప్రతిపాదించిన ధరతో నిమిత్తం లేకుండా ఎర్రచందనం టెండర్లు నిర్వహించింది. ఏ-గ్రేడ్ టన్ను రూ.ఏడు లక్షలు, బీ-గ్రేడ్ రూ.ఆరు లక్షలు, సీ-గ్రేడ్ రూ.5.3 లక్షలు, వర్గీకరించని ఎర్రచందనం టన్ను రూ.3.6 లక్షలకు కాంట్రాక్టర్లు కోట్ చేశారు.
అవే ధరలను ఖరారు చేసి.. కాంట్రాక్టర్లకు ఎర్రచందనాన్ని అప్పగించారు. ఎర్రచందనం కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు అప్పటి సీఎం కిరణ్‌కు సన్నిహితులేనని కాంగ్రెస్ వర్గాలు అప్పట్లో ఆరోపించాయి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే రీతిలో పయనిస్తోందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. గ్రేడ్‌లతో నిమిత్తం లేకుండా టన్ను ఎర్రచందనం రూ.35 లక్షలుగా లెక్కకట్టిన పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించడమే అందుకు తార్కాణం.