చోరీకి పాల్పడింది 15 ఏళ్లలోపు వారే.. | In the case of theft suspects arrested by the police | Sakshi
Sakshi News home page

చోరీకి పాల్పడింది 15 ఏళ్లలోపు వారే..

Published Wed, Oct 2 2013 2:30 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

In the case of theft suspects arrested by the police

గజపతినగరం, న్యూస్‌లైన్ : వారిద్దరి వయసూ 15, 12 ఏళ్లు. కానీ.. పెద్ద నేరమే చేశారు. ఓ ఇంట్లో పని చేసిన బాలుడు.. మరో బాలునితో కలసి ఆ ఇంటికే కన్నం వేశాడు. ఇంటి యజమాని లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు. చోరీ ఘటనపై యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు బాలలనూ అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ ఎం.శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. మండలంలోని పురిటిపెంట గ్రామం న్యూకాలనీలో ఎల్లపు సంతోష్‌నవీన్ తల్లి గౌరితో కలసి నివాసం ఉంటున్నాడు. పెదచామలాపల్లి గ్రామంలో డెయిరీఫారానికి సంబంధించి పనులు చేపట్టడంతో ప్రతి రోజూ తల్లితోపాటు ఆయన ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుండేవాడు. గత నెల 29న సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపులు విరగ్గొట్టి ఉన్నాయి. బీరువాలో గల నగదుతోపాటు, బంగారు నగలు అపహరణకు గురైనట్లు గుర్తించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై టి.కామేశ్వరరావు క్లూస్ టీంతో వచ్చి దర్యాప్తు చేపట్టారు. 
 
 ఇంట్లో పని చేసినవాడే...
 దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించారు. గతంలో నవీన్ ఇంట్లో చామలాపల్లి గ్రామానికి చెందిన బాలుడు(12) పని చేసేవాడు. ఇంట్లో పని చేస్తున్న సమయంలో బాలుడు.. యజమాని సెల్‌ఫోన్‌తోపాటు, కొంత మొత్తం నగదును అపహరించాడు. ఇది గమనించిన నవీన్ బాలునిపై చేసుకున్నాడు. ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదని మందలించాడు. ఇది మనసులో పెట్టుకున్న బాలుడు.. యజమానిపై కక్ష పెంచుకున్నాడు. తన పిన్ని కొడుకైన తాడేందరవలస గ్రామానికి చెందిన మరో బాలుడు(15)తో కలసి నవీన్ ఇంట్లో చోరీకి పథకం రచించాడు. గత నెల 29న నవీన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి, బీరువాను పగలగొట్టారు. 
 
 అందులో ఉన్న రూ.92,500 నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి వస్తువులు, రూ.63 వేల విలువ చేసే వీడియో కెమెరా, ఒక ల్యాప్‌టాప్‌ను అపహరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... సోమవారం సాయంత్రం తాడేందరవలస గ్రామంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ మైనర్లే కావడంతో విజయనగరం బాలనేరస్తుల కోర్టుకు అప్పగిస్తున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై టి.కామేశ్వరరావు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement