వాన రాకడ... ప్రాణం పోకడ చెప్పలేమంటారు. చిత్రంగా ఏటా నిర్ణీత సమయానికి వచ్చే తొలకరి చినుకుల రాకడ కూడా ఇప్పుడు దాదాపు అలాగే తయారవుతోంది. నైరుతి ఋతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈసారి అంతకన్నా ముందుగా మే 27 నాటికే ఋతుపవనాలు వస్తాయంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కొంతకాలం క్రితం అంచనా వేసింది. ఆ తర్వాత జూన్ 4 అంటూ కొత్త అంచనా చెప్పింది. తీరా అసలుకే లెక్క తప్పి, జూన్ 7 దాటినా చినుకు జాడ లేకపోవడం గమనార్హం. ఇక, తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం ‘బిప్రజయ్’ సైతం ఈసారి ఋతుపవనాలపై దుష్ప్రభావాన్ని చూపనున్నట్టు తాజా వార్త. అసలే వారానికి పైగా ఆలస్యమైన వానలకు ఇది ఊహించని అవరోధం. తొలకరి చినుకును శాస్త్రీయంగా అంచనా వేయడంలో తప్పుతున్నామా, లేక పర్యావరణంలో మార్పులతో పూర్తిగా లెక్కలే మారిపోతున్నాయా అన్నది ఇప్పుడు జవాబు వెతకాల్సిన ప్రశ్న.
ఋతుపవనాలు వాతావరణ అంశమే కావచ్చు. కానీ భారత ఆర్థికరంగానికి అది అత్యంత కీలకం. దేశానికి ‘అసలైన’ ఆర్థికమంత్రి ఋతుపవనాలే అని ఓ మాజీ రాష్ట్రపతి గతంలో వ్యాఖ్యానించారు. దేశ వార్షిక వర్షపాతంలో 70 శాతానికి పైగా అందించే నైరుతి ప్రాధాన్యానికి ఆ వ్యాఖ్యలే మచ్చుతునక. బిప్రజయ్ దెబ్బతో ఋతుపవనాలు బలహీనమై, వాటి రాకకు మరో 48 గంటలు పట్టవచ్చని శాస్త్రవేత్తల హెచ్చరిక. వరుసగా రెండు రోజులు లక్షద్వీప్, కేరళ, కోస్తా కర్ణాటకలో వానలు కురిస్తేనే ఋతుపవనాలు వచ్చినట్టు లెక్క. ప్రస్తుతం కేరళలో కురుస్తున్న వానలు వాయు గుండం ప్రభావంతోనేనట. పైగా నలుమూలల ఋతుపవనాలు విస్తరించడానికి మరింత సమయం పడుతుందంటున్నారు. కారణాలేమైనా – ఈ జాప్యంతో, బలహీనమైన వానలతో ఈ జూన్‌లో పడాల్సిన వర్షపాతం తగ్గడం అనివార్యం. దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ) వర్షపాతం కనీసం 20 శాతం తగ్గుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంటోంది. ఈ జాప్యాల నడుమ పొలం పనులు కనీసం వారం రోజులు వెనక్కి వెళ్ళకా తప్పదు. వెరసి ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు.
అసలే ఈ ఏడాదీ వేసవిలో ఎండలు దంచేస్తున్నాయి. ఉష్ణపవనాల తాకిడి ఉండనే ఉంది. ఫలితంగా ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువుంటుందని స్కైమెట్ జోస్యం. కొద్ది నెలల క్రితమే చెప్పిన ఈ జోస్యం నిజమై, జూన్ – సెప్టెంబర్‌ల మధ్య సాధారణ వర్షపాతంలో 94 శాతమే కురిస్తే చిక్కులు తప్పవు. ఆసియాలోని మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మనం ఇరుకున పడతాం. వరి, చెరకు లాంటి పంటల దిగుబడి తగ్గి, ఆహార ధరలు అమాంతం పెరుగుతాయి. గమ నిస్తే – నిరుడు మార్చిలో శతాబ్ద కాలంగా ఎన్నడూ లేనంతటి ఉష్ణోగ్రత, ఉడుకెత్తించిన ఉష్ణపవనాల వల్ల గోదుమల ఉత్పత్తి తగ్గింది. కొన్ని ఎగుమతులపై నిషేధం తప్పలేదు. ఈసారీ వ్యావసాయిక ఉత్పత్తులు తగ్గితే కష్టమే. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా హెచ్చి, ఖజానాపై భారం పడుతుంది. కోట్లాది సామాన్యులకు కడుపు నిండా తిండి కష్టమవుతుంది.
