జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా అందుకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. కొందరు వాహనచోదకులు నిర్లక్ష్యంగా అతి వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. అలాంటి వారి ఆటకట్టించేందుకు పోలీసులు నడుంబిగించారు. వాహన వేగ పరిమితిని గుర్తించేందుకు అధునాతన పరికరంతో కూడిన వాహనాన్ని జిల్లాకు తీసుకొచ్చారు.
బొబ్బిలి : మితిమీరిన వాహనాల వేగానికి ఇక కళ్లెం పడనుంది. రోడ్డు భద్రతకు విఘాతం కలిగిస్తూ అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్న అతి వేగాన్ని నియంత్రించేందుకు జిల్లా పోలీసు శాఖ నడుం బిగించింది.. రహదారులపై వాహన వేగం పరిమితి, దానిని అధిగమించి వస్తున్న వాహనాలను గమనించి సంబంధిత వాహనచోదకులకు ఆటోమేటిక్‌గా చలానా ఇచ్చే ఆధునిక పద్ధతిలతో కూడిన ఇంటరిసెప్టర్ వాహనాన్ని గురువారం జిల్లాలోని బొబ్బిలికి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒకే వాహనం ఉన్నా మరికొద్ది రోజుల్లో జిల్లాకు పూర్తిస్థాయి వాహనాన్ని తీసుకురానున్నారు. బొబ్బిలి గ్రోత్‌సెంటరులో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడిన నేపథ్యంలో వాహనాన్ని ఇక్కడికి తీసుకొచ్చి వాహనాల వేగాన్ని పరీక్షించారు. దాదాపు సగం వాహనాలు నిర్ణీత వేగానికి మించి రావడం గమనార్హం. అవన్నీ ఇంటరిసెప్టర్ వాహన కెమెరాకు చిక్కాయి. అధిక వేగంతో వెళ్తున్న వారికి అక్కడికక్కడే చెలానాలు ఇచ్చి అపరాధ రుసుం వసూలు చేశారు.
వేగాన్ని కొలిచే యంత్రం..
పోలీసు వాహనం లోపలే ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు అరకిలో మీటరు దూరం నుంచి వాహన వేగాన్ని ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ రహదారిపై ఎంత వేగంతో ప్రయాణించవచ్చో ముందుగానే రికార్డు చేస్తారు. అది దాటి ఒక్క కిలోమీటరు స్పీడులో వెళ్తున్నా యంత్రం నుంచి బీప్ సౌండ్ ఇస్తుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేస్తారు. అప్పటికే వాహన నంబరుతో కూడిన ఓవర్ స్పీడ్ చలానా ప్రింట్ వచ్చేస్తుంది. దీని ఆధారంగా 400 రూపాయలకు తక్కువ లేకుండా అపరాధ రుసుం వసూలు చేస్తారు.
వాహనంపై పీటీ కెమెరా
వాహన వేగంతో పాటు ఎక్కడైనా అల్లర్లు, ఆందోళనలు, వాదనలు జరిగినా వాటిని రికార్డు చేయడానికి వాహనంపై పెన్‌టిల్ (పీటీ) కెమెరాను అమర్చారు. వాహన వేగాన్ని నియంత్రించిన సమయంలో అక్కడికి వచ్చిన వారు ఏదైనా అలజడి చేసినా, వాదోపవాదాలకు దిగినా వెంటనే దీనిని ఆన్ చేస్తారు.
సుమారు 3 కిలోమీటర్లు దూరంలో జరిగిన సంఘటనలు దృశ్యాలు, మాటలన్నీ ఈ యంత్రంలో నమోదవుతాయి. ఈ కెమెరా నాలుగు దిక్కులా తిరుగుతూ దృశ్యాలను రికార్డు చేస్తుంది. వీటిని వాహనంలో కూర్చుని ఎల్‌సీడీలో ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించవచ్చు.
హైదరాబాద్‌లో శిక్షణ పొందాం
ఆధునిక యంత్ర పరికరాలతో వేగాన్ని నిర్ధారించడానికి సంబంధించి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు శిక్షణ పొందాం. అనంతరం విజయనగరంలోనూ శిక్షణ తీసుకున్నాం.
-సీహెచ్‌వీఎస్ నారాయణ,
కానిస్టేబుల్, ఏఆర్ విభాగం
స్పీడున్నోళ్లకు బ్రేక్!
Published Fri, Feb 19 2016 12:09 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement