విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఔషధాల ధరలు భారీగా తగ్గాయి. వివిధ రోగాలకు సంబంధించి అత్యవసర ఔషధాల ధరలకు కళ్లెం వేశారు. రోగులకు అత్యవసర మందులను చౌకగా అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గిన మందుల ధరలను నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసెన్స్ (ఎన్‌ఎల్‌ఈఎం) ప్రకటించడం తో ఈ ఆదేశాలను వెంటనే అమల్లో పెట్టాలంటూ ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు వేల్పుల విజయ శేఖర్ అన్ని ఔషధ దుకాణాలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
ఎక్కువ ధరతో ఉన్న పాత స్టాక్‌ను విక్రయించరాదని స్పష్టం చేశారు. కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలని సూచించారు. మెడికల్ దుకాణాలు, పంపిణీ సంస్థల వద్ద ఉన్న పాత స్టాక్‌ను వెంటనే సంబంధిత సంస్థలకు పంపించేయాలని పాత స్టాక్‌ను విక్రయించడం చట్టరీత్యా నేరమని వెల్లడించారు. విశాఖ జిల్లాలో దాదాపు 348 రకాల మందుల ధరలు తగ్గే అవకాశముంది. నగరంలోని ఇప్పటికే కొన్ని ఔషధ దుకాణాలు కొత్త ధరలకే మందులను విక్రయించడం మొదలెట్టారు. నగర శివారు ప్రాంతాల్లోనూ, కొన్ని మారుమూల ప్రాంతాల్లోనూ, వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించే మందుల దుకాణాల్లోనూ కొత్త ధరలు అమలు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వీటిపై నిఘా పెట్టి చర్యలు తీసుకునేందుకు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు.
60 శాతం తగ్గొచ్చు..!
విశాఖ జిల్లాలో 1800 మందుల అమ్మకాల దుకాణాలున్నాయి. వీటికి మందులను సరఫరా చేసేందుకు 300 మంది డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు వున్నారు. ప్రతి నెలా జిల్లా నుంచి రూ. 27 కోట్ల వ్యా పారం జరుగుతోంది. అందులో 68 శాతం విశాఖ మహా నగరం నుంచే జరుగుతుంది.
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారితో బాటు ఛత్తీస్‌గఢ్, ఒఢిశా రాష్ట్రాలకు చెందిన వారు కూడా వైద్యం కోసం విశాఖకే తరలి వస్తుండడంతో మందుల అమ్మకాలకు విశాఖ కేంద్రంగా మారింది. అయితే తాజాగా అమల్లోకి వచ్చిన అత్యవసర మందుల ధరలు 10 నుంచి 60 శాతం వరకూ బ్రాండెడ్ మందుల ధరలు తగ్గాయి. ఈ ప్రభావం వల్ల దుకాణాల ఆదాయం కూడా స్వల్పంగా తగ్గే ఛాన్స్‌లున్నాయని అంచనా వేస్తున్నారు.