నిజానికి, ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలు మనకు నైరుతి ఋతుపవనాల కాలం. వార్షిక వర్షపాతంలో అత్యధికం ఈ సీజన్‌లో కురిసేదే. అందుకే, మన దేశంలో సాంస్కృతికంగానే కాక ఆర్థిక కాలపట్టికలోనూ ఈ ఋతుపవనాలు కేరళను తాకే రోజుకు ప్రత్యేక స్థానం ఉంది. గత పదేళ్ళలో 2018లో, 2022లో ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. గత ఏడాది మే 29కే తొలికరి కురిసింది. అలాగే, గత దశాబ్దిలో అతి ఆలస్యంగా వానలు మొదలైంది 2019లో. ఆ ఏడాది జూన్ 8న కానీ పుడమి తడవలేదు. ఈసారి జాప్యంలో ఆ రికార్డు బద్దలవుతున్నట్టుంది. ఈ ఆలస్యా నికీ, ముందస్తుగానే ముగిసిపోవడానికీ ఎల్ నినో లాంటివి కూడా కారణమని శాస్త్రజ్ఞుల ఉవాచ. ఈ వాతావరణ మార్పుల మధ్య ఋతుపవనాల జోస్యం తప్పకూడదంటే, సమర్థంగా లెక్కలు కట్టాలి.
ఐఎండీ పరిశోధకులు పదేళ్ళ పైగా శ్రమించి, ఏటా ఎప్పుడు, ఎంత వర్షం పడుతుందని అంచనా వేసేందుకు కొత్త విధానం రూపొందించారు. కచ్చిత అంచనాలందించే విధాన రూపకల్పన కోసం 2012లో ఏర్పాటైన నేషనల్ మాన్‌సూన్ మిషన్ సైతం ఫలితమిస్తోంది. చారిత్రక విధానాలపై కాక, అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించే పద్ధతిని అది ప్రవేశపెట్టింది. దానితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 వాతావరణ నమూనాలను పరిగణనలోకి తీసుకొని, విస్తృత సమాచారాన్ని సేకరించి, పరీక్షించి, దక్షిణాసియా వాతావరణానికి సరిపడే నాలుగైదింటిని ఖరారు చేసే శ్రమతో కూడిన పని సాగుతోంది. ఇక, 2016లో ఆమోదించిన కొత్త నిర్వచనాలు, పరామితుల ఆధారంగా ఐఎండీ ఋతుపవనాల రాకను మునుపటి కన్నా మెరుగ్గా అంచనా కట్టి ప్రకటిస్తోంది.
ఇంత చేసినా ప్రతి జూన్‌లో కచ్చితమైన అంచనా కట్టలేకపోతున్న వానల వ్యవహారం చూస్తుంటే, మరింత లోతైన అధ్యయన అవసరం కనిపిస్తోంది. పరిశోధనలు పెరగాల్సిన అగత్యం అర్థమవు తోంది. వాతావరణ మార్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్‌కు అంచనాల్లో కచ్చితత్వం కీలకం. దీనితోనే రైతులకు మార్గదర్శనం, పంటల సంరక్షణ వీలవుతుంది. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రత లతో ఇతర సముద్రాల కన్నా వేగంగా హిందూ మహాసముద్రం వేడెక్కుతోంది. ఫలితంగా భూ, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య తేడా తగ్గిపోతోంది. అంటే, రానున్న ఏళ్ళలో ఋతుపవనాలు మరింత జాప్యమవుతాయని విశ్లేషణ. మారుతున్న పర్యావరణంతో వాన, వాతావరణంపై కచ్చితమైన జోస్యం చెప్పడం సవాలే. కానీ, ఏ సవాలుకైనా శాస్త్ర విజ్ఞానం, సమగ్ర పరిశోధనలే పరిష్కారం కదా!
Comments
Please login to add a commentAdd a comment