అకాల కష్టం
వర్షాలతో నిండా మునిగిన రైతన్న
నేలకొరిగిన వరిపంట
తడిసి ముద్దవ్వడంతో నష్టం
పెట్టుబడులు కూడా రావని రైతుల ఆందోళన
మాడుగుల రూరల్, న్యూస్‌లైన్ : ఖరీఫ్‌లో కొంపముంచిన వర్షాలు రబీలోనూ రైతన్నను కష్టాల్లోకి నెట్టేశాయి. ఖరీఫ్‌లో తుఫాన్ వర్షాలతో నష్టపోయిన రైతులు రబీపై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఇప్పుడీ అకాల వర్షాలు వారి ఆశలను సమాధి చేశాయి. మండలంలో 3 వేల ఎకరాల్లో రబీ వరి వేశారు. కౌలురైతులు వేలల్లో పెట్టుబడులు పెట్టారు.
ఫిబ్రవరిలో ఉండే తెగుళ్లు బెడద ఈ సారి లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పంట చేతికి వస్తుండడంతో మంచి దిగుబడులు ఆశించారు. తీరా అకాల వర్షాలతో నిరాశకు గురయ్యారు. అల్పపీడం కారణంగా మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో మరింత ఆందోళన చెందుతున్నారు. తేలికరకం పంట అయిన 1001, ఆర్‌జెఎల్ వరి రకాలు ఇప్పటికే పండిపోయాయి. కొన్నిచోట్ల పంట కోసివేశారు.
అకాల వర్షాలు గాలులతో కోతకు వచ్చిన పంట ఒరిగిపోగా, కోసిన పంట పనులుతడిసిపోయాయి. గింజలు నాని పోయి మొలకలెత్తుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన పంటను హడావుడిగా పొలాల్లోనే కుప్పలు పెడుతున్నా నష్టభయం మాత్రం రైతుల్ని వెంటాడుతోంది. పెద్ద రైతుల నుంచి భూమి తీసుకుని కౌలుకు పండించే వారే ఎక్కువగా నష్టపోయారు.
పంట తడిసిపోయింది
పంట పూర్తిగా తడిసిపోయింది. కొద్దిరోజుల్లో ఇది ముక్కిపోయి రంగుమారుతుంది. దీంతో దిగుబడి తగ్గుతుంది. భారీగా పెట్టిన పెట్టుబడులు అకాల వర్షంతో నష్టపోయాం.
- మళ్ల సత్తిబాబు, కౌలురైతు, కె.జె.పురం
తిండిగింజలు కరువు
తిండిగింజలు కూడా కరువేలా ఉంది. ఖరీఫ్ లో పంటకు తెగుళ్లు సోకడంతో రబీ పంట వేశాం. పంట చేతికం దే దశలో వర్షాలతో పంట తడిసిపోయి మా నోట్లో మట్టి కొట్టాయి.
- బెన్నవోలు నర్సింహం, కౌలురైతు, కె.జె.పురం.
పరిహారం ఇవ్వాలి
అకాల వర్షాలతో పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. దిగుబడులు తగ్గిపోతాయి. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలి.
- బెన్నవోలు నాగేశ్వరరావు, రైతు, కె.జె.పురం.