ప్రతి 40 కిలోమీటర్లకు పెట్రోలింగ్ వ్యాన్
Published Fri, Dec 20 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
=హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు
=విశాఖ రేంజ్ డీఐజీ ఉమాపతి
అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ 40 కిలోమీటర్లకు ఒక పెట్రోలింగ్ వ్యాన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు విశాఖ రేంజ్ డీఐజీ పి.ఉమాపతి తెలిపారు. ఆయన ఇక్కడి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు 172 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రమాద క్షతగాత్రులను వీటిలో సకాలంలో ఆస్పత్రులకు తరలించే అవకాశముంటుందన్నారు.
ఈ వాహనంలో కెమెరాలు, వైర్‌లెస్ సెట్లు తదితర పరికరాలుంటాయన్నారు. జాతీయ రహదారికి ఆనుకున్న దాబాలపై తరచూ దాడులు నిర్వహించి మద్యం విక్రయాల నిరోధానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపా రు. పాడేరులో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహించి ఆ ప్రాంత యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆస్తుల విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు.
మూడు జిల్లాల్లో 104 సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. వీటిలో విశాఖ జిల్లాకు 27 ఎస్‌ఐ పోస్టులను కేటాయించామని, 109 మంది కానిస్టేబుళ్ల నియామకం కూడా చేపట్టామన్నారు. జనవరి 20 తర్వాత కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం కూడా జరుగుతుందన్నారు. రేంజ్ పరిధిలో 21 కొత్త పోలీస్ భవనాలను నిర్మించినట్టు తెలిపారు. జిల్లాలో రూ.19 లక్షల విలువైన దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నట్టు డీఐజీ వివరించారు. ఆయన వెంట ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, డీఎస్పీ వి.ఎస్.ఆర్.మూర్తి ఉన్నారు.
జిల్లాలో తగ్గిన నేరాల తీవ్రత
మునగపాక: ప్రస్తుతం జిల్లాలో నేరాల తీవ్రత అదుపులోనే ఉందని డీఐజీ పి.ఉమాపతి అన్నారు. మునగపాక పోలీస్‌స్టేషన్‌ను ఆయన గురువారం సందర్శించారు. గౌరవ వందనం స్వీకరించాక విలేకరులతో మాట్లాడుతూ రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాటుతో నేరాలను తగ్గించగలుగుతున్నట్టు తెలిపా రు. అనంతరం ప్రారంభోత్సవానికి నోచుకోని పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని పరిశీలించారు. త్వరలో ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌కు సూచిం చారు. ఆయన వెంట అనకాపల్లి డీఎస్పీ వి.ఎల్ .ఎన్.మూర్తి, రూరల్ సీఐ జి.శ్రీనివాసరావు, మునగపాక ఎస్‌ఐ ఎన్.జోగారావు, ట్రెయినీ ఎస్‌ఐ రవికుమార్ ఉన్నారు.
Advertisement
Advertisement