పాత స్టాక్‌పైనా జీఎస్టీ
అన్ని వస్తుసేవలపైనా నేటి నుంచి కొత్త పన్ను
► పన్నుల్లో మార్పులుంటే తర్వాత సర్దుబాట్లకు అవకాశం
► జీఎస్టీ అమలు నోటిఫికేషన్లు రాకపోవడంతో గందరగోళం
► పాత స్టాక్ వదిలించుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లతో మార్కెట్లలో సందడి
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శనివారం నుంచి విక్రయించే దాదాపు 1200 రకాల వస్తువులు, అందించే సేవలకు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వర్తించనుంది. ఇప్పటికే ఉన్న పాత స్టాకును విక్రయించినా కూడా కొత్త పన్నునే వసూలు చేయాల్సి ఉంటుంది. పాత స్టాకు అయినప్పటికీ దానిని విక్రయించినప్పుడు అమల్లో ఉన్న పన్ను వసూలు చేయాల్సి ఉంటుందని.. అందువల్ల శనివారం ఉదయం నుంచి జరిగే అన్ని వ్యాపార లావాదేవీలకు జీఎస్టీ వర్తిస్తుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతమున్న స్టాకు అంతా వ్యాట్, ఇతర కేంద్ర పన్నులతో కొనుగోలు చేసినది కావడంతో ఏ పన్నుపై అమ్మకాలు జరపాలన్న వ్యాపార వర్గాల సందేహాలకు స్పష్టత ఇచ్చారు. ఏవైనా వస్తువులపై పన్ను పెరిగినా, తగ్గినా కొద్దిరోజుల తర్వాత సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని జీఎస్టీ చట్టం కల్పించిందని.. ఈ మేరకు పన్ను వ్యత్యాసాలను సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. దీంతోపాటు వ్యాపారులు తమ వద్ద ఇప్పటికే ఉన్న స్టాక్ వివరాలను నెలరోజుల్లోపు అందజేయాలని కూడా అధికారులు ఆదేశించారు.
నోటిఫికేషన్లు ఏవి?
రాష్ట్రంలో శనివారం నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. జీఎస్టీ అమలుతోపాటు ఆయా వస్తువులపై పన్ను రేటును స్పష్టంగా పేర్కొంటూ.. కచ్చితంగా ఆ రేటుకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ శుక్రవారం రాత్రి వరకు కూడా ఈ నోటిఫికేషన్లేవీ విడు దల కాలేదు.
కనీసం వాణిజ్య పన్నుల శాఖ వెబ్‌సైట్‌లోనూ పెట్టకపోవడం, శాఖాపరంగా క్షేత్రస్థాయికైనా పంపకపోవడంతో ఆ శాఖ ఉద్యోగులు, వ్యాపారుల్లో గందరగోళం నెలకొంది. నోటిఫై చేయకుండా రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి రాదని, అలాంటప్పుడు తాము ఏ పన్ను ప్రకారం వ్యవహరించాలో అర్థం కావడం లేదని కొందరు అధికారులు కూడా సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ సాయికిషోర్ వివరణ ఇస్తూ.. జీఎస్టీ అమలుకు అవసరమైన అన్ని నోటిఫికేషన్లు సిద్ధం చేశామని, పలు ముఖ్యమైన నోటిఫికేషన్లను విడుదల చేశామని, మరికొన్నింటిని త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.
బడా మార్కెట్లలో సందడి
జీఎస్టీతో సరు కుల విక్రయాల్లో మార్పులు రావొ చ్చన్న అంచనాతో పెద్ద వ్యాపార, దుకాణ సముదాయాలు గురు, శుక్రవారాల్లో పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చాయి. 20 నుంచి 60 శాతం వరకు ధరలు తగ్గించడంతో.. హైదరాబాద్‌తో పాటు పట్టణ ప్రాంతా ల్లోని మార్కెట్లలో సందడి కనిపించింది. ఎలక్ట్రానిక్ వస్తువు లపై పన్ను పెరగనుండడంతో పలువురు ముందుగానే కొనుగోలు చేశారు. జీఎస్టీ అమలుకు రెండు, మూడు రోజుల ముందు రాష్ట్ర మార్కెట్లలో వందల కో ట్లలో లావాదేవీలు జరిగినట్లు అంచనా.
అడ్డగోలుగా పెంచొద్దు..
జీఎస్టీ అమల్లోకి వచ్చిన వెంటనే దాదాపు అన్ని సరుకుల (పెట్రోల్, మద్యం మినహా) ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్నింటి ధరలు తగ్గనుండగా.. మరికొన్నింటి ధరలు పెరగ నున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు జీఎస్టీ పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచేయవచ్చని పన్నుల శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో నిత్యావసరాలు, ఇతర ముఖ్య వినియోగ వస్తువుల దుకాణాలు, హోల్‌సేల్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపైనా ఓ కన్నేసి ఉంచారు.
అడ్డగోలుగా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే అధికలబ్ధి నియంత్రణ నిబంధనను ప్రయోగిస్తామని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధన కింద జరిమానాలతో పాటు కేసులు పెట్టే అవకాశం కూడా ఉందని తెలిపారు. పన్ను చెల్లింపు పరిధిలో ఉండే వ్యాపారులు శనివారం నుంచి రూ.200 కన్నా ఎక్కువ విలువైన ప్రతి లావాదేవీకి బిల్లు ఇవ్వాల్సిందేనని.. అందులో సదరు వస్తువుపై పన్ను రేటు, పన్ను మొత్తాన్ని కూడా పేర్కొనాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.