గజపతినగరం, దత్తిరాజేరు, న్యూస్‌లైన్ : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంగపండు నారాయణప్పలనాయుడు మృతితో దత్తిరాజేరు మండలం గోభ్యాం కన్నీటి సంద్రంలో మునిగింది. నారాయణప్పలనాయుడు కొన్ని నెలలుగా గుండె జబ్బుతో బాధపడుతూ గజపతినగరం మండలం పురిటిపెంట న్యూకాలనీలో మృతి చెందారు. అంత్యక్రియలు బుధవారం ఉదయం గోభ్యాంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంగపండు నారాయణప్పలనాయుడు (వీఎన్) 1931లో జన్మించారు. 1956లో ఆ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెదమానాపురం నుంచి ఒకసారి, గజపతినగరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. 1967లో పెదమానాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెం డింట్‌గా పోటీ చేసి, అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడుపై తొలిసారిగా విజయం సాధించారు. .
1978లో గజపతినగరం నియోజకవర్గం నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో ఇండిపెండింట్‌గా పోటీ చేసి టీడీపీ నేత జంపన సత్యనారాయణరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సత్యనారాయణరాజుపై విజయం సా ధించారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యూరు. పోరలి పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికై కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడిగా పదవిలో కొనసాగా రు.
కుటుంబ నేపథ్యం
వంగపండుకి భార్య అక్కమ్మ, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీరామ్మూర్తి దత్తిరాజేరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు నిర్వర్తించారు. చిన్న కుమారుడు కృష్ణ గొభ్యాం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు.
ప్రముఖుల సంతాపం
వంగపండు మృతితో గజపతినగరం పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు, బొండపల్లి మండలాల నుంచి కార్యకరక్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య హైదరాబాద్ నుంచి ఫోన్‌లో వం గపండు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు కడుబండి శ్రీనివాసరావు, వేచలపు చినరామినాయుడు, పెద్దినాయుడు, శారదానాయుడు, మక్కువ శ్రీధర్, మాజీ మంత్రి పడాల అరుణ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె. ఎ. నాయుడు, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు, తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గోభ్యాం చేరిన మృతదేహం
నారాయణప్పలనాయుడు మృతదేహాన్ని సాయంత్రం గ్రామానికి తీసుకువచ్చారు. వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్యయకర్త ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగరావు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు, రామభద్రపురం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పికొండ శ్రీరాములనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు.
వంగపండు మృతి తీరని లోటు : అటవీశాఖ మంత్రి శత్రుచర్ల
విజయనగరం కంటోన్మెంట్ : మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. వంగపండు మృతి పట్ల మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. అలాగే కురుపాం ఎమ్మెల్యే జనార్దనథాట్రాజ్ కూడా నారాయణప్పలనాయుడు మృతికి సంతాపం తెలిపారు.