సాక్షి, న్యూఢిల్లీ : మందుల విక్రయాలపై ప్రయివేటు ఆస్పత్రులు ప్రజలను లూటీ చేస్తున్నాయి. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి సేకరించిన బిల్లులను విశ్లేషించిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) విస్తుపోయింది. ఈ ఆస్పత్రులు మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలపై ఏకంగా 1737 శాతం లాభాలు దండుకున్నట్టు ఈ పరిశీలనలో వెల్లడైంది. రోగుల బిల్లుల్లో ఇవి 46 శాతం వరకూ ఉంటాయి. ఆయా మందులు, వైద్య పరికరాల తయారీదారుల కన్నా గరిష్ట ఎంఆర్‌పీలతో ఈ ఆస్పత్రులే భారీగా లాభపడుతున్నాయని ఎన్‌పీపీఏ పేర్కొంది. ఈ మందులు, పరికరాలు, డిస్పోజబుల్స్‌ను ఆయా ఆస్పత్రులు తమ ఫార్మసీల్లోనే కొనుగోలు చేయాలని రోగులను కోరుతుండటంతో అధిక ధర వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది.
పెద్ద మొత్తంలో మందులను ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేస్తుండటంతో తక్కువ ధరకే అవి అందుబాటులోకి వస్తాయని, అయినప్పటికీ ఆయా ఆస్పత్రులు ఎంఆర్‌పీలను విపరీతంగా పెంచి విక్రయిస్తూ ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయని ఎన్‌పీపీఏ నిగ్గుతేల్చింది. కంపెనీల నుంచి పెద్దమొత్తంలో ఆర్డర్లను ఇచ్చే క్రమంలో ఆయా ఆస్పత్రులు డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలను మందుల లేబుల్స్‌పై అధిక ఎంఆర్‌పీ ముద్రించాలని కోరుతున్నాయని పేర్కొంది. దీంతో రోగులు భారీ మొత్తాలను మందుల కోసం వెచ్చించాల్సి వస్తోందని ఎన్‌పీపీఏ ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ర్ట ప్రభుత్వాలే వీటిపై చర్యలు తీసుకుని నియంత్రించాల్సి ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment