సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల పనితీరును ఇక ప్రతినెలా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతోపాటు శాఖాధిపతులందరూ ప్రతి నెలా పనితీరు నివేదికలను రూపొందించి 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. నవంబర్ నుంచి పని తీరు నివేదికలను సమర్పించాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఆమోదంతో సీఎం కార్యాలయానికి పంపాలని సూచించారు.
మంత్రులు అందుబాటులో లేకుంటే పనితీరు నివేదికలను ముఖ్యమంత్రికి ఈ-మెయిల్‌లో పంపాలని పేర్కొన్నారు. ప్రాథమికంగా ఆయా శాఖలు చేయాల్సిన పనులు, ఆ నెలలో ఏం చేశారో నివేదికలో పేర్కొనాలి. సమీక్షల్లో ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాలను అమలు చేశారా? గత నెలలో చర్యల నివేదికలోని అంశాలు, కేంద్ర పథకాలు, అంశాల అమలుపై పురోగతి, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల అమలు, పెండింగ్‌లో ఉన్న అంశాల వివరాలను పనితీరు నివేదికల్లో ఐఏఎస్ అధికారులంతా వెల్ల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.